e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, October 27, 2021
Home హైదరాబాద్‌ ఐటీలో శిఖర ఖ్యాతి..

ఐటీలో శిఖర ఖ్యాతి..

  • నగరబాట పట్టిన దిగ్గజ కంపెనీలు
  • సుస్థిర ప్రభుత్వం..అనుకూల వాతావరణం
  • చక్కటి శాంతిభద్రతలతో ఉద్యోగులకు భరోసా
  • అంతర్జాతీయంగా ప్రీమియర్‌ సిటీగా గుర్తింపు
  • రానున్న 5 ఏండ్లలో 10లక్షలకు చేరనున్న ఉద్యోగులు

ఒకప్పుడు ఐటీ ఉద్యోగమంటే ఏ బెంగళూరుకో, చెన్నైకో వెళ్లేవారు. దొరికిన ఉద్యోగంతో అక్కడే స్థిరపడేవారు. పరిస్థితి మారింది. ప్రస్తుతం హైదరాబాద్‌ ఐటీ కేంద్రంగా విరాజిల్లుతోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పాలసీ, అనుకూల విధానాలు, చక్కటి వాతావరణంతో నగరంలో ప్రపంచస్థాయి ఐటీ కంపెనీలు కొలువుదీరాయి. భారీ రాయితీలతోపాటు త్వరగా అనుమతుల మంజూరు, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయడంతో ప్రముఖ కంపెనీలు నగరబాట పడుతున్నాయి. ప్రధానంగా స్టార్టప్‌లను వెన్నుతట్టేందుకు ప్రభుత్వం గచ్చిబౌలి ట్రిఫుల్‌ ఐటీలో టీ-హబ్‌ తొలిదశను ప్రారంభించింది. ఇప్పటికే 1200 స్టార్టప్‌లు దిగ్విజయంగా నడుస్తుండగా, మరిన్ని స్టార్టప్‌లకు అండగా నిలిచేందుకు టీ-హబ్‌ రెండోదశను చేపట్టింది.

నూతన పాలసీతో బోలెడు ఉద్యోగాలు

ప్రతి ఐదేండ్లకోసారి ప్రభుత్వం నూతన ఐటీ పాలసీని విడుదల చేస్తున్నది. మొదటి విడుత పాలసీ 2016-2021 వరకు ఉండగా, ఐటీ మంత్రి కేటీఆర్‌ గురువారం రెండో ఐటీ పాలసీని విడుదల చేశారు. 2016లో నగరంలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 4 లక్షలు. 2021 నాటికి 6.25 లక్షలకు చేరింది. 2026 నాటికి 10 లక్షలకు చేర్చడమే నూతన పాలసీ ప్రధాన లక్ష్యం.

- Advertisement -

సిటీబ్యూరో, సెప్టెంబరు 16 (నమస్తే తెలంగాణ) : చారిత్రక వారసత్వ సంపదకు నిలయంగా ఉన్న హైదరాబాద్‌ మహానగరం ఆధునిక నగరంగా అత్యున్నతంగా ఎదుగుతున్నది. అభివృద్ధిలో దూకుడు ప్రదర్శించి దేశంలోనే ఒక ప్రీమియర్‌ సిటీగా గుర్తింపు పొందింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఐదేండ్లకోసారి తీసుకొస్తున్న ఐటీ పాలసీతో నగరం దినదినాభివృద్ధి చెందుతోంది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక ఐటీ కంపెనీలకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా హైదరాబాద్‌ మారింది. ఆధునికయుగంలో ఇన్పర్మేషన్‌ టెక్నాలజీ హబ్‌గా ఆసియా ఖండంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది.

బెంగళూరుకు పోటీగా…

ఇప్పటివరకు భారతదేశ సిలికాన్‌ వ్యాలీగా ఉన్న బెంగళూరు నగరానికి గట్టి పోటీనిస్తూ ఐటీ రంగంలో హైదరాబాద్‌ చెరగని ముద్ర వేసుకుంది. దీనికి ప్రధాన కారణం తెలంగాణ ప్రభుత్వం 2016లో తీసుకువచ్చిన మొట్టమొదటి ఐటీ పాలసీయే. దీనికి తోడు సుస్థిర పాలన, మెరుగైన వసతులు ఉండడంతో ఏడేండ్లలో హైదరాబాద్‌లో ఐటీ రంగం వాయువేగంతో వృద్ధి చెందింది. ఫలితంగా ప్రపంచంలోని దిగ్గజ ఐటీ కంపెనీలన్నీ హైదరాబాద్‌కు క్యూ కట్టాయి. మెక్రోసాఫ్ట్‌ను మినహాయిస్తే గూగుల్‌, ఆపిల్‌, అమెజాన్‌, ఫేస్‌బుక్‌ , సేల్స్‌ఫోర్స్‌ ఐటీ కంపెనీలతో పాటు బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ సేవల సంస్థలు నగరంలోనే తమ అతి పెద్ద కార్యాలయాలను ఏర్పాటు చేశాయి. కరోనా వంటి కష్టకాలంలోనూ ఐటీ కంపెనీలు ఇక్కడ భారీ పెట్టుబడులు పెట్టడం విశేషం. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రెండో ఐటీ పాలసీతో ఐటీ రంగం మరింత ఉన్నతస్థితికి చేరడంతో పాటు నగరానికి మరిన్ని పేరు ప్రఖ్యాతులు వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఎలక్ట్రానిక్స్‌ వింగ్‌తో రూ.75వేల కోట్ల పెట్టుబడులు…

ఐటీ తర్వాత భవిష్యత్‌ అంతా ఎలక్ట్రానిక్స్‌ రంగానికి ఉంటుందని అంచనా వేసిన తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌ చుట్టూ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల పరిశ్రమల ఏర్పాటుకు ప్రత్యేక పాలసీలు రూపొందించింది. 2016-2021 వరకు ఎలక్ట్రానిక్స్‌ రంగంలో రూ.16వేల కోట్ల పెట్టుబడులు రాగా, 2021-26 మధ్యకాలంలో రూ.75వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఎలక్ట్రానిక్‌ పరిశ్రమల ఏర్పాటుకు మహానగరం చుట్టూ సుమారు 2వేల ఎకరాల్లో 6 ఇండస్ట్రియల్‌ పార్కులను ఏర్పాటు చేసింది. ఇందులో పని చేసేందుకు 2లక్షల మంది నైపుణ్యం కలిగిన నిపుణులు అవసరం ఉంటారు. అయితే తొలి దశలో 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులో వస్తుండగా, దీంట్లో కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు, మొబైల్‌ ఉత్పత్తులు, ఈవీ, న్యూ ఎనర్జీ మాన్యుఫ్యాక్చరింగ్‌, సోలార్‌ సెల్‌, మాడ్యూల్స్‌, ఐటీ హర్డ్‌వేర్‌, టెలికం ఉపకరణాలు తయారు చేస్తారు.

డేటా సెంటర్స్‌కు కేరాఫ్‌…

ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీల డేటా సెంటర్లకు మహానగరం కేరాఫ్‌గా నిలుస్తున్నది. ఇప్పటికే అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌ కంపెనీలు ఇక్కడ భారీ డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం చూపెడుతున్న ప్రత్యేక చొరవతో మరిన్ని కంపెనీలు డేటా సెంటర్ల ఏర్పాటుకు ముందుకు వస్తున్నాయి. ఆసియా ఖండంలోనే హైదరాబాద్‌ నగరంలో భౌగోళికంగా అనుకూల వాతావరణం ఉండడం, ఇక్కడ మానవ వనరులు పుష్కలంగా లభిస్తుండడంతో దిగ్గజ కంపెనీలన్నీ డేటా సెంటర్ల నిర్మాణానికి ఆసక్తి చూపుతున్నాయి.

హైదరాబాద్‌ నుంచే ప్రస్థానం

ఐటీ రంగంలో మంచి పేరున్న కంపెనీగా ఎదిగిన సైంట్‌ కంపెనీ ప్రస్థానం హైదరాబాద్‌ కేంద్రంగానే ప్రారంభమైంది. ఇక్కడి అనుకూల వాతావరణమే ఐటీ రంగంలో దినదినాభివృద్ధి చెందేందుకు కారణమైంది. మా సంస్థ కార్యకలాపాలను హైదరాబాద్‌తో పాటు వరంగల్‌లోనూ ప్రారంభించాం. తెలంగాణ ప్రభుత్వం ఐటీ పరిశ్రమలతో విద్యాసంస్థలను అనుసంధానం చేసి ఐటీ రంగానికి నైపుణ్యం కలిగిన మానవవనరులను తయారు చేయాల్సిన అవసరం ఉంది.- బి.వి.ఆర్‌ మోహన్‌రెడ్డి, ఫౌండర్‌ చైర్మన్‌, సైంట్‌ కంపెనీ

ప్రభుత్వ ప్రోత్సాహం బాగుంది

హైదరాబాద్‌ కేంద్రంగా ఐటీ రంగంలో అత్యధిక ఉద్యోగాలను కల్పించిన సంస్థగా టాటా కన్సల్టెన్సీ సంస్థ నిలిచింది. ఆదిభట్లతో పాటు మాదాపూర్‌ హైటెక్‌సిటీ, రాయదుర్గం, గచ్చిబౌలి డిస్ట్రిక్‌లో మొత్తం 62 వేల మంది ఐటీ ఉద్యోగులు టీసీఎస్‌లో పని చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్‌ పూర్తి సహాయ సహకారాలను అందించారు. 2017లో ఆదిభట్ల టీసీఎస్‌ క్యాంపస్‌ భద్రతపై సీఎం కేసీఆర్‌ను సంప్రదించి చర్చిస్తే, రెండువారాల్లోనే ఆదిభట్లలో పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు చేయించారు. ఇలా ప్రభుత్వ పరంగా ఐటీ రంగానికి అన్ని విధాలుగా మంచి ప్రోత్సాహం ఉంది.- రాజన్న, ఉపాధ్యక్షులు, టీసీఎస్‌

క్లౌడ్‌ ప్రొవైడర్స్‌కు సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ

ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ వినియోగంలో తెలంగాణ ఎంతో ముందంజలో ఉంది. ఇన్నోవేషన్‌కు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ వివిధ రంగాలకు చెందిన వారిని ఇందులో భాగస్వామ్యం చేస్తున్నాం. ఇప్పటికే దేశంలోని స్టార్టప్‌లకు హైదరాబాద్‌ కేంద్రంగా మారింది. ముఖ్యంగా క్లౌడ్‌ కంప్యూటింగ్‌ కంపెనీలు ఇక్కడే తమ కార్యాలయాలను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చాయి. దానికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం రెండో ఐటీ పాలసీలో క్లౌడ్‌ కంప్యూటింగ్‌ పాలసీని తీసుకువస్తోంది. క్లౌడ్‌ కంప్యూటింగ్‌లో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. – జయేశ్‌ రంజన్‌, ఐటీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement