e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, September 16, 2021
Home News Return to office | ఆఫీసువైపే టెకీల మొగ్గు.. మ‌రి ఐటీ కంపెనీల ఆలోచ‌న ఏంటి?

Return to office | ఆఫీసువైపే టెకీల మొగ్గు.. మ‌రి ఐటీ కంపెనీల ఆలోచ‌న ఏంటి?

పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్‌ పూర్తి కావడం, కరోనా దాదాపుగా నియంత్రణలోకి రావడంతో ఐటీ పరిశ్రమలు ఇక ఉద్యోగులను తమ ఆఫీసులకు పిలిపించే పనిలో పడ్డాయి. రిటర్న్‌ టు ఆఫీస్‌ (ఆర్‌టీవో ) ( return to office ) కోసం ప్రత్యేక ప్రణాళికలు తయారుచేస్తున్నాయి. దాదాపుగా 5 లక్షల మందికిపైగా ఉద్యోగులు ఉన్న టీసీఎస్‌ కంపెనీ మొన్ననే ఆర్టీవోపై ప్రకటన చేయగా.. మరో పెద్ద కంపెనీ విప్రో నిన్న, ఫ్యాక్‌సెట్‌ కంపెనీ నేడు తమ ఉద్యోగులకు ఆఫీసులకు వచ్చి పని చేయాలని సంకేతాలు ఇచ్చింది. వీటితో పాటు అనేక బడా కంపెనీలు కూడా ఒకట్రెండు నెలల్లో ఇదే బాటలో పయనించేందుకు అనువుగా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఏడాదిన్నరగా వర్క్‌ ఫ్రం హోమ్‌తో విసిగిపోయిన ఉద్యోగులను కార్యాలయాలకు పిలిపించి ‘సోషల్‌ కనెక్ట్‌’ పద్ధతిలో పని చేయించాలని కంపెనీలు స్పష్టతకు వచ్చినట్టు తెలుస్తున్నది.

Return to office

హైదరాబాద్‌ నగరంలో చిన్నా పెద్దా కలిసి దాదాపు 600కు పైగా కంపెనీల్లో సుమారు ఆరున్నర లక్షల మంది ఐటీ ఉద్యోగులు పని చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో నిన్నమొన్నటి వరకు దాదాపు 95 శాతం పైగా ఉద్యోగులు ఇంటి నుంచే పని చేస్తుండడంతో ఐటీ కారిడార్‌ పూర్తిగా బోసిపోయింది. ఆ కంపెనీలపై ఆధారపడ్డ చిన్న చిన్న అనుబంధ రంగాలు కుదేలయ్యాయి. టెకీల సందడి లేకుండా పోయింది. కాగా, ప్రస్తుతం కంపెనీల నుంచి వస్తున్న పిలుపుతో చాలామంది ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

హైదరాబాద్‌ నగరానికి ప్రపంచపటంలో గుర్తింపు తెచ్చిన ఐటీ రంగం సందడి మళ్లీ నగర రహదారులపై కనిపించనున్నది. ఏడాదిన్నరగా కరోనా నేపథ్యంలో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌లోకి వెళ్లిన ఈ రంగం… పూర్వ వైభవాన్ని ప్రదర్శించే దిశగా అడుగులు వేస్తున్నది. ప్రతిష్టాత్మక టీసీఎస్‌ కంపెనీ మొన్ననే రిటర్న్‌ టు ఆఫీస్‌ (ఆర్‌టీవో)పై ప్రకటన చేయగా… నిన్న విప్రో కంపెనీ తామూ ఆ దిశగా పయనాన్ని ప్రారంభించినట్లు స్పష్టం చేసింది. ఇక… ఉద్యోగులు ఆఫీసులకు వచ్చేందుకు సిద్ధంగా ఉండాలని తాజాగా ఫ్యాక్ట్‌సెట్‌ సంకేతాలు ఇచ్చింది. ఇవే కాదు… అనేక ఐటీ కంపెనీలు ఒకట్రెండు నెలల్లో ఉద్యోగులను ఆఫీసుకు రప్పించేందుకు ముందస్తుగానే సమాచారాన్ని అందిస్తున్నాయి. ఏడాదిన్నరగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌తో విసిగిపోయిన ఉద్యోగులు ఆఫీసులకు వచ్చేందుకు ఉవ్విళ్లూరుతుండటంతో త్వరలోనే నగరంలో ప్రత్యక్షంగా టెకీల సందడి మొదలుకానున్నది.

కరోనా రెండో దశ తర్వాత ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు వస్తున్నాయి. మూడో దశ ముప్పు ఛాయలు స్పష్టంగా లేకపోవడంతో ఐటీ రంగం వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కు స్వస్తి పలికేలా కనిపిస్తున్నది. రాష్ట్రంలోని అన్ని రంగాలు సాధారణ రోజుల్లాగే తమ కార్యకలాపాల్ని కొనసాగిస్తుండగా… కీలకమైన విద్యారంగంలో ప్రభుత్వం ప్రత్యక్ష బోధనలకు ఇటీవలనే అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఐటీ రంగం కూడా ‘రిటర్న్‌ టు ఆఫీస్‌ (ఆర్టీవో) వైపు దృష్టి సారించింది. హైదరాబాద్‌ కేంద్రంగా దాదాపు 600 కంపెనీల్లో సుమారు ఆరున్నర లక్షల మంది వరకు పని చేస్తున్నారు. నిన్నటిదాకా 95 శాతం మంది ఉద్యోగులు ఇంటి నుంచే పని చేస్తుండటంతో నగరంలో టెకీల సందడి లేకుండా పోయింది. అయితే నాలుగైదు రోజులుగా ఐటీ కంపెనీల నుంచి కనిపిస్తున్న ఆశావాహ పరిస్థితులతో రానున్న ఒకట్రెండు నెలల్లో ఐటీ కారిడార్‌ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందనే ధీమా కనిపిస్తున్నది. దేశంలోనే అతి పెద్ద ఐటీ కంపెనీగా ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) ఈ ఏడాది చివరినాటికి తమ ఉద్యోగుల్లో 70 నుంచి 80 శాతం మందిని కార్యాలయాల నుంచి పని చేయించే యోచనలో ఉన్నట్లు ఆ సంస్థ సీఈవో ఇటీవల ప్రకటించారు. నిన్నటికి నిన్న విప్రో కంపెనీ కూడా రిటర్న్‌ టు ఆఫీస్‌పై దృష్టి సారించింది. అయితే తొలుత ఆయా విభాగాల్లో ముఖ్యమైన వారిని మాత్రమే కార్యాలయానికి రప్పించనున్నది. ఆపై దశలవారీగా అందరినీ పిలిచేందుకు కసరత్తు మొదలుపెట్టింది. తాజాగా రాయదుర్గం కేంద్రంగా రెండు వేల మంది ఉద్యోగులతో ఉన్న ఫ్యాక్ట్‌సెట్‌ కూడా ఉద్యోగులను రప్పించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. మున్ముందు మరిన్ని కంపెనీలు బహిరంగంగా ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఆఫీసువైపే టెకీల మొగ్గు…

ఏడాదిన్నరగా టెకీలు వర్క్‌ ఫ్రమ్‌ హోం చేస్తున్నందున శారీరకంగా, మానసికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా సహ ఉద్యోగులతో కలిసి పని చేయడం, వారితో సరదాగా గడిపే సమయాన్ని వాళ్లు కోల్పోతున్నారు. పైగా ఇంటి నుంచే ఏడాదిన్నరగా పని చేస్తుండటంతో పని వాతావరణం లేక మానసిక ఒత్తిడికి లోనవుతున్న వారూ ఉన్నారు. దీంతో పాటు ఇంటి నుంచే పని చేస్తున్నందున కంపెనీలు ఎక్కువ సమయం పని చేయిస్తున్నాయి. దీని వల్ల పని భారం పెరిగి, బయట సరదాగా, వినోదంగా గడిపే పరిస్థితి లేదని పలువురు ఐటీ ద్యోగులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఎప్పుడు ఆఫీసుకు పిలుస్తారా? అని ఎదురుచూసే టెకీలే ఎక్కువగా ఉన్నారు. ప్రధానంగా టెకీలు అందరూ కుటుంబాలతో వ్యాక్సిన్‌ వేయించుకోవడంతో తాజా టెండ్‌ ఇదేవిధంగా ఉంటే పెద్దగా ముప్పు ఉండదని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ముమ్మరంగా నోటీసులు..

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ దరిమిలా ఉద్యోగులు హైదరాబాద్‌లో ఇళ్లు ఖాళీ చేసి సొంత ప్రాంతాలకు వెళ్లిపోవడం, ఇతర కారణాల దృష్ట్యా నెల రోజుల ముందుగానే ఈ-మెయిల్‌, ఇతర మార్గాల ద్వారా సమాచారాన్ని అందిస్తున్నారు. ఈలోగా కరోనా మూడో దశపైనా ఒక స్పష్టత వస్తుందని కంపెనీవర్గాలు యోచిస్తున్నాయి. తొలుత 25 శాతం, ఆపై 50 శాతం… ఇలా అంచెలంచెలుగా ఉద్యోగులను కార్యాలయాల నుంచి పని చేయించేందుకు కంపెనీలు సన్నాహాలు చేస్తున్నాయి. కరోనా దరిమిలా బలవంతంగా కార్యాలయాలకు రప్పించేందుకు మాత్రం కంపెనీలు సిద్ధంగా లేవని ఒక ఐటీ కంపెనీ ప్రతినిధి తెలిపారు. ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేస్తున్నా, కంపెనీలకు అన్ని విధాలుగా లాభదాయకంగానే ఉండడంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం లేదని, కరోనా తీవ్రత ఆధారంగా కంపెనీల నిర్ణయాలుంటాయని ఆయన స్పష్టం చేశారు.

ఆచితూచి కంపెనీల అడుగులు..

  • కరోనా మూడో దశ ప్రభావం ఆగస్టు నుంచి సెప్టెంబర్‌ వరకు ఉంటుందని భావించినా, ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. దీంతో ఉద్యోగుల నుంచి సుముఖత వ్యక్తమవుతున్నా… బడా ఐటీ కంపెనీలు మాత్రం రిటర్న్‌ టు ఆఫీస్‌పై ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. ఇందుకు పలు ప్రధాన కారణాలు ఉన్నట్లుగా ఐటీవర్గాలు పేర్కొంటున్నాయి.
  • ఒకట్రెండు నెలలు వేచి ఉండటం ద్వారా మూడో వేవ్‌పై పూర్తి స్పష్టత వస్తుంది.
  • ఇప్పటికిప్పుడు ఉద్యోగులను ఆఫీసు నుంచి పని చేయించడం ద్వారా ఒక్కసారిగా కేసులు పెరిగితే మళ్లీ అంతరాయం కలుగుతుంది.
  • ఉద్యోగుల వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వల్ల ఆర్థికంగా ఎలాంటి నష్టం లేకపోగా… కార్యాలయాల నిర్వహణ భారం కూడా తగ్గింది.
  • ప్రస్తుతం ఉద్యోగులను కార్యాలయాలకు రప్పిస్తే కరోనా నిబంధనలకు అనుగుణంగా నిర్వహణ ఉండాలి. ఈ క్రమంలో నిర్వహణ భారం పెరగడంతో పాటు ప్రధానంగా ఆఫీస్‌ స్పేస్‌ సమస్యగా మారే అవకాశాలున్నాయి.
  • అందుకే అక్టోబర్‌ వరకు వేచి చూసి నవంబర్‌, లేదా డిసెంబర్‌ నుంచి ఉద్యోగులను ఆఫీసుకు రప్పించేందుకు కొన్ని కంపెనీలు సిద్ధమవుతున్నాయి.
  • చిన్న కంపెనీలయితే ఇప్పటికే 50:50 దామాషాలో తమ ఉద్యోగులను కార్యాలయాలకు పిలుస్తున్నాయి.
  • ఉద్యోగులే తమంతట తాముగా ఆఫీసుకు వస్తామంటే, రెండు డోసుల వ్యాక్సిన్‌ వేయించుకొని, ఆరోగ్యంగా ఉంటే అభ్యంతరం తెలపడం లేదు. హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న ఎంఎన్‌సీ కంపెనీలు మినహాయిస్తే చిన్న, మధ్య స్థాయి ఐటీ కంపెనీల్లో ఐటీ ఉద్యోగులు ఆఫీసులకు వచ్చి పనిచేస్తున్నారు.

ఉద్యోగులను రప్పించేందుకే మొగ్గు

ప్రస్తుత పరిస్థితులను పరిగణలోకి తీసుకొని ఐటీ ఉద్యోగులను ఆఫీసులకు రప్పించే ప్రయత్నాలు పలు కంపెనీలు చేస్తున్నాయి. మెజారిటీ ఉద్యోగులు ఆఫీసుకు వచ్చి పని చేయడానికే మొగ్గు చూపుతున్నారు. ఇదే విషయాన్ని తమ టీమ్‌ హెడ్స్‌కు, కంపెనీలకు సూచిస్తున్నారు. దీంతో పలు కంపెనీలు 15-30 రోజుల సమయం ఇచ్చి ఆఫీసుకు వచ్చి పని చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. కాకపోతే అందరూ ఒకేసారి కాకుండా కీలకమైన ఉద్యోగులు, ఆసక్తి ఉన్న వారికి ముందుగా అవకాశం కల్పిస్తున్నారు. వచ్చే 2-3 నెలల్లో మెజారిటీ ఐటీ ఉద్యోగులు ఆఫీసు నుంచి పని చేసే అవకాశం ఉంది.

– రమేశ్‌ లోగ్‌నాథన్‌, మాజీ అధ్యక్షులు హైసియా

(హైదరాబాద్‌ సాప్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ అసోసియేషన్‌)

ఆఫీసుకు వెళ్లాలని ఉంది

కరోనా కారణంగా ఇంటి నుంచి పని చేయడం ఏడాదిన్నర దాటింది. ఇంట్లో ఉండి గంటల తరబడి ఆఫీసు పని చేయాలంటే ఇబ్బందిగా ఉంది. శారీరక, మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఇలా ఎక్కువ రోజులు చేయలేం.. ఆఫీసుకు వెళ్లి పనిచేయాలని ఉంది. ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్నాం. కంపెనీలు రమ్మని పిలిస్తే వెంటనే వెళ్లిపోతాం. మా ఆఫీసు వారయితే నవంబర్‌ నుంచి రమ్మని పిలిచే అవకాశం ఉందని టీమ్‌ లీడర్‌ తెలిపారు.

– మాత్రు నాయక్‌, ఐటీ ఉద్యోగి

ఆర్టీవోపై కంపెనీల దృష్టి

ఐటీ ఉద్యోగులను దశల వారీగా కార్యాలయాలకు పిలిచేందుకు ఆయా కంపెనీలు ఇప్పటికే తమ ఉద్యోగులుకు సమాచారం అందించారు. నవంబరు, డిసెంబర్‌, జనవరి నుంచి ఆఫీసు నుంచే పనిచేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. జనవరి-2022 నాటికి పూర్తి స్థాయిలో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ స్వస్తి పలకనున్నారు. పాఠశాలలు తెరవడంతో ఉద్యోగులు నగరానికి వస్తున్నారు. అలా వచ్చిన వారంతా ఆఫీసుకు వచ్చేందుకే ఆసక్తి చూపుతున్నారు.

– కృష్ణ ఏదుల, సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ కార్యదర్శి

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

JNTU : కొలువులిచ్చే కొత్త కోర్సులు.. ఈ ఏడాది కొత్త‌గా 6 కోర్సులు ప్రారంభం

Hyderabad IT Corridor | ఆఫీస్‌ స్పేస్‌లో హైదరాబాద్‌ దూకుడు.. బెంగళూరుతో పోటా పోటీ

ఐటీ కారిడార్‌లో..మరో రాచమార్గం

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana