e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 12, 2021
Home హైదరాబాద్‌ ఐటీలో మేటి.. ఉపాధిలో మొదటి

ఐటీలో మేటి.. ఉపాధిలో మొదటి

ఐటీలో మేటి.. ఉపాధిలో మొదటి
  • పెట్టుబడులతో నగరానికి క్యూకట్టిన కంపెనీలు
  • ఆటుపోట్లు వచ్చినా.. నిలకడగా రియల్‌ రంగం
  • రెట్టింపైన ఐటీ ఎగుమతులు

సిటీబ్యూరో,జూన్‌ 1 (నమస్తే తెలంగాణ) : ఒకప్పుడు ఐటీ అంటే బెంగళూరు. ఇప్పుడు హైదరాబాద్‌ పేరు అంతర్జాతీయంగా మార్మోగుతోంది. జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు నగరంలో కొలువుదీరాయి. సరికొత్త రికార్డులు సృష్టించి ఏడేండ్ల వ్యవధిలోనే రెట్టింపు స్థాయి ఎగుమతులు సాధించింది భాగ్యనగరం. ఐటీ రంగంలో సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ ఏర్పాటు చేసిన టీ-హబ్‌ స్టార్టప్‌లకు సరికొత్త నిర్వచనంగా మారింది. 2013-14లో ఐటీ ఎగుమతులు రూ.57,258 లక్షలు కాగా, 2019-20లో రూ.1,28,807, 2020-21లో రూ.1.40 కోట్లు ఎగుమతులు అయ్యాయి.

వాక్‌ టు వర్క్‌ కాన్సెప్ట్‌తో మాదాపూర్‌, గచ్చిబౌలి,కొండాపూర్‌, నానక్‌రాంగూడ, రాయదుర్గం, కోకాపేట ప్రాంతాల్లో ఐటీ ,ఐటీఈఎస్‌ సంస్థల కార్యాలయాలు, వాటి పక్కనే నివాస గృహాలు వెలుస్తుండడంతో ఐటీ కారిడార్‌ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నది. ఐటీ కంపెనీలతో నగరం ఒకవైపే అభివృద్ధి చెందుతోందని గుర్తించిన ప్రభుత్వం నగరం నలుమూలాల ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసేందుకు గ్రిడ్‌ పాలసీని తీసుకొచ్చింది. నగరానికి తూర్పు, ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో ఐటీ, ఐటీఈఎస్‌ కంపెనీలు ఏర్పాటు చేసే వారికి రాయితీలిస్తూ ప్రోత్సహిస్తోంది.

ఉపాధి గని.. మహానగరి

హైదరాబాద్‌ అంటే మినీ ఇండియా. ఇక్కడ అన్ని రాష్ట్రాల వారు ఉపాధి పొందుతుండడంతోపాటు స్థిరనివాసం ఏర్పర్చుకున్నారు. ఒక్క ఐటీ రంగంలోనే సుమారు 5.60 లక్షల ఉద్యోగులు ఉంటే వారిలో సగం మంది వివిధ రాష్ర్ర్టాలకు చెందిన వారే. భవన నిర్మాణ రంగంలో దాదాపు 10 లక్షలమంది పనిచేస్తున్నారు. పరిశ్రమలైతే నగరం చుట్టూనే పదుల సంఖ్యలో పారిశ్రామికవాడలు అందులోనూ లక్షలాదిమంది ఉపాధి పొందుతున్నారు.

ఆపత్కాలంలోనూ రియల్‌ పరుగులు

రియల్‌ ఎస్టేట్‌ రంగంలో భాగ్యనగరం తారాజువ్వలా దూసుకుపోతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో 2019 మూడో త్రైమాసికంలో కార్యాలయాల ఏర్పాటుకు హైదరాబాద్‌కే చాలామంది ప్రాధాన్యమిచ్చినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. దాదాపు 40 శాతం పెరుగుదల హైదరాబాద్‌లో ఆఫీసు స్పేస్‌ వినియోగంలో కనిపించింది. ఐటీ కారిడార్‌లో వ్యాపార, వాణిజ్య సముదాయాల ఏర్పాటు మాత్రమే కాకుండా రెసిడెన్షియల్‌ విభాగంలో కూడా హైదరాబాద్‌ 2014 నుంచి ఇప్పటివరకు 48 శాతం వృద్ధిని కనబర్చిందని రియల్‌ మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు.

గ్రేటర్‌లో మెరుగైన విద్యుత్‌ సరఫరా

తెలంగాణ ఆవిర్భావం నుండి కరెంటు సమస్యకు ముగింపు పలికారు. 2014 నాటికి గ్రేటర్‌ పరిధిలో 33/11 కేవీ సబ్‌స్టేషన్లు 333 ఉంటే వాటిని 465కు పెంచింది. అడిషనల్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు 2014 నాటికి 76096 ఉంటే 2020 అక్టోబర్‌ నాటికి 1,19,119 ఏర్పాటు చేసింది. 2014-15 నాటికి విద్యుత్‌ డిమాండు 2261 మెగావాట్లు ఉండగా, వినియోగం 14,528 మిలియన్‌ యూనిట్లు. అదే 2019-20 నాటికి విద్యుత్‌ డిమాండు 3391 మెగావాట్లు, వినియోగం 20939 మిలియన్‌ యూనిట్లు ఉంది. 2014 నుంచి ఇప్పటి వరకు గ్రేటర్‌ పరిధిలో నిరంతర,నాణ్యమైన విద్యుత్‌ సరఫరా కోసం ఒకేసారి రూ.2414.93 కోట్లు ఖర్చు చేసింది.

గ్రేటర్‌ చుట్టూ పారిశ్రామిక ప్రగతి

దేశంలోనే తొలిసారి ప్రభుత్వం ఆన్‌లైన్‌లో అనుమతులు పొందేలా టీఎస్‌ ఐపాస్‌ తీసుకొచ్చింది. కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు దేశ,విదేశీ కంపెనీలు నగరానికి క్యూ కడుతున్నాయి. బాలానగర్‌,జీడిమెట్ల పారిశ్రామికవాడలను మించి, ప్రపంచస్థాయి ప్రమాణాలతో పారిశ్రామికవాడలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తోంది. ఇప్పటికే పదుల సంఖ్యలో పారిశ్రామికవాడలను ఏర్పాటు చేసింది. ఫలితంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు రాగా, ఉద్యోగ,ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరిగాయి. ఔటర్‌ లోపల ఉన్న సుమారు 800 పరిశ్రమలను బయటకు తరలించడం ద్వారా అక్కడ కొత్తగా ఉపాధి అవకాశాలు వస్తుండగా, పాత పరిశ్రమల స్థానంలో వ్యాపార, వాణిజ్య కార్యాలయాలు, నివాస గృహాలను నిర్మించే ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఐటీలో మేటి.. ఉపాధిలో మొదటి

ట్రెండింగ్‌

Advertisement