శుక్రవారం 04 డిసెంబర్ 2020
Hyderabad - Jun 15, 2020 , 23:06:47

ఎయిర్‌టెల్‌కు నోటీసులు..!

ఎయిర్‌టెల్‌కు నోటీసులు..!

యజమాని ఉండగానే.. గుర్తు తెలియని వ్యక్తులకు సిమ్‌ జారీ

ఖాతాలు ఖాళీ చేస్తున్న సైబర్‌ హ్యాకర్లపై సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సీరియస్‌

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: సిమ్‌కార్డులు బ్లాక్‌ చేసి.. వ్యాపారుల బ్యాంకు ఖాతాల నుంచి భారీగా సొమ్మును కొట్టేస్తున్న సైబర్‌నేరగాళ్ల వ్యవహారాన్ని హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఇటీవల జరిగిన రెండు ఘటనల్లో బాధితుల సెల్‌ఫోన్‌ను సైబర్‌ నేరగాళ్లు బ్లాక్‌ చేశారు. ఒక సిమ్‌ కార్డు యాక్టివ్‌గా ఉన్న సమయంలో దానిని బ్లాక్‌ చేసి.. మరొకరికి అదే సిమ్‌కార్డు జారీ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ అంశంపై ఆయా సిమ్‌కార్డు సర్వీస్‌ ప్రొవైడర్ల నిర్లక్ష్యంపై సోమవారం ఎయిర్‌టెల్‌కు నోటీసులు జారీ చేశారు.  15 రోజుల వ్యవధిలో సికింద్రాబాద్‌కు చెందిన ఒక వ్యాపారి మూడు బ్యాంకు కరెంట్‌ ఖాతాల నుంచి రూ. 38 లక్షలు, అమీర్‌పేట్‌కు చెందిన ఓ నిర్మాణ సంస్థ ఖాతా నుంచి రూ. 50 లక్షలు సైబర్‌నేరగాళ్లు కొట్టేసిన విషయం తెలిసిందే. ఈ రెండు మోసాలు ఒకే విధంగా ఉండటంతో పోలీసులు ఈ విషయంలో లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ముందుగా బాధితులు ఉపయోగించిన ఈ మెయిల్‌ ఐడీలను పరిశీలించారు. యాహూకు సంబంధించిన ఈమెయిల్‌ ఐడీలను హ్యాక్‌ చేసి.. దాని ద్వారా పూర్తి సమాచారాన్ని సైబర్‌ నేరగాళ్లు సేకరించినట్లు పోలీసులు గుర్తించారు. దీని ద్వారా ఆయా వ్యాపారాలకు సంబంధించిన లావాదేవీలను గుర్తించిన నేరగాళ్లు, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌లో సెల్‌ఫోన్‌ నంబర్‌కు వచ్చే ఓటీపీలను నిలుపుదల చేసే ఎత్తులను వేశారు. అందులో భాగంగా సికింద్రాబాద్‌కు చెందిన వ్యాపారి సిమ్‌ను బ్లాక్‌ చేసి, ఆయన ఖాతాలోకి నేరుగా ప్రవేశించి, తమ బ్యాంకు ఖాతాల్లోకి నగదును బదిలీ చేసుకున్నారు. అమీర్‌పేట్‌ వ్యాపారికి చెందిన సిమ్‌ కార్డును బ్లాక్‌ చేయించి, అదే నంబర్‌ను చెన్నైలో గుర్తు తెలియని వ్యక్తులు తీసుకొని దాని ద్వారా బ్యాంకు ఖాతాలో నుంచి నగదును కొట్టేశారు. ఈ రెండు ఘటనల్లో డబ్బంతా వెస్ట్‌బెంగాల్‌లోని బ్యాంకు ఖాతాల్లోకి వెళ్లాయి. దీంతో అసలైన వ్యక్తి కాకుండా మరొకరికి ఆ ఫోన్‌ నంబర్‌ను ఎలా కేటాయించారనే విషయంపై ఇప్పుడు ఎయిర్‌టెల్‌ అధికారులను సైబర్‌క్రైమ్‌ పోలీసులు ప్రశ్నించనున్నారు. ఇతరులకు సిమ్‌ ఎలా కేటాయించారు.. అనే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు తమకు కావాలని, అమీర్‌పేట్‌కు చెందిన వ్యాపారి సిమ్‌కార్డును చెన్నైలో ఎలా జారీ చేశారనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎయిర్‌టెల్‌ నుంచి వచ్చే సమాచారం ఈ కేసుల దర్యాప్తులో కీలకం కానున్నది.