శుక్రవారం 22 జనవరి 2021
Hyderabad - Jan 13, 2021 , 00:34:06

దేఖో అప్నా దేశ్‌' పథకంలో ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ

దేఖో అప్నా దేశ్‌' పథకంలో ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ

సికింద్రాబాద్‌ : తెలుగు రాష్ట్రాల ప్రజలు యాత్రలకు వెళ్లేందుకు ఐఆర్‌సీటీసీ (ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌) ప్రత్యేక ఫ్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఐఆర్‌సీటీసీ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ కిశోర్‌ సత్య, జనరల్‌ మేనేజర్‌ కె.రవికుమార్‌, గ్రూప్‌ జనరల్‌ మేనేజర్‌ డి.నర్సింగ్‌రావు తెలిపారు.   సికింద్రాబాద్‌లోని ఐఆర్‌సీటీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు. సికింద్రాబాద్‌ నుంచి దక్షిణ భారత్‌ యాత్రలో తిరుచిరాపల్లి, తంజావూర్‌, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి ప్రాంతాలను సందర్శించేందుకు ఈ నెల 22న సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి రైలు బయలుదేరుతుందన్నారు. మార్గ మధ్యలో వరంగల్‌, ఖమ్మం, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు వీలుగా హాల్టింగ్‌ సౌకర్యాన్ని కల్పించినట్లు తెలిపారు. ఒక్కొక్క ప్రయాణికుడికి రూ.7140 (నాన్‌ ఏసీ) , రూ. 8610 ( ఏసీ) చార్జిలు ఉన్నట్లు తెలిపారు. 

అదేవిధంగా సికింద్రాబాద్‌ నుంచి జగన్నాథ్‌ ధామ్‌ యాత్ర పేరుతో ఉన్న టూరిజం ప్యాకేజీలో పూరీ, భువనేశ్వర్‌, కొణార్క్‌ ప్రాంతాలను సందర్శించి రావచ్చునని పేర్కొన్నారు. ఈ ప్యాకేజీ చార్జీలు రూ.5250 ఉందన్నారు. అదేవిధంగా రేణిగుంట నుంచి గంగా యమునా యాత్ర, రామాయణ్‌ యాత్ర ప్యాకేజీలు ఉన్నట్లు తెలిపారు. ఇక డొమెస్టిక్‌ ఎయిర్‌ ప్యాకేజీల్లో భాగంగా హైదరాబాద్‌ నుంచి అమేజింగ్‌ అండమాన్‌, మధ్యప్రదేశ్‌, సౌరాష్ట్ర విత్‌ స్టాచ్యూ ఆఫ్‌ యునిటీ, విశాఖపట్నం నుంచి మెజిస్టిక్‌ కేరళ, పద్మనాభ స్వామి దర్శనం వంటి ప్యాకేజీలు ఉంటాయని తెలిపారు. హలిడే, ల్యాండ్‌ ప్యాకేజీల్లో భాగంగా హైదరాబాద్‌ ఒక రోజు యాత్ర, హెరిటేజ్‌ హైదరాబాద్‌ యాత్ర, హైదరాబాద్‌ టూర్‌ విత్‌ రామోజీ ఫిలింసిటీలతో పాటు శ్రీనగర్‌, ఔరంగాబాద్‌, వారణాసి వంటి ప్రాంతాలను చూసేందుకు 17 రకాల ప్యాకేజీలను పర్యాటకుల కోసం అందుబాటులో ఉంచామని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు సికింద్రాబాద్‌లోని ఐఆర్‌సీటీసీ జోనల్‌ కార్యాలయంలో లేదా.. 040-27702407, 9701360701,8287932228లలో సంప్రదించాలన్నారు.


logo