గురువారం 26 నవంబర్ 2020
Hyderabad - Oct 23, 2020 , 08:44:26

ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌.. ఏడుగురు అరెస్ట్‌

ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌.. ఏడుగురు అరెస్ట్‌

సిటీబ్యూరో, నమైస్తే తెలంగాణ : క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి, వారి నుంచి రూ. 4.21 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ రాధాకిషన్‌రావు కథనం ప్రకారం... ఉప్పుగూడకు చెందిన హన్మాజి గారిబాల కిషన్‌రావు అలియాస్‌ బాలకృష్ణ, ముషీరాబాద్‌కు చెందిన దాత్రి శివకుమార్‌లు నాగాపూర్‌కు చెందిన ప్రధాన బుకీ అమిత్‌ సహకారంతో  ఉప్పుగూడలో క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న సెంట్రల్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ జావెద్‌ బృందం వారిని పట్టుకుంది. ఈ కేసు తదుపరి విచారణను ఛత్రినాక పోలీసులకు అప్పగించారు.  

మంగళ్‌హాట్‌లో ఇద్దరు...

మంగళ్‌హాట్‌కు చెందిన హర్పాల్‌ సింగ్‌ స్థానికంగా కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు.  మంగళ్‌హాట్‌కు చెందిన ధరమ్‌సింగ్‌ సహకారంతో హర్పాల్‌సింగ్‌.. స్నేహితుడు అనిల్‌ సింగ్‌తో కలిసి క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్నాడు. బుధవారం రాత్రి అప్పర్‌ధూల్‌పేట్‌లోని తన ఇంట్లో హర్పాల్‌ సింగ్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తుండగా వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ గట్టుమల్లు బృందం దాడి చేసి హర్పాల్‌, అనిల్‌ సింగ్‌లను అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి రూ. 34,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. 

పాతబస్తీలో ముగ్గురు..

చార్మినార్‌: ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముగ్గురిని దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. ఇన్‌స్పెక్టర్‌ రాఘవేందర్‌ వివరాల ప్రకారం.. పాతబస్తీకి చెందిన సయ్యద్‌ ఖాసీ ఉల్‌ హక్‌, గులాం హసన్‌ ఖాన్‌, అరీఫ్‌లు ఐపీఎల్‌ మ్యాచ్‌ల సందర్భంగా బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న టాస్క్‌ఫో ర్స్‌ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 73 వేల నగదు, నాలుగు  సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు.