గురువారం 26 నవంబర్ 2020
Hyderabad - Jun 12, 2020 , 02:09:42

ఈజీ మనీ కోసం బీటెక్‌ విద్యార్థి ఇన్‌స్టాగ్రామ్‌లో దొంగాట

ఈజీ మనీ కోసం బీటెక్‌ విద్యార్థి ఇన్‌స్టాగ్రామ్‌లో దొంగాట

  • డబ్బుకోసం డబుల్‌ రోల్‌
  • ఇన్‌స్టాగ్రామ్‌లో అమ్మాయిగా చాటింగ్‌ 
  • పెండ్లి పేరుతో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు బెదిరింపులు
  • రూ. 3.6లక్షలు వసూలు చేసినా.. ఆగని ఆశ 
  • అడ్డంగా దొరికిన ఇంజినీరింగ్‌ యువకుడు

హైదరాబాద్‌ : ఈజీ మనీ కోసం బీటెక్‌ విద్యార్థి ఇన్‌స్టాగ్రామ్‌లో దొంగాట ఆడాడు.. మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన కె.పవన్‌కిరణ్‌(20) అమ్మాయి ఫొటోతో ఇన్‌స్టాగ్రామ్‌లో  ఖాతా తెరిచి, కాచిగూడకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపించాడు.  చాటింగ్‌లతో స్నేహం పెంచుకొని వ్యక్తిగత విషయాలు షేర్‌ చేసుకునే వరకూ వెళ్లారు. తనను పెండ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. లేకుంటే రూ. 30 లక్షలు ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగాడు. ఆన్‌లైన్‌ జూదానికి అలవాటై.. ఈజీగా మనీ సంపాదించాలని ఓ బీటెక్‌ విద్యార్థి సోషల్‌ మీడియాలోఅమ్మాయి అవతారమెత్తి, అబ్బాయిలను బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. పోలీసుల కథనం ప్రకారం.. మల్కాజిగిరికి చెందిన కె.పవన్‌కిరణ్‌ (20) బీటెక్‌ రెండో సంవత్సరం చదువుతూ ఆన్‌లైన్‌లో జూదంతో పాటు విలాసాలకు అలవాటుపడ్డాడు. తన విలాసాలకు కావాల్సిన డబ్బును తేలికగా సంపాదించుకునేందుకు సోషల్‌ మీడియాను వాడుకున్నాడు. అందమైన ఒక అమ్మాయి ఫొటోతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా తెరిచి, కాచిగూడ ప్రాంతంలోని ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు ఫ్రెండ్‌ రెక్వెస్ట్‌ పంపించాడు. దానికి బాధితుడైన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ యాక్సెప్ట్‌ చేయగా కొన్నాళ్లు పవన్‌కిరణ్‌ అమ్మాయిగా, బాధితుడితో చాటింగ్‌ చేశాడు. వీడియో కాల్స్‌లోకి రమ్మని బాధితుడు కోరినా నిరాకరిస్తూ కొన్నాళ్లపాటు చాటింగ్‌లతోనే సరిపెట్టాడు. 

చాటింగ్‌లో వీరు వ్యక్తిగతమైన అన్ని వివరాలు మాట్లాడుకున్నారు. ఈ సమయంలోనే మా అమ్మకు బాగోలేదు.. రూ.10 వేలు ఇవ్వు.., ఊరికి వెళ్లాలి రూ.20 వేలు ఇవ్వంటూ.. బాధితుడి వద్ద నుంచి కొంత డబ్బు తీసుకున్నాడు. ఇలా ఒకరిపై ఒకరికి నమ్మకం కుదిరిన తరువాత పవన్‌కిరణ్‌ ఇంటర్నెట్‌లో నుంచి డౌన్‌లోడ్‌ చేసిన కొన్ని అర్ధనగ్న ఫొటోలు తనవేనంటూ బాధితుడికి పంపించాడు. ఆ తరువాత బాధితుడు కూడా తన అర్ధనగ్న ఫొటోలు పంపాడు. ఆ తరువాత పెండ్లి చేసుకుందామని అమ్మాయిగా నటిస్తున్న పవన్‌కిరణ్‌ ప్రస్తావన తెచ్చాడు. లేదంటూ బాధితుడు చెప్పాడు.. పూర్తిగా నిన్ను నమ్మాను.. సర్వస్వం అప్పగించాను.. ఇప్పుడు పెండ్లి కాదంటే ఎలాగంటూ నిలదీశాడు. వ్యవహారం తేడాగా ఉండటంతో బాధితుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పవన్‌కిరణ్‌ ఖాతాను బ్లాక్‌ చేశాడు. వాట్సాప్‌ ద్వారా.. నీవు నన్ను మోసం చేశావు.. పెండ్లి చేసుకుంటావా? లేదా? అంటూ బాధితుడిపై ఒత్తిడి తెచ్చాడు. 

పెండ్లి చేసుకోకపోతే రూ.30 లక్షలు తనకు ఇవ్వాలి.. లేకుంటే నీ ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌ చేస్తానంటూ బెదిరించాడు. ఆ ఫొటోలను బాధితుడి తల్లిదండ్రులకు సైతం పంపించాడు. ఇక నేను నీతో మాట్లాడనని మా అన్న పవన్‌ నీ పనిపడుతాడంటూ చెప్పి.. తెలివిగా మరో పాత్రను సృష్టించి, అందులోకి పవన్‌కిరణ్‌ దిగాడు. ఆ తరువాత యువతి సోదరుడిగా పవన్‌ బాధితుడిని ఫోన్‌లో బెదిరించడంతో విషయం సెటిల్‌ చేసుకుందామని బాధితుడు కొంత డబ్బు పంపించాడు. ఇలా  బాధితుడు రూ.3.6 లక్షలు చెల్లించినా.. ఆశ చావకుండా  ఇంకా డబ్బులు డిమాండ్‌ చేస్తుండటంతో సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు బాధితుడైన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్‌ మోహన్‌రావు బృందంలోని ఎస్సై నరేందర్‌ ఆధ్వర్యంలో దర్యాప్తు జరిపి బ్లాక్‌ మెయిలింగ్‌కు పాల్పడుతున్న పవన్‌కిరణ్‌ను  అరెస్ట్‌ చేశారు.