బుధవారం 30 సెప్టెంబర్ 2020
Hyderabad - Sep 16, 2020 , 01:18:31

ఎగుమతుల స్థాయికి ఎదిగాం

ఎగుమతుల స్థాయికి ఎదిగాం

మేకిన్‌ ఇండియాలో ఇంజినీర్ల పాత్ర కీలకం

పీపీఈ కిట్ల నుంచి.. బుల్లెట్‌ ఫ్రూఫ్‌ జాకెట్లు ఎగుమతి చేస్తున్నాం

ఇంజినీర్స్‌ డే వేడుకల్లో గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌

ఖైరతాబాద్‌, సెప్టెంబర్‌ 15 : ‘సాంకేతిక పరిజ్ఞానం...పరికరాలను ఒకప్పుడు దిగుమతి చేసుకునే వాళ్లం. నేడు ఎగుమతి స్థాయికి ఎదిగాం. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన మేకిన్‌ ఇండియా నినాదంతోనే సాధ్యమైంది. అందులో ఇంజినీర్ల పాత్ర కీలకం’ అని గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ అభిప్రాయపడ్డారు. ఖైరతాబాద్‌లోని ది ఇనిస్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ ఇండియా తెలంగాణ స్టేట్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం ఇంజినీర్స్‌ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిపుణులతో ఆన్‌లైన్‌ వేదికగా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై గవర్నర్‌ మాట్లాడుతూ, దేశాభివృద్ధిలో ఇంజినీర్ల పాత్ర... ప్రాజెక్టుల రూపకల్పనలో సర్‌ మోక్షగుండ విశ్వేశ్వరయ్య కృషిని వివరించారు. వైద్యులు ప్రాణాలు పోస్తే.. ఇంజినీర్లు మానవమనుగడకు దిక్సూచిగా నిలుస్తారన్నారు. ప్రధాని ఇచ్చిన మేకిన్‌ ఇండియా పిలుపు దేశంలో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో స్వీయ ఆవిష్కరణలకు దోహదపడిందని, ఇంజినీర్లు కొత్త కొత్త ఆవిష్కరణలతో ప్రపంచ పటంలో భారత్‌ను ముందు వరుసకు తీసుకెళ్తున్నారన్నారు. గతంలో మనకు ఏం కావాలన్నా దిగుమతి చేసుకోవాల్సి వచ్చేదని, కాని నేడు సొంతంగా ఆవిష్కరణలు చేపట్టి ఎగుమతులు చేస్తున్నామని ప్రశంసించారు. పీపీఈ కిట్ల నుంచి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ జాకెట్ల వరకు ఎగుమతులు చేయడం వెనుక శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల కృషి, పట్టుదల ఉందన్నారు. కొవిడ్‌ వైరస్‌ను ఎదుర్కోవడంలోనూ ఇంజినీర్ల పాత్ర ఎంతో ఉందన్నారు. కమ్యూనికేషన్‌ వ్యవస్థ, టెక్నాలజీ లేని కాలంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య తన ఆలోచనలతో అనేక ప్రాజెక్టులను నిర్మించారని, వాటి ఫలాలు నేటికీ పొందుతున్నామన్నారు. ప్రపంచంలో సూపర్‌ పవర్‌గా భారత్‌ను తీర్చిదిద్దడంలో భావి ఇంజినీర్లు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఐఈఐ చైర్మన్‌ డాక్టర్‌ జి. రామేశ్వర్‌ రావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో టూరిజం, కల్చర్‌, స్పోర్ట్స్‌ కార్యదర్శి కేఎస్‌ శ్రీనివాస రాజు, ఐఈఐ కార్యదర్శి టి. అంజయ్య, మాజీ చైర్మన్‌ డాక్టర్‌ ఎస్‌. సత్యనారాయణ, డాక్టర్‌ హనుమంతాచారి తదితరులు పాల్గొన్నారు. 

పలువురికి అవార్డులు...

ఇంజినీర్స్‌ డే సందర్భంగా భారతరత్న సర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అవార్డును వరంగల్‌ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌వీ రమణారావు,  డీఆర్‌డీఎల్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ డాక్టర్‌ జై తీర్త్‌ ఆర్‌.జోషి, ఇంజినీర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డులను ఉస్మానియా యూనివర్సిటీ సివిల్‌ ఇంజనీరింగ్‌ విభాగం ప్రొఫెసర్‌ ఎం. గోపాల్‌ నాయక్‌, డీఆర్‌డీఓ (వేదా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ ల్యాబరేటరీ) శాస్త్రవేత్త డాక్టర్‌ ఎన్‌. కిశోర్‌ నాథ్‌, బీహెచ్‌ఈఎల్‌ సీనియర్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ డాక్టర్‌ ఎం.మోహన రావు, యంగ్‌ ఇంజినీర్‌ ఆఫ్‌ ఇయర్‌ అవార్డులను సీఎస్‌ఐఆర్‌, ఐఐసీటీ (ప్రాసెస్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ) శాస్త్రవేత్త డాక్టర్‌ అల్కా కుమారి, బీహెచ్‌ఈఎల్‌ (మెటలర్జీ విభాగం) డిప్యూటీ మేనేజర్‌ డాక్టర్‌ పవన్‌ ఆలపాటి హను వెంకటేశ్‌లకు అందచేశారు.

logo