సోమవారం 28 సెప్టెంబర్ 2020
Hyderabad - Aug 11, 2020 , 00:25:01

పగ పెంచుకుని.. కన్నం పెట్టారు..!

పగ పెంచుకుని.. కన్నం పెట్టారు..!

ఉద్యోగం నుంచి తొలగించాడని.. యజమానిపై కోపం

సీక్రెట్స్‌ తెలియడంతో ఈజీగా ఇంటికి కన్నం

మాజీ డ్రైవర్‌తో పాటు అతని స్నేహితులు అరెస్ట్‌

రూ.1.3 కోట్లు రికవరీ

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: యజమాని ఆర్థిక పరమైన వ్యవహారాలకు సంబంధించి సీక్రెట్‌లు తెలుసుకున్న ఇద్దరు పనివాళ్లు. తమని ఉద్యోగంలో నుంచి తొలగించడంతో, యజమాని ఇంటికి కన్నం వేశారు. ఈ దొంగతనానికి పాల్పడిన ఐదుగురు స్నేహితులను అరెస్ట్‌ చేసిన గోల్కొండ పోలీసులు వారి వద్ద నుంచి సుమారు రూ.1.3 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ సోమవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. టోలిచౌక్‌ బాల్‌రెడ్డినగర్‌లో నివాసముండే అసదుద్దీన్‌ అహ్మద్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారీ. ఇతనికి శామీర్‌పేట్‌లో ఒక ఫామ్‌హౌస్‌ ఉంది. ఇతని వద్ద టోలిచౌక్‌ ఎండీ లైన్స్‌కు చెందిన మహ్మద్‌ అప్సర్‌ డ్రైవర్‌గా, అదే ప్రాంతానికి చెందిన మిర్జా అశ్వాక్‌ బేగ్‌ ఫామ్‌హౌస్‌లో గార్డెనర్‌గా పనిచేసేవారు. ఈ ఇద్దరిని యజమాని జులై నెలలో ఉద్యోగం నుంచి తొలగించాడు. దీన్ని మనస్సులోపెట్టుకున్న వీరిద్దరు ఎండీ లైన్‌కు చెందిన తమ చిన్ననాటి స్నేహితులు రేహమాన్‌ బేగ్‌, మహ్మద్‌ అమీర్‌, సయ్యద్‌ ఇమ్రాన్‌తో కలిసి యజమాని ఇంట్లో చోరీ చేయాలని పతకం పన్నారు. 

యజమాని రహస్యాలు తెలిసిన డ్రైవర్‌

యజమాని డ్రైవర్‌గా పనిచేసిన అప్సర్‌కు తన యజమాని వ్యాపార లావాదేవీలకు సంబంధించిన విషయాలపై అవగాహన ఉంది. డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది.. ఎక్కడ పెడుతారు.. ఎంత మొత్తంలో డబ్బు తన యజమాని వద్ద ఉంటుంది అనే రహస్యాలు తెలుసు. దీంతో ఐదుగురు కలిసి ఒక ముఠాగా ఏర్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడి డబ్బు కొట్టేయాలి ప్లాన్‌ చేశారు. దీంతో యజమాని ఇంట్లో నుంచి ఎప్పుడు బయటకు వెళ్తాడా.. అని అరా తీస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా జులై 21వ తేదీన యజమాని ఇంటికి తాళం వేసి కుటుంబ సమేతంగా ఫామ్‌హౌస్‌కు వెళ్లాడు. తిరిగి 23వ తేదీన వచ్చాడు. ఇంట్లోకి వెళ్లి చూడగా రూ.2.5 కోట్ల నగదు కన్పించకపోవడంతో యజమాని అసదుద్దీన్‌ గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

కొంత పంచుకొని.. మరికొంత దాచారు...!

దొంగతనానికి పాల్పడింది తెలిసినవారే అయి ఉంటారని నిర్ధారించుకున్న పోలీసులు దర్యాప్తు సాగించారు. ఈ క్రమంలోనే అప్సర్‌ ముఠా ఆదివారం పోలీసులకు పట్టుబడింది. విచారణలో 22వ తేదీన అర్ధరాత్రి దాటిన తరువాత దొంగతనం చేశామని, చెక్కతో చేసిన అల్మారాను పగలగొట్టి అందులో ఉంచిన నగదును దొంగిలించామని నిందితులు ఒప్పుకున్నారు. ముగ్గురు ఇంట్లోకి చొరబడి దొంగతనం చేయగా, మరో ఇద్దరం ఇంటి బయట కాపాలాగా ఉన్నామని విచారణలో వెల్లడించారు. దొంగిలించిన నగదును రేహమాన్‌బేగ్‌ ఇంట్లో దాచి, అందులో కొంత పంచుకున్నామని తెలిపారు. దీంతో నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు, రెహమాన్‌ బేగ్‌ ఇంట్లో దాచిన రూ.1,29,46,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసును లంగర్‌హౌస్‌ ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డి, అదనపు ఇన్‌స్పెక్టర్‌ రాజేశ్‌ నేతృత్వంలో దర్యాప్తు జరిపిన ఎస్సై రాజు, క్రైమ్‌ సిబ్బందిని సీపీ అభినందించారు. ఈ సమావేశంలో వెస్ట్‌జోన్‌ జాయింట్‌ సీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.


logo