మంగళవారం 04 ఆగస్టు 2020
Hyderabad - Jul 12, 2020 , 23:59:22

ఆపత్కాలంలో.. ఆత్మీయులవుదాం..

ఆపత్కాలంలో.. ఆత్మీయులవుదాం..

కరోనా నుంచి కంటి రెప్పలను కాపాడుకుందాం.. 

లాక్‌డౌన్‌ వేళ పిల్లల్లో పెరుగుతున్న అసహనం 

12 ఏండ్ల భార్గవ్‌ ఎప్పుడూ హుషారుగా కనిపించేవాడు. ఆటల్లో చురుగ్గా పాలుపంచుకునేవాడు. కానీ లాక్‌డౌన్‌ పరిస్థితులు అతడిని పూర్తిగా మార్చేశాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదనే నిబంధనతో అతడు మానసికంగా కుంగిపోయాడు. దీంతో పేరెంట్స్‌తో తక్కువగా మాట్లాడటం.. చిన్న విషయానికే గొడవకు దిగుతూ చిరాకు పడుతున్నాడు. తొమ్మిదో తరగతి చదువుతున్న దీపక్‌ అన్నింట్లో ముందుండేవాడు. లాక్‌డౌన్‌ సమయంలో ఇంట్లో నుంచి  బయటికి వెళ్లలేక ఎక్కువ సమయం మొబైల్‌, ల్యాప్‌టాప్‌లపైనే 

గడిపేవాడు. అంతేకాక చిరుతిండికి అలవాటు పడి లావు అయ్యాడు. 

సిటీబ్యూరో, నమస్తేతెలంగాణ: నేటి బాలలే రేపటి పౌరులు. వారు మానసికంగా.. ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలరనేది వాస్తవం. అయితే ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో పిల్లలపై నెగిటివ్‌ ప్రభావం పడుతున్నది. బయటి ప్రపంచానికి దూరం కావడం.. స్నేహితులు, బంధువుల ఇండ్లకు వెళ్లలేకపోవడం.. రోజంతా ఇంట్లోనే గడపాల్సి రావడంతో అసహనం చెందుతున్నారు. కొందరు చిన్నచిన్న విషయాలకే చిరాకు, కోపం ప్రదర్శిస్తుండగా మరికొందరు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఇంకొందరు సమయపాలన లేని ఆహార నియమాలతో అధిక బరువు పెరుగుతున్నారు. మొత్తంగా కరోనా ఆపత్కాలంలో చిన్నారుల పరిస్థితి కొంత ఇబ్బందికరంగా మారిందనే చెప్పవచ్చు.  

పిల్లలు ఒత్తిడికి గురైనప్పుడు చిరాకు పడటం.. చెప్పిన మాట వినకపోవడం.. ఆహారం తీసుకోకపోవడం లాంటివి చేస్తుంటారు. మెంటల్‌గా డిస్ట్రబ్‌ అవుతారు. వారి ప్రవర్తనలో తేడా ఉంటుంది. తల్లిదండ్రులు అప్రమత్తం కాకపోతే వారు మరింత డిప్రెషన్‌లోకి వెళ్లి ప్రమాదాలు కొని తెచ్చుకునే ఆస్కారం ఉంటుంది. ప్రస్తుత పరిస్థితులను వారికి అర్థమయ్యేలా వివరించాలని సైకాలజిస్టులు సూచిస్తున్నారు.

బరువుపై నిర్లక్ష్యం వద్దు.. పిల్లలు బరువు పెరిగితే నిర్లక్ష్యం చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఇది భవిష్యత్‌లో డయాబెటీస్‌, కార్డియోవాస్క్యులర్‌, కీళ్ల నొప్పులు బారిన పడే అవకాశం ఉందంటున్నారు. కొవ్వు, తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం మూలంగా పిల్లలు అధిక బరువు పెరుగుతారు. ముఖ్యంగా పట్టణాల్లో ఉండే చిన్నారుల్లో ఈ సమస్య అధికంగా ఉంటుంది. పిల్లల బాడీమాక్స్‌ ఇండెక్స్‌ ఆధారంగా బరువును గుర్తించవచ్చు. వయసు, ఎత్తుకు తగ్గ బరువు ఉన్నారా లేదా అన్నది తెలుసుకోవచ్చు. ఆటలాడితే బాడీలో ఒత్తిడి పెరిగి ఎండార్ఫిన్‌ లాంటి హార్మోన్లు విడుదలై బరువు సమస్యను తగ్గిస్తాయి.  

ఇలా చేస్తే..

పిల్లలు మానసిక ఒత్తిడికి గురికాకుండా తల్లిదండ్రులు మోటివేషన్‌ చేయాలి.  

యోగా, మెడిటేషన్‌, ఏరోబిక్స్‌లలో పిల్లలను ఇన్వాల్వ్‌ చేయాలి. ప్రతి రోజు వ్యాయామం చేయించాలి. అందుకనుగుణంగా పేరెంట్స్‌ వారి టైం టేబుల్‌ రూపొందించాలి. 

ఇతర యాక్టివిటీస్‌పై దృష్టి సారించేలా ప్రోత్సహించాలి. డ్యాన్స్‌, పెయింటింగ్‌, ఇండోర్‌ గేమ్స్‌ నేర్పించాలి. 

జంక్‌ ఫుడ్‌కు పిల్లలను దూరంగా ఉంచాలి. బయట దొరికే తిండిలో

అనేక రకాల చక్కెర పదార్థాలు ఉంటాయి. ఆ ఫుడ్‌ తింటే అధిక బరువు పెరగడం ఖాయం. 

పిల్లలతో కలిసే తల్లిదండ్రులు భోజనం చేయాలి. నిద్రించే సమయం కూడా అందరూ ఫాలో కావాలి.

ఇది పిల్లల్లో పాజిటివ్‌ వైబ్స్‌ను

పెంచుతుంది.

సమతుల ఆహారం అవసరం

పిల్లలకు సమతుల ఆహారం ఇవ్వాలి. తినే ఆహారంలో ప్రతిరోజు పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. స్వీట్లు, తియ్యటి పానీయాలు ఇవ్వకపోవడమే ఉత్తమం. కూరగాయలు, పండ్ల జ్యూస్‌ను రోజుకు 150 మిల్లీ లీటర్లు మించకుండా ఇస్తే మంచిది. కరోనా పరిస్థితులను వారికి భయానకంగా చూపించొద్దు.

- సనాఫాతిమా, పోషకాహార నిపుణులు


logo