సోమవారం 28 సెప్టెంబర్ 2020
Hyderabad - Aug 12, 2020 , 23:06:10

తాగిన మైకంలో.. కన్నబిడ్డను అమ్మేసింది

తాగిన మైకంలో.. కన్నబిడ్డను అమ్మేసింది

  మెహిదీపట్నం:  తాగిన మైకం.. భర్తపై ఉన్న కోపంతో పేగు తెంచుకుని పుట్టిన రెండు నెలల బాబును తల్లి విక్రయించింది. ఈ ఘటనలో హబీబ్‌నగర్‌ పోలీసులు బుధవారం బాబును విక్రయించిన తల్లితో పాటు మరో ఐదుగురిని అరెస్ట్‌ చేసి.. రిమాండ్‌కు తరలించారు. రెండు నెలల బాలుడిని తండ్రికి సురక్షితంగా అప్పగించారు. హబీబ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గోషామహల్‌ ఏసీపీ నరేందర్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ పూసపాటి శివచంద్ర, అదనపు ఇన్‌స్పెక్టర్‌ నర్సింహాతో కలిసి వివరాలను వెల్లడించారు. 

ఎలా విక్రయించారు..

 సుభాన్‌పురాలో నివసించే జోయఖాన్‌, అబ్దుల్‌ ముజాహిద్‌ దంపతులు. వీరికి రెండు నెలల బాబు షేక్‌ అద్నాన్‌ సంతానం. ఇదిలా ఉండగా.. ఈనెల 3న అబ్దుల్‌ ముజాహిద్‌ భార్యతో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లి పోయాడు. జోయఖాన్‌కు మద్యం తాగే అలవాటు ఉంది. ఈ క్రమంలో ఈనెల 8న మద్యంమత్తులో ఆగాపురాకు చెందిన తబస్సుమ్‌, షేక్‌మహ్మద్‌లకు.. తన భర్త వదిలి వెళ్లి పోయాడని, తనకు  రెండు నెలల బాబు ఉన్నాడని, అతడిని అమ్మివేస్తానని చెప్పింది. తబస్సుమ్‌కు సోదరి వరుస అయ్యే చంచల్‌గూడ నివాసి ఆయేషా జబిన్‌కు సంతానం లేకపోవడంతో.. రెండు నెలల బాబు అమ్మకానికి ఉన్నాడని చెప్పింది. దీనికి ఆయేషా జబిన్‌ బాబును కొంటానని ఒప్పుకోవడంతో తబస్సుమ్‌, సిరాజ్‌ బేగం, షమీమ్‌బేగంలతో కలిసి జోయఖాన్‌ వద్ద నుంచి రూ.45వేలకు బాబును కొని.. ఆయేషా జబిన్‌కు అప్పజెప్పారు. 

ఎలా బయటపడింది..

 ఇదిలా ఉండగా.. మంగళవారం ఇంటికి తిరిగి వచ్చిన ముజాహిద్‌  తన భార్య జోయఖాన్‌ను బాబు గురించి ప్రశ్నించగా.. బాబును అమ్మినట్లు చెప్పింది. ముజాహిద్‌ మంగళవారం సాయంత్రం హబీబ్‌నగర్‌ పోలీసులకు జరిగిన ఉదంతంపై ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన అదనపు ఇన్‌స్పెక్టర్‌ నర్సింహ, ఎస్‌ఐ జయంత్‌ బాబును కొన్న తబస్సుమ్‌, షేక్‌మహ్మద్‌లను తొలుత పట్టుకున్నారు. పోలీసుల విచారణలో రెండేళ్ల బాబును కాలాపత్తర్‌ ప్రాంతానికి సిరాజ్‌బేగం, షమీమ్‌ల సహకారంతో చంచల్‌గూడ నివాసి అయేషా జబిన్‌కు అమ్మినట్లు తేలింది. పోలీసులు బాలుడిని సురిక్షతంగా కాపాడి.. తండ్రి వద్దకు చేర్చారు. ఈ ఘటనలో హబీబ్‌నగర్‌ పోలీసులు బుధవారం ఆరుగురిని  అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.


logo