మంగళవారం 27 అక్టోబర్ 2020
Hyderabad - Sep 28, 2020 , 00:57:52

తప్పు చేస్తే పదేండ్ల జైలు

తప్పు చేస్తే పదేండ్ల జైలు

రాంగ్‌రూట్‌లో వచ్చినా..సిగ్నల్‌ జంపైనా..

నిర్లక్ష్యంగా నడిపినా..మద్యం సేవించినా..

మైనర్లకు వాహనం ఇచ్చినా.. 

మరొకరికి ప్రమాదం కలిగించినా.. పదేండ్లు జైల్లో కూర్చోవాల్సిందే 

304 పార్ట్‌ 2 సెక్షన్‌ కింద కేసులు

కఠిన చర్యలు అమలు చేస్తున్న సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: 

రాంగ్‌రూట్‌లో వెళ్తున్నారా.. సిగ్నల్‌ జంప్‌ చేస్తున్నారా..తస్మాత్‌ జాగ్రత్త.. పిల్లలకు వాహనాలు ఇస్తున్నారా..వారి భవిష్యత్తుకు ఫుల్‌స్టాప్‌ పెట్టకండి..పొరపాటునా ఎవరికైనా ప్రమాదం తలపెట్టినా, వారి మరణానికి కారకులైన మైనర్లతోపాటు వాహన యజమాని, వారి తల్లిదండ్రులు పదేండ్లు జైల్లో కూర్చోవాల్సిందే. వాహనదారుడి చిన్న తప్పు.. పెను ప్రమాదానికి కారణమవుతున్నదని, నిర్లక్ష్యం వహిస్తే కఠినంగా శిక్షించేందుకు వెనుకాడమంటూ పోలీసు  ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. సంఘటన ఏదైనా మరొకరికి ప్రమాదం కలిగించినా.. వారి మరణానికి కారణమైనా 304 పార్ట్‌ 2 సెక్షన్‌ కింద కొరడా ఝలిపించనున్నారు.

ముగ్గురు మైనర్‌ పిల్లలు స్కూటీ పై వేగంగా వెళ్తున్నారు. ఆ సమయంలో రోడ్డు దాటుతున్న సెక్యూరిటీ గార్డును ఢీ కొట్టగా.. అక్కడికక్కడే మరణించాడు. ఇప్పుడు తప్పు ఎవరీది.. రోడ్డు దాటుతున్న సెక్యూరిటీ గార్డుదా.. ట్రిపుల్‌ రైడింగ్‌ చేస్తున్న మైనర్లదా.. ఎవరిని శిక్షించాలి. చర్చకు తీస్తే విభిన్న వాదనలు వినపడినా.. సైబరాబాద్‌ పోలీసులు మాత్రం చట్టపరంగా ముగ్గురు మైనర్లు, వాహన యజమాని మీద సెక్షన్‌ 304 పార్ట్‌ 2 కింద కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్‌ కింద అభియోగాలు కోర్టు విచారణలో రుజువైతే దాదాపు 10 ఏండ్లు జైలు శిక్ష పడుతుంది. వాహన యజమాని చేసిన చిన్న తప్పు పేద సెక్యురిటీ గార్డు మృతికి కారణమైంది. అతివేగంతో ట్రిపుల్‌ డ్రైవింగ్‌ చేసిన మైనర్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మార్చింది. మైనర్లు జువనైల్‌ హోంకు, వాహన యజమాని జైలుకు వెళ్లనున్నారు. మైనర్లకు వాహనమిస్తే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో ఈ సంఘటన తెలియజేస్తున్నది. 

వారం రోజుల కిందట బాచుపల్లి ప్రాంతంలో ట్రాక్టర్‌ డ్రైవర్‌ రాంగ్‌రూట్‌ ప్రయాణానికి భార్య మృతిచెందగా, భర్తకు తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటనలో ట్రాక్టర్‌ డ్రైవర్‌కు లైసెన్స్‌ లేదని తేలింది. వివరాలు.. బాచుపల్లికి చెందిన భార్యాభర్తలు అల్వాల్‌ ప్రాంతంలో పని ముగించుకుని తిరిగి మధ్యాహ్న సమయంలో బాచుపల్లికి ద్విచక్రవాహనంపై వస్తున్నారు.  రాంగ్‌రూట్‌లో వస్తున్న ట్రాక్టర్‌ను చూసి అకస్మాత్తుగా బ్రేక్‌ వేయగా.. భార్య కిందపడిపోయింది. వెనుక నుంచి వస్తున్న డీసీఎం ఆమె పైకి ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు ట్రాక్టర్‌ డ్రైవర్‌, ట్రాక్టర్‌ యజమానిపై 304 పార్ట్‌ 2 కింద కేసు నమోదు చేశారు. కేసు విచారణలో భాగంగా కోర్టులో అభియోగాలు రుజువైతే యజమాని, డ్రైవర్‌కు 10 ఏండ్లు జైలు శిక్ష పడుతుంది. 

ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద గమనిస్తే.. చాలామంది గ్రీన్‌ సిగ్నల్‌ పడగానే రయ్యిమంటూ దూసుకెళ్తారు. రెడ్‌ పడబోతుందని ఆరెంజ్‌ సిగ్నల్‌ ఇచ్చినా.. ఎక్కడ రెడ్‌ పడుతుందోనని ఆత్రుతగా వేగంగా వెళ్తుంటారు. రెడ్‌ సిగ్నల్‌ పడినా అలాగే వెళ్లేవారు ఆ సమయంలో ఏదైనా ప్రమాదం జరిగి మరొక వ్యక్తి మరణానికి కారకులైతే 304 పార్ట్‌ 2 కింద కేసు నమోదు చేయనున్నారు.  మద్యం సేవించి వాహనం నడిపిన సమయంలో ప్రమాదం జరిగినా, ఎవరైనా మృతి చెందినా... 304 పార్ట్‌ 2 కేసులు పెట్టి జైలుకు పంపనున్నారు. 

చాలా మంది రోడ్లపై ఎలాంటి సూచనలు చేయకుండానే కట్లు కొట్టి వెళ్తుంటారు. దీనివల్ల పలువురు వాహనదారులు కొంత ఆందోళనకు గురై కిందపడిపోవడం, మరికొంత మంది ప్రాణాలు కోల్పోయే సంఘటనలు నగరంలో చాలా చోటు చేసుకున్నాయి. దీనిపై కూడా సైబరాబాద్‌ పోలీసులు చాలా సీరియస్‌గా ఉన్నారు. ఆ ప్రమాదంపై కారకుడైన వాహనదారుడికి 304 పార్ట్‌ 2 కింత అభియోగాలు నమోదు చేస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నారు. 

304 పార్ట్‌ 2 సెక్షన్‌ తప్పనిసరి


వాహనదారుడికి రోడ్డుపై సురక్షిత ప్రయాణం, పటిష్టమైన భద్రత కల్పించేందుకు చట్టంలోని సెక్షన్లను కఠినంగా అమలు చేస్తాం. వాహనదారుడి తప్పిదం వల్ల జరిగే మరణాలపై ఇకనుంచి కచ్చితంగా 304 పార్ట్‌ 2 సెక్షన్‌ (హత్య చేయాలనే ఉద్దేశం లేకున్నా తన చర్య వల్ల మరణం సంభవిస్తుందని తెలిసి తప్పు చేయడం) కింద అభియోగాలు నమోదు చేస్తాం. కోర్టు విచారణలో తేలితే 10 ఏండ్లు శిక్ష. ముఖ్యంగా డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనం నడపడం.. మద్యం సేవించి నడిపినా, సిగ్నల్‌ జంపింగ్‌, రాంగ్‌రూటులో వచ్చి ఇలా పలు సందర్భాల్లో మరొకరికి ప్రమాదం కలిగించినా.. వారి మరణానికి కారకు లైనా ఇదే సెక్షన్‌ కింద అభియోగాలు నమోదుచేస్తాం. మైనర్లు వాహనం నడిపి ప్రమాదం కలిగిస్తే వారి తల్లిదండ్రులు, వాహన యజమానిపై ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తాం. ఇదంతా వాహనాదారుల ప్రాణాలు కాపాడడం కోసమే చేస్తున్నాం. మొదటి నుంచి ఉన్న సెక్షన్లనే అమలు చేస్తున్నాం. 

- ఎస్‌ఎం విజయ్‌కుమార్‌, ట్రాఫిక్‌ డీసీపీ సైబరాబాద్‌

logo