e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home హైదరాబాద్‌ పసివాడి ప్రాణం..65 వేల మంది సాయం

పసివాడి ప్రాణం..65 వేల మంది సాయం

పసివాడి ప్రాణం..65 వేల మంది సాయం
  • బాలుడికి అరుదైన వ్యాధి.. చికిత్సకు రూ.22 కోట్లు
  • ఇంపాక్ట్‌ గురూ.కామ్‌ ఆధ్వర్యంలో విరాళాల సేకరణ
  • మంత్రి కేటీఆర్‌ చొరవతో రూ.6 కోట్ల పన్ను మాఫీ

సిటీబ్యూరో, జూన్‌ 12 (నమస్తే తెలంగాణ): ఓ పసివాడి ప్రాణాలు కాపాడేందుకు 65,400 మంది దాతల ముందుకొచ్చి రూ.16 కోట్ల క్రౌడ్‌ ఫండింగ్‌ సమకూర్చారు. ఈ ఫండ్‌తో నగరంలోని రెయిన్‌బో చిన్నపిల్లల దవాఖాన వైద్యులు అమెరికా నుంచి తెప్పించిన అతి ఖరీదైన ‘జోల్గెన్‌స్మాన్‌’ ఇంజక్షన్‌తో ఇచ్చి ప్రాణాలు నిలిపారు. శనివారం సికింద్రాబాద్‌ కార్ఖానలోని రెయిన్‌బో చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌లో బాలుడి వ్యాధి వివరాలను పీడియాట్రిక్‌ న్యూరాలజిస్ట్‌ డాక్టర్‌ రమేష్‌ వివరించారు. ఛత్తీస్‌గడ్‌కు చెందిన యోగేష్‌ గుప్తా, రూపన్‌గుప్తా దంపతులు. ఉద్యోగరీత్యా పదేండ్ల క్రితం ఇక్కడ స్థిరపడ్డారు. వీరికి 2018లో అయాన్జ్‌గుప్తా శిశువు జన్మించాడు.

పుట్టినప్పుడు ఆరోగ్యంగా ఉన్నా క్రమంగా బలహీనంగా మారడం మొదలైంది. 6 నెలల వయస్సులో కాళ్లు, చేతులు కదిలించకపోవడం, 8 నెలలు వచ్చినా మెడలు నిలబెట్టకపోవడం, బోర్లా పడకపోవడం, పాకక పోవడం వంటి లక్షణాలు కనిపించాయి. ఆందోళనకు గురైన అయాన్షు తల్లిదండ్రులు రెయిన్‌బో చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌ను ఆశ్రయించగా, డాక్టర్‌ రమేష్‌ నేతృత్వంలో వైద్యపరీక్షలు నిర్వహించి బాలుడు అరుదైన ‘స్పైనల్‌ మస్క్యులర్‌ అట్రొఫి’(ఎస్‌ఎంఎ) అనే జన్యులోపంతో బాధపడుతున్నట్లు నిర్ధారించారు.

- Advertisement -

ఈ చికిత్సకు సుమారు రూ.22 కోట్లు విలువజేసే ‘జోల్గెన్‌స్మాన్‌’ అనే ఇంజక్షన్‌ ఒక్కటే మార్గమని, అమెరికా నుంచి తెప్పించాల్సి ఉంటుందని చెప్పగా కంగుతిన్నారు. బిడ్డను బతికించుకోవాలనే తపనతో తెలిసిన వారి సాయంతో ‘క్యూర్‌ ఎస్‌ఎంఎ’ ఫౌండేషన్‌ను ఆశ్రయించారు. ఫౌండేషన్‌, స్నేహితుల సహకారంతో ‘ఇంపాక్ట్‌ గురు.కామ్‌’లో అయాన్ష్‌కు సంబంధించిన మెడికల్‌ రిపోర్ట్‌లు, వైద్యానికి అవసరమయ్యే ఖర్చు వివరాల కాపీని అప్‌లోడ్‌ చేశారు.

ఇంపాక్ట్‌ గురు.కామ్‌ నిర్వాహకులు అయాన్ష్‌కు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి చికిత్సకు అవసరమయ్యే రూ.22 కోట్ల కోసం సమీకరణ ప్రారంభించారు. ఫిబ్రవరి 4న క్రౌడ్‌ ఫండింగ్‌ ప్రారంభించగా మే 22 నాటికి సగం నిధులు ప్రపంచవ్యాప్తంగా దాతలు అందించారు. ఒక దాత రూ.54 లక్షలు ఇవ్వడం విశేషం. ఈనెల 9న అమెరికా నుంచి తెప్పించిన ఖరీదైన ఇంజక్షన్‌ను ఇవ్వగా ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

మంత్రి కేటీఆర్‌ చొరవతో రూ.6 కోట్ల పన్ను మాఫీ

బాలుడి తల్లిదండ్రులు విషయాన్ని మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించిన ఆయన జోల్గెన్‌స్మాన్‌ ఇంజక్షన్‌పై పన్ను ఎత్తివేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. మంత్రి విజ్ఞప్తి మేరకు కేంద్రం రూ.6 కోట్ల పన్ను మాఫీ చేసింది. ఫలితంగా ఇంజక్షన్‌ ధర రూ.22 కోట్ల నుంచి రూ.16 కోట్లకు తగ్గింది.

20 వేల మంది పిల్లలకు ఆర్థిక సాయం

ఖరీదైన వైద్యం చేయించుకునే స్థోమత లేని పిల్లల కోసం ఇంపాక్ట్‌గురు.కామ్‌ పనిచేస్తుంది. బాధితుల పూర్తి వివరాలు సేకరించి, వాటిని పూర్తిగా పరిశీలించిన తర్వాతే వెబ్‌సైట్‌లో రోగుల వివరాలను అప్‌లోడ్‌ చేసి సోషల్‌ మీడియా,డిజిటల్‌ మీడియా ద్వారా క్రౌడ్‌ ఫండ్స్‌ సేకరణ చేపడుతాం. ఇప్పటివరకు సుమారు 20వేల మంది పిల్లల చికిత్సకు నిధులు సేకరించి అందించాం. రూ.5 లక్షల కంటే ఎక్కువ ఖర్చయ్యే వారికి మా వెబ్‌సైట్‌ ద్వారా నేరుగా దవాఖానలకు చెల్లిస్తాం. – పీయూష్‌జైన్‌, సందీప్‌త్రిపాఠి, ఇంపాక్ట్‌ గురు.కామ్‌ ప్రతినిధులు

జీవితాంతం రుణపడి ఉంటాం

అయాన్జ్‌గుప్తా తొలి సంతానం. అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాం. అరుదైన వ్యాధి అని తెలిసి గుండె ఆగినంత పనైంది. రూ.22 కోట్లు ఖర్చవుతుందని చెప్పడంతో నిశ్చేష్టులమయ్యాం. బిడ్డను బతికించుకోవాలనే లక్ష్యంతో స్నేహితులు, రెయిన్‌బో వైద్యులు, ఇంపాక్ట్‌గురు.కామ్‌ సహకారంతో చికిత్స చేయించుకోగలిగాం. మా బిడ్డ ప్రాణాలు నిలిపేందుకు విరాళాలు అందించిన ప్రతిఒక్కరికీ రుణపడి ఉంటాం. -యోగేష్‌గుప్తా, రూపన్‌గుప్తా, బాలుడి తల్లిదండ్రులు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పసివాడి ప్రాణం..65 వేల మంది సాయం
పసివాడి ప్రాణం..65 వేల మంది సాయం
పసివాడి ప్రాణం..65 వేల మంది సాయం

ట్రెండింగ్‌

Advertisement