బుధవారం 02 డిసెంబర్ 2020
Hyderabad - Oct 31, 2020 , 06:53:40

దెబ్బతిన్న రోడ్లకు తక్షణ మరమ్మతులు

దెబ్బతిన్న రోడ్లకు తక్షణ మరమ్మతులు

 • మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో.. గ్రేటర్‌లో చకచకా రోడ్లకు మెరుగులు
 • వెనువెంటనే నిధులు మంజూరు, టెండర్లు పూర్తి
 • ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు
 • యుద్ధ ప్రాతిపదికన 83 కిలోమీటర్లలో ప్యాచ్‌వర్క్‌లు
 • రూ. 52 కోట్ల వ్యయంతో 99 కి.మీ. రోడ్లకు పునర్నిర్మాణం
 • రూ.80కోట్ల వ్యయంతో అత్యవసరంగా సీసీ రోడ్లు 
 • చెరువులకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు
హైదరాబాద్‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో రోడ్ల పునర్నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నగరం యావత్తు విపత్తులో ఉన్నప్పటికీ నగరవాసులకు ఇబ్బందులు తలెత్తకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టింది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో 9013 కిలో మీటర్ల విస్తీర్ణం గల రహదారులు ఉన్నాయి. వీటి లో 2846 కిలో మీటర్లలో బీటీ రోడ్లు ఉండగా, 6167 కిలో మీటర్ల సీసీ రోడ్లు ఉన్నాయి. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ఆయా ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. అయితే దెబ్బతిన్న రోడ్లకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టమైన ఆదేశాలు జారీచేయడంతో నగరంలో రోడ్ల పునర్నిర్మాణ పనులు జోరందుకున్నాయి.

పదిరోజుల పాటు పునరుద్ధరణ పనులు

హుస్సేన్‌సాగర్‌ నుంచి సికింద్రాబాద్‌ మార్గంలో రూ.68 కోట్లతో చేపడుతున్న సర్‌ప్లస్‌ నాలా అభివృద్ధి పనులు అసంపూర్తిగా మా రాయి. అయితే వెంటనే పను లు చేపట్టి పూర్తిచేయాలని మంత్రి కేటీఆర్‌ ఆదేశించడంతో ట్రాఫిక్‌ పోలీసుల అనుమతులు పొంది ప్రారంభించేందుకు జీహెచ్‌ఎంసీ ఇంజినీరింగ్‌ అధికారులు చర్యలు చేపట్టారు. రాబోయే పది రోజుల పాటు రోడ్ల పునరుద్ధరణ పనులపై సమగ్ర ప్రణాళిక రూపొందించుకొని రోజువారీ లక్ష్యాలతో పనులు చేపట్టనున్నారు. భారీ వర్షాల కారణంగా పాతబస్తీలోని ఆజంపురా వంతెన కూలిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్‌ వెంటనే స్పందించి వంతెన పునర్నిర్మాణానికి రూ.3 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అధికారులు ప్రతిపాధనలు రూపొందించడంతోపాటు టెండర్ల ప్రక్రియను ప్రారంభించారు. 
 • నగరంలో చేపడుతున్న పనులు

  • జీహెచ్‌ఎంసీ నిర్వహణ పరిధిలో దెబ్బతిన్న 83కిలో మీటర్ల రోడ్లకు ప్యాచ్‌వర్క్‌లను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నారు. 
   • జీహెచ్‌ఎంసీ నిర్వహించే రోడ్లలో 99కిలో మీటర్ల మేర రూ.52 కోట్ల వ్యయంతో పునర్నిర్మించే పనులు ప్రారంభమయ్యాయి. 
 • సమగ్ర  రహదారుల అభివృద్ధి పథకం కింద 83కిలో మీటర్ల రహదారులలో మొదటి లేయర్‌ను వేస్తున్నారు. 
 • 273 కిలోమీటర్ల విస్తీర్ణంలో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.204.36 కోట్లు మంజూరయ్యాయి. ఇందుకు సంబంధించి 766 పనులకు టెండర్ల ప్రక్రియ పురోగతిలో ఉంది. 
 • అత్యవసరమైన చోట్లను ఎంపిక చేసి రూ.80 కోట్ల వ్యయంతో ఆయా ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని మంత్రి కేటీఆర్‌ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయగా.. ఇంజినీరింగ్‌ అధికారులు పనులను ప్రారంభించారు. 
 • రూ.298 కోట్ల వ్యయంతో అదనంగా బాక్స్‌ డ్రైన్లను చేపట్టేందుకు పరిపాలన సంబంధిత అనుమతులు జారీ చేయడంతో ఈ పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పురోగతిలో ఉంది.