శుక్రవారం 30 అక్టోబర్ 2020
Hyderabad - Jul 13, 2020 , 23:34:54

చెప్పినా.. పట్టించుకోరు.. భౌతికదూరం పాటించరు

చెప్పినా.. పట్టించుకోరు.. భౌతికదూరం పాటించరు

విచ్చలవిడిగా రోడ్లపైకి వస్తున్న ప్రజలు 

కంటోన్మెంట్‌లో  136 కేసులు నమోదు

72 మంది డిశ్చార్జి - ఐదుగురి మృతి

చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 59 మంది

కంటికి కనిపించని శత్రువుతో పోరాటం.. యావత్‌ ప్రపంచం అతలాకుతలం.. రోజుకు వేలల్లో  పాజిటివ్‌ కేసులు నమోదు.. ఎప్పుడు ఎటు నుంచి వస్తుందో తెలియని భయం.. మానవాళికి సవాల్‌ విసురుతున్న ‘కొవిడ్‌-19’ కట్టడి కోసం డాక్టర్లు, పోలీసులు,పారిశుద్ధ్య కార్మికులు, మీడియా ప్రతినిధులు ఇలా ప్రతిఒక్కరూ  నిరంతరం కష్టపడుతుంటే.. కంటోన్మెంట్‌ నియోజకవర్గంలో ప్రజలు వీధుల్లో గుంపులు గుంపులుగా ఉంటూ రహదారులపై విచ్చల విడిగా తిరుగుతున్నారు. కొంతమంది అయితే మాస్కులు లేకుండా భౌతికదూరం కూడా పాటిస్తలేరు. ఇప్పటికే ఈ నియోజకవర్గంలో 136 కేసులు నమోదు కాగా.. ఇప్పటి వరకు ఐదుగురు మృతి చెందారు. ఇప్పటికైనా మనమంతా తప్పనిసరిగా మాస్కులు ధరించి,భౌతికదూరం పాటించి కలవర పెడుతున్న కరోనాను తరిమేద్దామని ప్రతిజ్ఞ చేద్దాం..

కంటోన్మెంట్‌: కంటోన్మెంట్‌లో ఇప్పటి వరకు 136 కరోనా కేసులు నమోదుకాగా, ఇప్పటివరకు 72 మంది డిశ్చార్జి అయ్యారు.ఐదుగురు మృతి చెందారు. ప్రస్తుతం దవాఖానలో 59 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం పకడ్బందీగా లాక్‌డౌన్‌ను అమలు చేసినా.. ఎన్‌ఆర్‌ఐ, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి ద్వారా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇటువంటి సమయంలో ఇండ్లకే పరిమితం కావాల్సిన ప్రజలు తమకు  ఏమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. వైరస్‌ తమకు సోకదన్న భావనతో ఇష్టానుసారంగా రోడ్ల మీదకు వస్తున్నారు. వైద్యులు ఎన్ని సూచనలు చేస్తున్నా.. అధికారులు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. 

కిక్కిరిసిపోతున్న కంటోన్మెంట్‌ రోడ్లు  

లాక్‌డౌన్‌-5లో కేంద్ర ప్రభుత్వం కంటైన్మెంట్‌ జోన్లు మినహా మిగిలిన ప్రాంతాల్లో సాధారణ కార్యకలాపాలకు అనుమతులిచ్చింది. అయితే తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని నిబంధనలు ఉన్నా.. ప్రజలు మాత్రం రోడ్ల మీదకు వస్తున్నారు. దీంతో తిరుమలగిరి, మారేడ్‌పల్లి, కార్ఖానా, బోయిన్‌పల్లి ప్రాంతాల్లోని ప్రధాన జంక్షన్లు జనాలతో కిక్కిరిసిపోతున్నాయి. ఆదివారం అయితే చాలు మాంసం దుకాణాల వద్ద జనం క్యూ కడుతున్నారు.

మనచేతుల్లోనే కరోనా నియంత్రణ

కరోనా నియంత్రణ ప్రజల చేతుల్లోనే ఉంది. భౌతికదూరం పాటిస్తూ మాస్కు ధరించాలి. ఎప్పటికప్పుడు చేతులను శానిటైజ్‌ చేసుకోవాలి. 60 ఏండ్ల్లు దాటిన వారు, పదేండ్ల్లలోపు పిల్లలు ఇండ్లలోనే ఉండాలి. ఎవరికి  అనారోగ్య లక్షణాలు ఉన్నా వెంటనే  ఆరోగ్య

 పరీక్షలు చేయించుకోవాలి.    - పి. మధుకర్‌ స్వామి, సీఐ, కార్ఖానా

భౌతికదూరం పాటిస్తూ.. జాగ్రత్తలు తీసుకోవాలి

కరోనా నివారణకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నది. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ, అధికారులు 24 గంటలు పనిచేస్తున్నారు.  ప్రజలు సైతం తగిన జాగ్రత్తలు పాటించాలి. అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటకు రావాలి. వచ్చిన వారు కూడా మాస్కు ధరించాలి. తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలి.   - అనూప్‌ మెహతా, వైద్యుడు, కార్ఖానా