ఆదివారం 01 నవంబర్ 2020
Hyderabad - Sep 28, 2020 , 00:39:00

సరిపోలితేనే.. అనుమతి

సరిపోలితేనే.. అనుమతి

బల్దియా ఎన్నికల్లో ఫేస్‌ రికగ్నిషన్‌ సిస్టం  l డివిజన్‌కు ఒక పోలింగ్‌ కేంద్రంలో ఏర్పాటు  

సాంకేతికతతో నకిలీ ఓట్లకు చెక్‌  l  సీనియర్‌ సిటీజన్లు, పోలింగ్‌ అధికారులకు ‘ఈ -ఓటింగ్‌' 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: నకిలీ ఓట్లను గుర్తించేందుకు సాంకేతికతను ఉపయోగించనున్నారు. ఈ సారి బల్దియా ఎలక్షన్‌లో ఫేస్‌ రికగ్నిషన్‌ విధానాన్ని అమలు చేయనున్నారు. దీని ద్వారా దొంగ ఓట్లను ఇట్టేపసిగట్టవచ్చు. జీహెచ్‌ఎంసీ పాలకవర్గం   గడువు ఫిబ్రవరి 10న ముగియనుండటంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధమవుతున్నది. ఇప్పటికే పోలింగ్‌ అధికారులకు ఎన్నికల నిర్వహణపై శిక్షణ ఇస్తున్న ఎస్‌ఈసీ.. ఎన్నికల్లో ఫేస్‌ రికగ్నిషన్‌ సిస్టం, ‘ఈ ఓటింగ్‌' తదితర సాంకేతికతను వినియోగించాలని ప్రాథమిక నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు డివిజన్‌కు ఒక కేంద్రంలో ఫేస్‌ రికగ్నిషన్‌ (ముఖ గుర్తింపు) సిస్టంను ఏర్పాటు చేయనున్నది. ఈ ప్రక్రియ విజయవంతమైతే తరువాత జరిగే మున్సిపాలిటీల ఎన్నికల్లో ఈ పరిజ్ఞానాన్ని విస్తృతం చేయాలనే ఆలోచనలో ఉన్నామని ఎన్నికల కమిషన్‌ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇక సీనియర్‌ సిటీజన్స్‌ (పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓటు వేయలేని స్థితిలో ఉన్నవారు), పోలింగ్‌ శాతం తక్కువగా ఉన్న డివిజన్లలోని ఓటర్లు, పోలింగ్‌ అధికారుల కోసం ఈ- ఓటింగ్‌ను తీసుకురానున్నారు. దీని ద్వారా కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఉన్న చోటు నుంచే ఓటు వేసే వెసలు బాటు కల్పించనున్నారు. ఎన్నికల్లో బ్యాలెట్‌లు వాడాలా లేక ఈవీఎంలు వినియోగించాలా అనే విషయంపై రాజకీయ పార్టీలు అభిప్రాయాన్ని తెలిపిన వెంటనే ఈ విషయంలో స్పష్టమైన ప్రకటన చేయనున్నారు. 

ఓటరు గుర్తింపు కోసమే.. 

ఫేస్‌ రికగ్నిషన్‌లో భాగంగా ఓటరు పోలింగ్‌ కేంద్రానికి రాగానే ఫొటో తీసి అప్‌లోడ్‌ చేస్తారు. వచ్చిన వ్యక్తి రోల్‌లో ఉన్న వ్యక్తి ఒక్కరేనా.. కాదా.. అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఒకరి పేరుతో మరొకరు ఓటు వేయడానికి ఆస్కారం ఉండదు. ఓటరు గుర్తింపు కోసం మాత్రమే ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది. గతేడాది కొంపల్లిలో  ఈ ప్రక్రియను ప్రయోగాత్మకంగా చేపట్టారు. 

ఓటింగ్‌లో బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ..

పోలింగ్‌ కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఉన్న చోటు నుంచి ఆన్‌లైన్‌లో ఓటు వేసేందుకు తీసుకురానున్న ఈ-ఓటింగ్‌లో బ్లాక్‌ చైన్‌ సాంకేతికతను వినియోగించనున్నారు. ఈ- ఓటింగ్‌లో ఓటు వేసిన మూడు నాలుగు రోజుల తరువాత కౌంటింగ్‌ చేస్తారు. అప్పటి వరకు వేసిన ఓట్లు రిటర్నింగ్‌ అధికారి లాగిన్‌లో ఉండిపోతాయి. ట్యాంపరింగ్‌ చేస్తున్నారని కొందరు చేస్తున్న వాదనకు ఫుల్‌ స్టాప్‌ పెట్టేందుకు ఈ పరిజ్ఞానాన్ని తీసుకొచ్చారు.  ఓటు వేసిన వెంటనే లాక్‌ అయిపోయేలా బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీని తీసుకురానున్నారు. ఈ బాధ్యతను ఐటీ శాఖకు అప్పగించారు.