మంగళవారం 20 అక్టోబర్ 2020
Hyderabad - Sep 22, 2020 , 00:42:19

గ్రాడ్యుయేట్లను గుర్తించి.. ఓటరుగా నమోదు చేయించండి

గ్రాడ్యుయేట్లను గుర్తించి.. ఓటరుగా నమోదు చేయించండి

విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి.. అప్రమత్తంగా వ్యవహరించండి 

పెండింగ్‌ సమస్యలు లేకుండా చూడండి 

కార్పొరేటర్లకు మంత్రి తలసాని దిశానిర్దేశం 

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్‌ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు అర్హులైన ప్రతీ గ్రాడ్యుయేట్‌ ఓటరుగా నమోదయ్యే విధంగా చూడాల్సిన బాధ్యత ప్రతి కార్పొరేటర్‌పై ఉందని పశు సంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. సోమవారం లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని పింగళి వెంకట్రామయ్య ఫంక్షన్‌హాల్‌లో హోంమంత్రి మహమూద్‌ అలీ, కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జీహెచ్‌ఎంసీ పరిధిలోని కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ ప్రతి కార్పొరేటర్‌ తమ తమ డివిజన్ల పరిధిలో ఉన్న గ్రాడ్యుయేట్‌లను గుర్తించి వారు ఓటరుగా నమోదు చేయించుకునేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. విస్తృతంగా వర్షాలు కురుస్తున్నందున కార్పొరేటర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని సూచించారు. కరోనా మహమ్మారి నియంత్రణకు లాక్‌డౌన్‌ అమలు చేసిన సమయంలో ప్రతి కార్పొరేటర్‌ ఎంతో శ్రమించారని, ప్రజల ఇబ్బందులను గుర్తించి వారికి అండగా నిలిచారని ప్రశంసించారు. ఆయా డివిజన్ల పరిధిలో పెండింగ్‌ సమస్యలు ఏమైనా ఉంటే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, లేదా తన దృష్టికి  తీసుకొస్తే అవసరమైన చర్యలు తీసుకుంటానని మంత్రి తలసాని హామీ ఇచ్చారు. సమావేశంలో ఎమ్మెల్సీ ప్రభాకర్‌, జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ముఠాగోపాల్‌, అరికెపూడి గాంధీ, సాయన్న, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌, సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ పార్టీ ఇన్‌చార్జి తలసాని సాయి కిరణ్‌యాదవ్‌, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.
logo