బుధవారం 27 మే 2020
Hyderabad - Apr 08, 2020 , 23:42:22

12 చోట్ల ప్రత్యేక దృష్టి

12 చోట్ల ప్రత్యేక దృష్టి

  • కంటైన్‌మెంట్‌ క్లస్టర్లుగా గుర్తింపు
  • పటిష్ట బందోబస్తు, రాకపోకలపై నిఘా
  • ఈ ప్రాంతాల్లోని 89 పాజిటివ్‌ కేసులు
  • మర్కజ్‌కు వెళ్లివచ్చిన వారిలో 593మందికి పరీక్షలు
  • అందులో 63మందికి పాజిటివ్‌
  • వారి ద్వారా మరో 45మంది కుటుంబ సభ్యులకు వ్యాప్తి
  • జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ వెల్లడి

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: నగరంలో అత్యధికంగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన 12 ప్రాంతాలను కంటైన్‌మెంట్‌ క్లస్టర్లుగా ఏర్పాటు చేసినట్టు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డి.ఎస్‌. లోకేశ్‌ కుమార్‌ తెలిపారు. ఆ ప్రాంతాల్లో 89పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వెల్లడించారు. అక్కడ రాకపోకలపై నిఘాను ఏర్పాటుచేస్తున్నట్లు పేర్కొన్నారు. మర్కజ్‌కు వెళ్లి వచ్చినవారిలో  593మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 63మందికి పాజిటివ్‌ వచ్చిందని, వారి ద్వారా మరో 45మంది వ్యాధి సోకిందన్నారు.  

ఇవీ క్లస్టర్లు

రాంగోపాల్‌పేట్‌, షేక్‌పేట్‌, రెడ్‌హిల్స్‌, మలక్‌పేట్‌-సంతోష్‌నగర్‌, చాంద్రాయణగుట్ట, అల్వాల్‌, మూసాపేట్‌, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌-గాజుల రామారం, మయూరినగర్‌, యూసుఫ్‌గూడ, చందానగర్‌లను కంటైన్‌మెంట్‌ క్లస్టర్లు గా ఏర్పాటు చేసినట్టు లోకేశ్‌కుమార్‌ వివరించారు. ఈ ప్రాంతాల్లో పారిశుధ్యం, క్రిమిసంహారక రసాయనాల స్ప్రేయింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. ప్రతి క్లస్టర్‌లో వైద్య-ఆరోగ్యశాఖ, జీహెచ్‌ఎంసీ బృం దాలు క్రమం తప్పకుండా సందర్శించి కొవిడ్‌-19 లక్షణాలున్నవారిని గుర్తించి వైద్య పరీక్షలు చేయించనున్నట్లు తెలిపారు. నిర్ణీత కాలం వరకు బారికేడింగ్‌, బందోబస్తు చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని కమిషనర్‌ అభిప్రాయపడ్డారు. కొవిడ్‌-19 లక్షణాలు ఉన్నవారికి వైద్య పరీక్షలు నిర్వహించి ప్రభుత్వ ఐసోలేషన్‌ కేంద్రాలకు తరలించినట్లు, దీనికోసం ఆరు ఆసుపత్రుల్లో పాజిటివ్‌ ఐసొలేషన్‌ కేంద్రాలను ఏర్పాటుచేసినట్లు చెప్పారు.

ముందుకొస్తున్న దాతలు...

 జీహెచ్‌ఎంసీలో నెలకొల్పిన ప్రత్యేక విభాగం ద్వారా దాతల సహకారంతో పది మొబైల్‌ వాహనాల ద్వారా 17వేల ఆహార ప్యాకెట్లను సేకరించి, సర్కిల్‌ కార్యాలయాల నుంచి గుర్తించిన వారికి అందజేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా నగరంలో దాదాపు 400 ప్రాంతాల్లో స్వచ్ఛందంగా ఆహారాన్ని అందించేందుకు ముందుకొచ్చిన 145మంది దాతలకు పాస్‌లు జారీచేశామన్నారు. ఈ 145మంది దాతలు 50వేలమందికి భోజనం పెడుతున్నట్లు తెలిపారు. అదేవిధంగా 93స్వచ్ఛంద సంస్థలు, దాతలు అందించిన సబ్బులు, మంచినూనె, బియ్యం,ఇతర సామాగ్రిని షెల్టర్‌హోమ్‌లలో ఆశ్రయం పొందుతున్న వారికి పంపిణీచేశామన్నారు. 

పారిశుధ్య కార్మికులకు రక్షణ కిట్‌లు....

 పారిశుధ్య కార్మికుల రక్షణకు అన్ని జాగ్రత్త చర్యలూ పాటిస్తున్నట్లు కమిషనర్‌ తెలిపారు.జోనల్‌ కమిషనర్ల ఆధ్వర్యంలో అందరికీ మాస్కులను పంపిణీచేసినట్లు చెప్పారు. అలాగే, 7500లీటర్ల శానిటైజర్‌ను సమకూర్చినట్లు తెలిపారు. కోవిడ్‌-19 నేపథ్యంలో రీయుజబుల్‌గా ఉండే 60వేల క్లాత్‌ మాస్క్‌లను సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూపు మహిళల ద్వారా కుట్టిస్తున్నట్లు చెప్పారు. ఇందులో 30వేల మాస్కులు ఇప్పటికే సిద్ధం కాగా, మరో నాలుగు రోజుల్లో మిగిలిన 30వేల మాస్కులు సిద్ధమవుతాయన్నారు. పారిశుధ్య కార్మికులతోపాటు స్వచ్ఛ ఆటో డ్రైవర్లు, వారి సహాయకులకు కూడా రెండు చొప్పున మాస్కులను పంపిణీచేశామన్నారు. కార్మికుల ఆరోగ్య సంరక్షణకు ఉపయోగపడే గ్లౌజ్‌లు, మాస్కులు, బూట్లు, సబ్బులు, ఇతర ప్రధానమైన వస్తువులతో కూడిన రక్షణ కిట్‌లను ప్రతి ఏటా ఏప్రిల్‌లో అందిస్తామని, ఈ ఏడు కూడా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే, ఇకమీదట గ్లౌజ్‌, మాస్కు, హెల్త్‌ కిట్‌ ధరించడం తప్పనిసరి చేయనున్నట్లు చెప్పారు. 

కార్మికులకు ప్రయాణ సౌకర్యం... 

లాక్‌డౌన్‌ నేపథ్యంలో దూర ప్రాంతాలనుంచి వచ్చే పారిశుధ్య కార్మికుల సౌకర్యార్థం ఆర్టీసీ సహకారంతో 34బస్సులను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. సామాజిక దూరాన్ని అమలుచేసేందుకు బస్సులలో వాలంటీర్‌ను కూడా నియమించామన్నారు. ప్రస్తుతం నగరంలో రోజుకు 4500-4800మెట్రిక్‌ టన్నుల చెత్త సేకరించి డంప్‌యార్డ్‌కు తరలిస్తున్నట్లు చెప్పారు.

330 సంచార రైతుబజార్లు.. 55వేలమందికి భోజనాలు..

330 మొబైల్‌ రైతు బజార్ల ద్వారా ఆయా ప్రాంతాల్లో కూరగాయలు అందుబాటులోకి తెచ్చామని కమిషనర్‌ చెప్పారు. వలస కార్మికులకు ప్రభుత్వం ప్రకటించిన 12కిలోల చొప్పున ఉచిత బియ్యాన్ని, రూ. 500నగదును పంపిణీచేసినట్లు పేర్కొన్నారు.  3400మంది నిరాశ్రయులను గుర్తించి 14నైట్‌ షెల్టర్లతోపాటు 12 తాత్కాలిక షెల్టర్లకు తరలించామన్నారు. వర్తక, వ్యాపార,విద్యాసంస్థలు, పరిశ్రమలు మూత పడడంతో ఎటువంటి ఆధారంలేని వ్యక్తులకు అన్నపూర్ణ పథకం ద్వారా ఉచితంగా మధ్యాహ్నం 55వేలు, ఆలాగే 35వేలమందికి రెండు పూటలా భోజనం అందిస్తున్నట్లు లోకేష్‌ కుమార్‌ వెల్లడించారు.


logo