శుక్రవారం 04 డిసెంబర్ 2020
Hyderabad - Oct 20, 2020 , 07:58:57

అభివృద్ధిలో తెలంగాణ ఆదర్శం

అభివృద్ధిలో తెలంగాణ ఆదర్శం

  • కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి
  • వివిధ పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి చేరికలు

కేపీహెచ్‌బీ కాలనీ : అభివృద్ధిలో దేశానికకే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్నదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. కేపీహెచ్‌బీ కాలనీ నాలుగో ఫేజ్‌లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమక్షంలో బీఎస్‌పీకి చెందిన శేఖర్‌రెడ్డి, టీడీపీకి చెందిన గద్దె రామారావు ఆధ్వర్యంలో 170 మంది నాయకులు, కార్యకర్తలు సోమవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి మంత్రి మల్లారెడ్డి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌  నాయకత్వంలో రాష్ట్రంలో సంక్షేమం వెల్లివిరిస్తున్నదన్నారు. మంత్రి కేటీఆర్‌ నాయకత్వంలో హైదరాబాద్‌ నగరం ఐటీ హబ్‌గా మారిందని తెలిపారు. బుతుకమ్మ పండుగకు రాష్ట్రవ్యాప్తంగా చీరెలు పంపిణీ చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఏదో జరిగిపోతుందన్న అపోహలన్నీ పటాపంచలయ్యాయని, నగర  ప్రజలంతా కలిసిమెలిసి జీవించేలా ప్రభుత్వం పాలన సాగిస్తుందని పేర్కొన్నారు. వేల కోట్లతో మిషన్‌ భగీరథ, రైతుబంధు, ఉచిత విద్యుత్‌ వంటి పథకాలను కొనసాగిస్తూనే ప్రజలు ఇబ్బందులు పడుతున్న చట్టాలను ప్రభుత్వం ప్రక్షాళన చేస్తోందన్నారు. కొత్త రెవెన్యూ చట్టంతో భూ సమస్యలన్నీ పరిష్కారమవుతాయన్నారు. బాలానగర్‌ చౌరస్తాలో నిర్మిస్తున్న ఫ్లైఓవర్‌ తో ట్రాఫిక్‌ సమస్య తీరుతుందన్నారు. మాధవరం కృష్ణారావు లాంటి ఎమ్మెల్యే కూకట్‌పల్లి ప్రజలకు దొరకడం అదృష్టమని, సీఎంను కలిసినా, మంత్రిని కలిసినా సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రాలు ఇస్తూ.. నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తుంటారని తెలిపారు.

కూకట్‌పల్లిలో రూ.1,500కోట్ల అభివృద్ధి పనులు : ఎమ్మెల్యే కృష్ణారావు

కూకట్‌పల్లి నియోజకవర్గంలో ఐదేండ్ల కాలంలో రూ.1,500 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే మాధవరం తెలిపారు. సీఎం కేసీఆర్‌ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్శితులై ఇతర పార్టీల నేతలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు.  ఏక్కడైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తానన్నారు. కరోనా సమయంలో టీఆర్‌ఎస్‌ నేతలంతా నిత్యావసరాలు పంపిణీ చేసి బాధితులకు అండగా నిలిచారని తెలిపారు. పార్టీలో చేరిన వారిలో టీడీపీ నాయకులు గద్దె రామారావు, శ్రీనివాస్‌, సత్యనారాయణ రాజు, దాసరి శ్రీనివాస్‌, బీఎస్పీ నుంచి కల్యాణ్‌వర్మ, గణేశ్‌నాయక్‌, నారూనాయక్‌, రఘు, సీతారాంరెడ్డి, మారుతి, బ్రహ్మచారి, శ్రీనివాస్‌, రాము, సాయిబాబా, రమేశ్‌, బుజ్జిబాబు, చిన్నా, రవీందర్‌రెడ్డి, మధు, బాలు, ఉపేందర్‌, వెంకట్రావు, కొండయ్య తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మందడి శ్రీనివాసరావు, ముద్దం నర్సింహాయాదవ్‌, కాండూరి నరేంద్రాచార్య, పండాల సతీశ్‌గౌడ్‌, జూపల్లి సత్యనారాయణ, టీఆర్‌ఎస్‌ డివిజన్‌ అధ్యక్షుడు సాయిబాబాచౌదరి, ఇన్‌చార్జి అడుసుమల్లి వెంకటేశ్వర్‌రావు, మహిళా విభాగం నియోజకవర్గ అధ్యక్షురాలు జి.జ్యోతి తదితరులు పాల్గొన్నారు.