గురువారం 09 జూలై 2020
Hyderabad - May 31, 2020 , 01:39:36

ప్రజల నుంచి శాంపిల్స్‌ సేకరిస్తున్న ఎన్‌ఐఎన్ ఐసీఎంఆర్‌

ప్రజల నుంచి శాంపిల్స్‌ సేకరిస్తున్న ఎన్‌ఐఎన్ ఐసీఎంఆర్‌

హైదరాబాద్  : నగరంలో ఐదు కంటైన్‌మెంట్‌ జోన్లలో నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రీషన్‌(ఎన్‌ఐఎన్‌), ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌(ఐసీఎంఆర్‌) సంయుక్తాధ్వర్యంలో శనివారం నమూనాలు సేకరించారు. సుమారు పది బృందాలు విడిపోయి ఒకొక్క జోన్‌లో ఇద్దరు చొప్పున శాస్త్రవేత్తలు ప్రజల నుంచి శాంపిల్స్‌ సేకరించారు. కంటైన్‌మెంట్‌ జోన్‌ను నాలుగు డివిజన్లుగా ఏర్పాటు చేసి ఒక్కో డివిజన్‌లో 25 మంది నుంచి రక్త నమూనాలు సేకరిస్తున్నారు.  మొదటిరోజు విజయవంతంగా 250 నమూనాలను సేకరించారు. దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన 13 హాట్‌స్పాట్‌ సిటీల్లో ఒక్కటిగా ఉన్న హైదరాబాద్‌లోని మియాపూర్‌, ఆదిబట్ల, చందానగర్‌, బాలాపూర్‌, టప్పాచబుత్రా కంటైన్‌మెంట్లలో మొదటిరోజు సర్వేను ఎన్‌ఐఎన్‌, ఐసీఎంఆర్‌ బృందాలు పర్యటించి న మూనాలు సేకరించాయి. ఈ ప్రక్రియ ఆదివారం కూడా కొనసాగనుంది.

చెన్నై ల్యాబ్‌లో ఎంజైమ్‌ టెస్టులు

హైదరాబాద్‌లో సేకరించిన రక్తపు నమూనాలను ఎన్‌ఐఎన్‌ ల్యాబ్‌లో ప్రాసెస్‌ చేసిన అనంతరం చెన్నైలోని ప్రత్యేక ల్యాబ్‌కు పంపించనున్నారు. చెన్నై ల్యాబ్‌లో ఎంజైమ్‌ టెస్ట్‌ నిర్వహించి  అనాలిసిస్‌ చేసి వ్యాప్తి ఎలా చెందుతుందని నిర్ధారణకు వస్తారు. వీటి ఆధారంగా వ్యాక్సిన్‌ తయారు చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. టెస్టులు చేసినంత మాత్రాన కరోనా వచ్చినట్లు కాదని, క్వారంటైన్‌కూ పంపించడం లేదని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు కామారెడ్డి, జనగాం, నల్గొండ జిల్లాల్లో సుమారు 1200 మంది ప్రజల నుంచి నమూనాలు సేకరించామని, వీటిపై అధ్యయనం జరుగుతున్నదని, త్వరలో దీని ఫలితాలు వస్తాయని తెలిపారు. అదేవిధంగా ర్యాండమ్‌గా హైదరాబాద్‌ నగరంలోని ఎంపిక చేసిన కంటైన్‌మెంట్‌ జోన్లలో రెండురోజుల్లో 500 మంది నమూనాలను సేకరిస్తున్నారు. మొత్తంగా రాష్ట్రంలో 1700 నమూనాలు సేకరిస్తున్నట్లు ఎన్‌ఐఎన్‌ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ సర్వే ర్యాండమ్‌ శాంపిల్‌తో వైరస్‌ను తట్టుకునే యాంటీబాడీల లెవెల్‌ తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందని అధికారుల అంచనా.

పహాడీషరీఫ్‌లో... 

పహాడీషరీఫ్‌ : ఐసీఎంఆర్‌, ఎన్‌ఐఎన్‌ బృందాలు జల్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని కంటైన్‌మెంట్‌ జోన్‌లో సర్వే నిర్వహించారు. కరోనా వ్యాపి నేపథ్యంలో ఆయా బృందాలు స్థానిక బాలాపూర్‌ ఆరోగ్య కేంద్రం వైద్యులతో కలిసి మినార్‌కాలనీ కంటైన్‌మెంట్‌ జోన్‌లో శనివారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. మొత్తం 20 మంది వైద్యులు  రెండు బృందాలుగా ఏర్పడి వంద ఇండ్లను ఎన్నుకున్నారు. రాండమ్‌గా 50 ఇండ్లలోని ప్రతీ ఇంటి నుంచి ఒకరికి రక్త నమూనాలు సేకరించారు కార్యక్రమంలో వైద్యులు బాలాజీ, నిఖిల్‌, ప్రశాంతి, మంజుల  పాల్గొన్నారు.

 టప్పాచబుత్రాలో ..

కార్వాన్‌ :  టప్పాచబుత్రా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఘంజె షా దర్గా బస్తీలో స్థానికంగా నివసిస్తున్న ప్రజల నుంచి ఐసీఎంఆర్‌, ఎన్‌ఐన్‌ బృందాలు రక్తనమూనాలు సేకరించాయి. ఆసిఫ్‌నగర్‌ డివిజన్‌ ఏసీపీ శివ మారుతి, టప్పాచబుత్రా ఇన్‌స్పెక్టర్‌ జి. సంతోష్‌ కుమార్‌లతో కలిసి పర్యటించారు. 50 మంది నుంచి రక్త నమూనాలు సేకరించారు.


logo