శుక్రవారం 27 నవంబర్ 2020
Hyderabad - Oct 27, 2020 , 08:12:47

అన్నీ తెలుసుకున్నాకే పనికి కుదుర్చుకోండి

అన్నీ తెలుసుకున్నాకే పనికి కుదుర్చుకోండి

  • ఇతర దేశాల పనిమనుషులైతే పోలీసులకు సమాచారం ఇవ్వండి
  • రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ సూచన
  • నాచారం దొంగతనం కేసులో నేపాలీ ముఠా అరెస్ట్‌
  • ఇప్పటికే ప్రధాన సూత్రధారిని అరెస్ట్‌ కాగా.. తాజాగా మరో నలుగురు..
  • పరారీలో ఇంకో నలుగురు...
  • రూ.7లక్షల విలువచేసే  సొత్తు స్వాధీనం 
  • యూపీ, మహారాష్ట్ర, ఎస్‌ఎస్‌బీ పోలీసు సహకారంతో దొరికిన దొంగలు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ:  నేపాల్‌కు చెందిన దంపతులు ఓ ఇంట్లో పనిమనుషులుగా చేరి.. నమ్మకంగా పనిచేసి అందరి మన్ననలను పొందారు.. ఓ రోజు కుటుంబ సభ్యులు బయటకు వెళ్లగా.. ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలికి టీలో నిద్రమాత్రలు కలిపి ఇవ్వగా.. ఆమె స్పృహ కోల్పోయింది... వెంటనే వారు.. తమ ప్రాంతానికి చెందిన కొంతమందిని పిలిపించుకుని ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు, నగదును తీసుకొని పరారయ్యారు. రంగంలోకి దిగిన రాచకొండ పోలీసులు మొదట ప్రధాన సూత్రధారినిని పట్టుకోగా.. ఆ తర్వాత సోమవారం మరో నలుగురిని అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి దాదాపు రూ.7 లక్షల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఇంకా మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు. 

     నేరేడ్‌మెట్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ మహేశ్‌ భగవత్‌ వివరాలు వెల్లడించారు. నాచారం హెచ్‌ఎంటీ నగర్‌కు చెందిన సీహెచ్‌ ప్రదీప్‌ కుమార్‌ వ్యాపారి. భార్య, పిల్లలు, తల్లి లలితమ్మతో కలిసి ఉంటున్నాడు. ఈ నెల మొదటి వారంలో ప్రదీప్‌కుమార్‌.. తన ఇంట్లో పని మనుషులుగా నేపాల్‌కు చెందిన దంపతులు మాయ, అర్జున్‌లను పెట్టుకున్నాడు. వీరిని ఇన్‌ఫెసిలిటీ సర్వీస్‌ మేనేజ్‌మెంట్‌ లక్ష్మీనారాయణ ద్వారా పనిలో పెట్టుకున్నా డు. ఈ నెల 19న ప్రదీప్‌ వ్యాపారం పనిమీద బయటికి వెళ్లగా భార్య, పిల్లలు మెదక్‌లో ఉన్న ఓ శుభకార్యానికి వెళ్లారు. ఇంట్లో తల్లి లలితమ్మ(70) ఒక్కతే ఉంది. అదే రోజు రాత్రి 9 గంటలకు ప్రదీప్‌ ఇంటికి రాగా... తల్లి లలితమ్మ అపస్మారక స్థితిలో పడి ఉంది. వెంటనే మొదటి అంతస్తుకు వెళ్లి చూడగా కప్‌బోర్డులు, బీరువా తాళాలు పగులగొట్టి.. 18 తులాల బంగారం, 40 తులాల వెండి ఆభరణాలు, రూ.10 లక్షలు నగదును అపహరించినట్లు గుర్తించాడు. ఇంట్లో ఉన్న పనిమనుషులను పిలువగా పలకలేదు...దీంతో పనిమనుషులు మాయ, అర్జున్‌లు ఈ దొంగతనానికి పాల్పడినట్లు అనుమానించి నాచారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

నిందితుల కోసం 16 బృందాలు

ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌... నిందితులను పట్టుకోవడానికి శాంతి భద్రతలు, డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌, ఎస్‌ఓటీ, సీసీఎస్‌, ఐటీ సెల్‌ విభాగం ఇలా అందరితో కలిపి 16 బృందాలను ఏర్పా టు చేశారు. రంగంలోకి దిగిన ఈ బృందాలు ఈ నెల 22న లక్నో అవద్‌ బస్‌స్టాండ్‌ వద్ద నేపాల్‌ బస్సు ఎక్కే సమయంలో పోలీసులు మాయను అదుపులోకి తీసుకున్నారు. లక్నో కోర్టులో హాజరుపర్చి.. నగరానికి తీసుకువచ్చి ఆమెను రిమాండ్‌కు తరలించారు. ఆమె ఇచ్చిన వాంగ్మూలంలో మొత్తం 9 మంది సభ్యులు ఉన్నట్లు తే లింది. మాయను ముందుగా అరెస్ట్‌ చేయగా.. మిగతా నిందితులు రాజేశ్‌ చబీలాల్‌, హేమప్రసాద్‌, నిర్మల్‌ సౌద్‌, విసా సున్వార్‌ లను వెస్ట్‌ మారేడ్‌పల్లిలో అ రెస్ట్‌ చేశారు. ఇంకా మరో నలుగురు నిందితులు అర్జు న్‌, రతన్‌బిష్త్‌, జగత్‌ షబీ, గోబింద్‌ బహదూర్‌ పరారీలో ఉన్నారు. 

పనిమనుషులుగా చేరి..

నేపాల్‌కు చెందిన రాజేశ్‌, మాయ దంపతులు.. రెండు సంవత్సరాల కిందట పూణేకు వలస వచ్చారు. రాజేశ్‌ సంపన్నుల ఇండ్లలో పనిచేసి.. వారి సొత్తును కాజేయాలని స్కెచ్‌ వేశాడు. దీంట్లో భాగంగా  హైదరాబాద్‌లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న గోబింద్‌ బహదూర్‌ను సంప్రదించి.. తన బావకు ఉద్యోగం ఇప్పిస్తే చోరీలు చేద్దామని వివరించాడు. అదే సమయంలో సెక్యూరిటీ ఏజెన్సీ నిర్వాహకుడు లక్ష్మీనారాయణ ఫోన్‌ చేసి ఓ ఇంట్లో పనిమనుషులు కావాలి.. నేపాలీకి చెందిన దంపతులు ఎవరైనా ఉంటే చూడమని గోబింద్‌ బహదూర్‌కు  చెప్పాడు. దీంతో అతడు పూణేకు వెళ్లి నేపాల్‌కు చెందిన అర్జున్‌, మాయలను తీసుకువచ్చి  ప్రదీప్‌కుమార్‌ ఇంట్లో ఈ నెల 5న పనికి పెట్టాడు. నమ్మకంగా పనిచేసి.. ఇంటి యజమానుల నమ్మకాన్ని సంపాదించుకున్నారు. ఆ తర్వాత అర్జున్‌ పూణేలో ఉన్న వారి స్నే హితులు రతన్‌ బిష్త్‌,  జగత్‌ షాహీలను పిలిపించుకున్నాడు. వారు తీసుకువచ్చి ఇచ్చిన  నిద్ర మాత్రలను.. ఈ నెల 19న కుటుంబ సభ్యులు బయటకు వెళ్లగా.. ఇంట్లో ఉన్న వృద్ధురాలికి టీలో కలిపి ఇచ్చారు. ఆమె అపస్మారక స్థితిలోకి చేరగానే అర్జున్‌, మాయలు రతన్‌ బిష్త్‌, జగత్‌ షాహిలను పిలిపించుకుని ఇంట్లో చోరీ చేసి.. బస్సులో నేరుగా లక్నోకు వెళ్లిపోయారు. అంతకుముందు నాగ్‌పూర్‌ బస్సు ఎక్కే సమయంలో అర్జున్‌, రాజేశ్‌, నిర్మల్‌, హేమప్రసాద్‌, విస్నాసున్వార్‌లు సొత్తు ను పంచుకున్నారు. ఆ తర్వాత చోరీ సొత్తు సరిపోకపోవడంతో రాజేశ్‌తో పాటు ఇతర నిందితులు హైదరాబాద్‌కు తిరిగి వచ్చి మరికొన్ని నేరాలకు పాల్పడాలని నిర్ణయించుకున్నారు. నిందితుల కోసం రాచకొండ పోలీసులు ముంబై, పూణే, ఝాన్సీ, లక్నో ప్రాంతాలతో పాటు రైల్వే స్టేషన్‌లు, విమానాశ్రయాలు, నేపాల్‌ సరిహద్దులో గాలించారు. ఎస్‌ఎస్‌బీ, ఉత్తర్‌ప్రదేశ్‌ , మహారాష్ట్ర పోలీసుల సహకారంతో ఎట్టకేలకు నిందితులు నేపాల్‌కు పారిపోకముందే పట్టుకున్నారు. ఈ ముఠాను పట్టుకున్న సిబ్బందిని సీపీ అభినందించారు.

డుమ్మాలు కొట్టరని ...గుడ్డిగా నమ్మకండి

నేపాల్‌కు చెందిన దంపతులు.. తరచుగా డుమ్మాలు కొట్టరని.. వారికి పండుగలు సరిగ్గా ఉండవని.. దీంతో వారు ఎక్కడికి వెళ్లరని.. అందుకే చాలా మంది సంపన్నులు వారిని పనికి పెట్టుకోవడానికి ఇష్టపడతారని తేలింది. నాచారం చోరీ కేసు దర్యాప్తులో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కారణంగానే చాలా మంది సంపన్నులు నేపాల్‌కు చెందినవారిని పనిలో పెట్టుకునేందుకు పలు సెక్యూరిటీ ఏజెన్సీలు, ఇన్‌ ఫెసిలిటీ ఏజెన్సీలను సంప్రదిస్తారని స్పష్టమయింది. నేపాల్‌కు చెందిన అందరూ నేర చరిత్ర ఉన్నవారు కాదని.. వారిలో చాలా మంది మంచివాళ్లు కూడా ఉంటారని రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. అయితే ఇంట్లో పని మనుషులుగా పెట్టుకునే సమయంలో కచ్చితంగా వారి ధ్రువీకరణ పత్రాలను చెక్‌ చేసుకోవాలి. ఇతర ప్రాంతాలకు, దేశాలకు చెందిన వారిని పనుల్లో పెట్టుకునే సమయంలో పోలీసులకు సమాచారం ఇవ్వాలి. లేదా హాక్‌ ఐ యాప్‌లో వివరాలను నమోదు చేసుకోవచ్చ న్నారు. నాచారం కేసులో ప్రధాన నిందితుడు అర్జున్‌కు నేరచ రిత్ర ఉందని తేలింది. నేపాల్‌కు చెందిన యువతులను తీసుకొచ్చి.. వారిని తన భార్యగా చెప్పుకుంటూ  పనుల్లో చేరుతాడని తెలిసింది. ఈ విధంగా వ్యాపారి ప్రదీప్‌ ఇంట్లో అర్జున్‌, మాయలు భార్యాభర్తలుగా చెప్పుకుని పనుల్లో చేరారని విచారణలో తేలింది.  కుషాయిగూడకు సంబంధించిన కేసులో కూడా పురోగతి ఉందని.. త్వరలో సొత్తు రికవరీ తర్వాత నిం దితుల వివరాలను వెల్లడిస్తామని ఆయన చెప్పారు.  ఇప్పటికైనా ఇంటి యజమానులు జాగ్రత్తగా ఉండాలని  సీపీ సూచించారు.