శనివారం 23 జనవరి 2021
Hyderabad - Nov 25, 2020 , 09:02:17

‘మత్తు’ దందాపై ఉక్కుపాదం

‘మత్తు’ దందాపై ఉక్కుపాదం

హైదరాబాద్‌  : మత్తు పదార్థాల విక్రయాలపై నగర పోలీసులు ఉక్కుపాదం మోపారు.  ఒక్కరోజే వేర్వేరు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. అక్రమంగా ఆల్ఫ్రాజోలం తయారుచేసి, విక్రయిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు సోమవారం అర్ధరాత్రి మల్కాజిగిరి టాస్క్‌ఫోర్స్‌, ఉప్పల్‌ ఎక్సైజ్‌ అధికారులు..  ఉప్పల్‌, నాచారం బస్టాప్‌ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు. అదే సమయంలో అటుగా బైక్‌పై వెళ్తున్న ఏపీలోని కృష్ణా జిల్లా కంచికచర్లకు చెందిన పసుపులేటి మాణిక్యాలరావు, మేడ్చల్‌ జిల్లా షాపూర్‌నగర్‌కు చెందిన ఏ కోటిరెడ్డి పారిపోయేందుకు యత్నించగా అధికారులు వెంబడించి పట్టుకున్నారు. తనిఖీల్లో వారి వద్ద కిలో ఆల్ఫ్రాజోలం లభించింది. విచారణలో బాలానగర్‌లో ఆల్ఫ్రాజోలం తయారుచేసే కంపెనీని నిర్వహిస్తున్నట్టు తెలిసింది. నిందితుల సమాచారంతో ఆబ్కారీ అధికారులు బాలానగర్‌ ఫేస్‌-2 ప్రాంతంలో అక్రమంగా నిర్వహిస్తున్న లాబొరేటరీపై దాడులు జరిపి 4 కిలోల ఆల్ఫ్రాజోలం, తయారుచేసే సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.  

డ్రగ్స్‌ విక్రయిస్తున్న ఆఫ్రికన్‌ అరెస్టు 

ముంబాయి కేంద్రంగా బంజారాహిల్స్‌ రోడ్‌నం.1లో డ్రగ్స్‌ విక్రయిస్తున్న ఆఫ్రికా దేశస్థుడిని  అరెస్టు చేసినట్టు ఆబ్కారీ జాయింట్‌ కమిషనర్‌, హైదరాబాద్‌ జిల్లా ఇన్‌చార్జ్‌ డిప్యూటి కమిషనర్‌ ఎన్‌ఏ అజయ్‌రావు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏఈఎస్‌ నంద్యాల అంజిరెడ్డి తెలిపారు. ఆఫ్రికా దేశానికి చెందిన సామెల్‌ స్మిత్‌ నెల్సన్‌ ముంబాయి నుంచి కొకైన్‌ను కొనుగోలు చేసి,  నగరంలోని ఓ వ్యక్తికి విక్రయిస్తుండగా ఆబ్కారీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడి వద్ద 61 గ్రాముల కొకైన్‌ లభించినట్టు అధికారులు వెల్లడించారు.  

ఉప్పల్‌లో ముంబై యువతి.. 

వైజాగ్‌ నుంచి ముంబైకి గంజాయి సరఫరా చేస్తున్న యువతిని రాచకొండ ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబైకి చెందిన ప్రమీల గంజాయి విక్రేతలతో చేతులు కలిపి సరఫరాకు సిద్ధమయ్యింది. ఈ క్రమంలో గంజాయి కొనుగోలు కోసం ముంబై నుంచి వైజాగ్‌కు విమానంలో వచ్చింది. ఏజెంట్ల సహాయంతో గంజాయిని సేకరించింది. వాసన రాకుండా ప్యాకెట్లపై టాల్కమ్‌ పౌడర్‌ చల్లి వైజాగ్‌ నుంచి హైదరాబాద్‌కు బస్సులో వచ్చింది. ఉప్పల్‌ ప్రాంతంలో ముంబై వెళ్లడానికి బస్సు కోసం ఆరా తీస్తుండగా రాచకొండ మల్కాజిగిరి ఎస్వోటీ బృందం అదుపులోకి తీసుకున్నది. ఆమె వద్ద 20 కేజీల గంజాయి బయటపడింది.  పోలీసులకు అనుమానం రాకుండా టిప్‌టాప్‌ డ్రెస్సుల్లో తిరుగుతున్నట్లు తెలిసింది. ముంబై డ్రగ్స్‌ ముఠాలు కొత్తగా యువతులను దందాలోకి దింపి రవాణా చేయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.  


logo