సోమవారం 01 జూన్ 2020
Hyderabad - Apr 04, 2020 , 22:53:18

గర్భవతిని దవాఖానకు తరలించిన పెట్రోలింగ్‌ సిబ్బంది

గర్భవతిని దవాఖానకు తరలించిన పెట్రోలింగ్‌ సిబ్బంది

  • కానిస్టేబుల్‌ను అభినందిస్తూ రూ. 5 వేల రివార్డు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : అత్యవసర పరిస్థితులలో డయల్‌ 100కు ఫోన్‌ చేసిన ఓ మహిళకు.. వెస్ట్‌మారేడ్‌పల్లి పోలీస్‌ పెట్రోలింగ్‌ సిబ్బంది తక్షణమే స్పందించి ఆమెను దవాఖానకు తరలించడంపై హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ అభినందనలు తెలిపారు. ఈ మేరకు శనివారం పెట్రోలింగ్‌ విధులు నిర్వహించిన కానిస్టేబుల్‌ మోహన్‌రావుకు రూ. 5 వేల రివార్డును అందించారు. 3వ తేదీన వెస్ట్‌మారేడ్‌పల్లి స్ట్రీట్‌ నెం. 5కి చెందిన రేఖ అనే మహిళ డయల్‌ 100కు ఫోన్‌ చేసి  పురిటి నొప్పులు వస్తున్నాయంటూ తన బాధను చెప్పుకుంది. డయల్‌ 100 నుంచి మారేడ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు ఆ కాల్‌ బదిలీ అయ్యి  వెంటనే పెట్రోలింగ్‌ కార్‌-1కు ఈ సమాచారం అందడంతో అక్కడకు బయలుదేరి, 108కు సమాచారం అందించారు. అంబులెన్స్‌ రావడం ఆలస్యమవుతుందని గుర్తించిన పెట్రోలింగ్‌ కానిస్టేబుల్‌ పి.మోహన్‌రావు, రేఖను పెట్రోలింగ్‌ కారులోనే ఆపోలో దవాఖానకు తరలించారు. దవాఖానలో ఆమె మగ శిశువుకు జన్మనిచ్చింది, తల్లిబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. 

కూతురు పుట్టినా విధుల్లోనే.. 

కూతురి పుట్టిన సంతోషాన్ని ఇతరులతో పంచుకోలేని పరిస్థితి...భార్యను దగ్గర ఉండి దవాఖానలో చేర్పించలేని సమయం వాటన్నింటిని అధిగమించి డ్యూటీయే ప్రథమ లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్న నారాయణ గూడ పీఎస్‌ కానిస్టెబుల్‌ సాయికృష్ణకు సెల్యూట్‌ సీపీ అంజినీకుమార్‌ సెల్యూట్‌ చేశారు. 


logo