మంగళవారం 01 డిసెంబర్ 2020
Hyderabad - Oct 27, 2020 , 09:37:31

పాతబస్తీలో మెరుగుపడుతున్న పరిస్థితులు

 పాతబస్తీలో మెరుగుపడుతున్న పరిస్థితులు

చాంద్రాయణగుట్ట  :   పల్లె చెరువు, గుర్రం చెరువుల ప్రవాహంలో  ప్రజల జీవన విధానం అతలాకుతలమైంది.   ఐదు వేల మంది బాధితులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.  మూగజీవాలు వరదనీరులో కొట్టుపోయి ప్రాణాలు విడిచాయి.    తెలంగాణ సర్కార్‌ తక్షణమే స్పందించింది. వరద తాకిడికి అల్లాడిపోయిన వారి వివరాలను సేకరించి వెంటనే సహాయం అందజేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో బాధితులను అన్ని రకాలుగా ఆదుకోవడానికి విశ్వ ప్రయత్నం చేశారు.  అర్హత కలిగిన ప్రతి బాధితుడి వద్దకు వెళ్లి ఆపన్న హస్తం అందించారు. ప్రభుత్వ శాఖల అధికారులతో పాటు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి బాధితులకు అండగా నిలుస్తున్నారు. బస్తీలలో క్యాంపులు వేసి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.

 కోలుకుంటున్న పాతనగరం.. 

 గౌస్‌నగర్‌లో కొండరాళ్లు రెక్కుల ఇండ్లపై పడి 9 మంది నిద్రలోనే మరణించారు.పల్లె చెరువు వరద ఉగ్రరూపానికి మరో వ్యక్తి బలైయ్యారు.  గుర్రం చెరువు కట్ట తెగి ఇండ్లలోకి వరదనీరు  చేరుకుంటున్న సమయంలో ఓ ప్రార్థన మందిరంలో వస్తువులను బయటకు తీసుకెళ్తూ మరో యువకుడు విద్యుదాఘాతానికి గురయ్యాడు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ చేతుల మీదుగా బండ్లగూడ మండల ఆవరణలో ఒక్కో బాధితుడికి 5లక్షల రూపాయాల ఆర్థిక సహాయం అందజేశారు. పల్లె చెరువు తెగిన ఘటనలోనే 6500 మంది బాధితులను గుర్తించి  తహసీల్దార్‌ షేక్‌ ఫర్హీన్‌ సర్కార్‌కు జాబితాను అందజేశారు.  గుర్రం చెరువు తెగిన ఘటనలో మరో ఐదు వేల మంది వరకు బాధితులు ఉండే అవకాశాలు ఉన్నాయి. వీరి జాబితాను పూర్తి స్థాయిలో తయారు చేసే పనిలో అధికారులు నిమగ్నమైయ్యారు.  జీహెచ్‌ఎంసీ అధికారులు, డివిజన్ల కార్పొరేటర్లు అర్హులైన జాబితాను సిద్ధం చేసి ఇంటింటికి వెళ్లి   పదివేల రూపాయలను బాధితులకు అందజేస్తున్నారు.

బస్తీల్లో మొదలైన  పనులు ..

  తడిసిపోయిన వస్తువులను లారీలో చెత్త డంపింగ్‌ యార్డులకు తరలిస్తున్నారు.    కబ్జాకు గురైన వాటిని గుర్తించి ఆల్‌జుబేర్‌ కాలనీలో కూల్చివేతలు మొదలుపెట్టారు. కూలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లు,  స్తంభాల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేస్తున్నారు.   లోతట్టు ప్రాంతాల్లో ఇప్పటికి వరదనీరు అలాగే ఉండిపోవడంతో నీటిని తొలగించే పనిలో అధికారులు ఉన్నారు.