శనివారం 06 జూన్ 2020
Hyderabad - May 24, 2020 , 01:32:50

కొత్త కరోనా లోకం!

కొత్త కరోనా లోకం!

హైదరాబాద్ : విందులు, వినోదాలు, సరదాలు, కాలక్షేపాలు, ఫంక్షన్లు, పర్యాటక ప్రాంతాలకు కొదువ లేని నగరం భాగ్యనగరం. చిన్న సంతోషమైనా.. ఒకరికొకరూ పంచుకుంటూ ఆప్యాయతను ప్రదర్శించే వైభవం.. అలాయ్‌ బలాయ్‌తో అభిమానాన్ని చాటుకున్న సంస్కృతి. మొత్తంగా అదొక కొత్త బంగారు లోకం.. అందులో మనకు నచ్చినట్టుగా ఉండేవాళ్లం. కానీ కరోనా రాకతో ఆ లోకం దూరమైంది. కొంచెం ఇష్టం.. ఇంకొంచెం కష్టంగా అనిపించేలా మార్పులు వచ్చాయి. ఆ మహమ్మారి తాకిడికి మనుషుల జీవన చిత్రం పూర్తిగా మారిపోతున్నది. ఇప్పటి వరకు  ఒక రకమైన జీవనశైలికి అలవాటు పడ్డ ప్రజలకు అందుకు భిన్నమైన పరిస్థితులు ఎదురయ్యాయి. తెల్లారి లేచింది మొదలు నిద్రించే వరకు కరోనా దరి చేరకుండా జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సిన పరిస్థితి నెలకొంది.

ఆరోగ్యం కోసం పాటించాల్సిందే..!

కరోనా మహమ్మారి నగరవాసులకు కొంత చేదు అనుభవాలను మిగుల్చుతున్నది. సెలవొస్తే చాలు.. కుటుంబ సమేతంగా బయటకు వచ్చి పర్యాటక ప్రాంతాల్లో సేద తీరి.. రెస్టారెంట్‌లో భోజనం చేయడం ఇక్కడి వారికి అలవాటు. కానీ కరోనా నగరవాసుల రుచులు, అలవాట్లను పూర్తిగా కమ్మేసింది. లాక్‌డౌన్‌ సడలింపులతో కొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే నిత్యావసర సరుకులు విక్రయించే మాల్స్‌, దుకాణాల్లోకి మాస్కు లేనిదే అనుమతించడం లేదు. చేతులు తప్పనిసరిగా శానిటైజ్‌ చేసుకోవాలి.  వివిధ సంస్థల కార్యాలయాలు థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహిస్తున్నాయి. మద్యం దుకాణాల వద్ద మాస్కులు ధరించడం తప్పనిసరి అయింది. ప్రజా రవాణా, షాపింగ్‌ మాల్స్‌, వైద్యశాలలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, కార్యాలయాలు ఇలా ప్రతిచోట కొత్త మార్గదర్శకాల ప్రకారం నగరవాసులు నడుచుకుంటున్నారు. త్వరలో తెరుచుకునే సినిమా థియేటర్లు, బడా షాపింగ్‌ మాల్స్‌, పర్యాటక ప్రాంతాల్లో కూడా కొత్త రకమైన మార్పులు రానున్నాయి. ఇప్పటికే యాజమాన్యాలు సంబంధిత అధికారులతో చర్చించి మార్గదర్శకాలు రూపొందిస్తున్నాయి. 

షాపింగ్‌ ైస్టెల్‌ మారింది గురూ..!

గోల్కొండ, చార్మినార్‌, అమీర్‌పేట, కోఠి తదితర ప్రాంతాల్లో ఒకప్పటిలా షాపింగ్‌ విధానం లేదు.  నిదానంగా షాపింగ్‌ చేయడం.. గుంపులుగా ఉండటం.. అక్కడ కనిపించడం లేదు. చకచకా షాపింగ్‌ ముగించేస్తున్నారు. వస్త్ర, జ్యువెల్లరీ తదితర షాపులను నిబంధనలకనుగుణంగా తెరుస్తున్నారు. రంజాన్‌ నేపథ్యంలో చార్మినార్‌ జనంతో కిక్కిరిసేది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. కరోనాకు ముందు అవసరమున్నా లేకున్నా బయటకు వచ్చి షాపింగ్‌ చేసేవాళ్లు. కానీ ఇప్పుడు అవసరమైతే తప్పా బయటకు రావడం లేదు. ఇలాంటి పరిస్థితులే ఇకముందు కొనసాగుతాయని వ్యాపారులు చెబుతున్నారు.  

ప్రయాణంలో కూడా...!బిజీబిజీగా గడిపే ధోరణి నగరవాసిది. 

ఒకప్పుడు బస్సులు, ఆటోలు, ఇతర ప్రైవేట్‌ వాహనాల్లో వేలాడుతూ ప్రయాణించే దృశ్యాలు కనిపించేవి. నిమిషం ఆగితే ఇంకో బస్సు వచ్చే అవకాశం ఉన్నా.. ఓపిక లేకుండా కిక్కిరిసిన బస్సుల్లోనే ప్రయాణించేవాళ్లు.  కానీ నేడు వేగంతో పాటు నిదానం కూడా అలవాటు చేసుకోవాల్సిన పరిస్థితి అందరిది. భౌతిక దూరమేతే ఇక తప్పక పాటించాల్సిందే. ఆటోలో ఇద్దరూ..క్యాబ్‌లో ముగ్గురు ప్రయాణించేలా నిబంధనలు వచ్చాయి. బస్సులు ప్రారంభమయ్యాక వేలాడుతూ ప్రయాణించే పరిస్థితులు ఉండవు. వైద్యశాలల్లో కూడా క్యూ పాటిస్తూ.. శానిటైజర్‌తో చేతులు పరిశుభ్రం చేసుకున్నాకే అనుమతిస్తున్నారు. ఈ ప్రక్రియలన్నీ ముగిస్తేగానీ వైద్యుడిని కలిసే వెసులుబాటు లేదు. మొత్తంగా నగరవాసి విభిన్న పరిస్థితులను ఎదుర్కోబోతున్నాడు. 

ఇలాంటి పరిస్థితి వస్తదనుకోలేదు

కరోనాతో నగర కల్చర్‌ మొత్తం మారిపోయింది. ఏ పండుగొచ్చినా గుంపులు గుంపులుగా వచ్చి సంతోషంగా జరుపుకోవడం ఆనవాయితీ. కానీ ఇకముందు ఆ పరిస్థితులు ఉండవు. షాపింగ్‌ చేయాలన్నా.. నలుగురి స్నేహితులతో వెళ్లేవాళ్లం. ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరిని లోపలికి అనుమతిస్తున్నారు. షాపింగ్‌ కిక్కు రావడం లేదు. ఇలాంటి పరిస్థితి వస్తదనుకోలేదు.

- మధు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌

చిన్న చిన్న సంతోషాలు దూరమయ్యాయి

స్నేహితులతో కలిసి షాపింగ్‌ చేయడం ఓ అనుభూతి. కానీ ఆటోలో షాపింగ్‌కు వెళ్లడం కష్టంగా ఉంది. ఇద్దరిని మాత్రమే అనుమతిస్తున్నారు. ధరలు కూడా గతంలో కంటే రెట్టింపు చెబుతున్నారు. షాపింగ్‌ చేయడం వాయిదా వేసుకున్నాం. చిన్న చిన్న సంతోషాలు కరోనాతో దూరమయ్యాయి. స్నేహితుల ఇంటికి వెళ్లాలన్నా ఆలోచించాల్సి వస్తుంది. ఆదివారం వస్తే ఏదో ఒక ప్రోగ్రాం పెట్టుకుని సందడిగా గడిపేవారం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఏది ఏమైనా కరోనా తగ్గుముఖం పట్టేవరకు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. 

-నీలిమ, ఉద్యోగిని


logo