గురువారం 03 డిసెంబర్ 2020
Hyderabad - Oct 22, 2020 , 06:07:03

శాంతించు మూసీ.. మా గోస చూసి..

శాంతించు మూసీ.. మా గోస చూసి..

  • ముచికుందా నదికి సంప్రదాయబద్ధంగా సర్కారు పూజలు
  • పసుపు, కుంకుమ సమర్పించిన మంత్రులు, మేయర్‌
  • సహాయక చర్యలు చేపడుతూనే విశ్వాసాలకు ప్రాధాన్యం
  • వరద గండం గట్టెక్కించాలని వేడుకోలు
  • పురానాపూల్‌ దర్గాలో చాదర్‌ సమర్పణ

భారీ వర్షాలకు ఉగ్రరూపం దాల్చి, నగరంపై జల ఖడ్గం దూసిన మూసీకి రాష్ట్ర ప్రభుత్వం బుధవారం శాంతి పూజలు చేసింది. ఓ వైపు ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతూనే.. మరోవైపు విశ్వాసాలకు ప్రాధాన్యమిస్తూ ముచికుందా నదికి సంప్రదాయబద్ధంగా పసుపు, కుంకుమ, పట్టువస్ర్తాలు, గాజులు, ముక్కుపుడక సమర్పించింది. వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మహమూద్‌ అలీ, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌ పురానాపూల్‌ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. శాంతించి, వరదల నుంచి నగర ప్రజలను గట్టెక్కించాలని వేడుకున్నారు. అనంతరం దర్గా హజరత్‌ మూసా ఖాద్రీలో చాదర్‌ సమర్పించారు.

112 ఏండ్లకు.. మళ్లీ

1908 సెప్టెంబర్‌లోనూ భాగ్యనగరం ఇలాంటి విపత్తునే ఎదుర్కొన్నది. మూసీ వరదలకు నాడు వేలమంది ప్రాణాలు కోల్పోయారు. అంతకు మూడింతల మంది నిరాశ్రయులయ్యారు. ఆ విధ్వంసాన్ని చూసి కలత చెందిన నాటి నిజాం మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ పండితుల సూచన మేరకు ముచికుందా నదికి పట్టువస్ర్తాలు, పసుపు, కుంకుమ సమర్పించి శాంతించాలని ప్రార్థించినట్లు పెద్దలు చెప్తుంటారు. సరిగ్గా 112 ఏండ్లకు.. మళ్లీ అంతటి జలప్రళయం ఏర్పడినది. ఆ సెంటిమెంట్‌ను గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వమూ పూజలు చేసింది.

చార్మినార్‌: పది రోజులుగా నగరంపై తన ప్రతాపం చూపుతూ పలు ప్రాంతాలను ముంచెత్తుతున్న గంగమ్మ శాంతించాలని కోరుతూ మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియొద్దీన్‌లు పురానాపూల్‌ వద్ద బుధవారం మూసీ నదికి పూజలు చేశారు. సంప్రదాయబద్ధంగా బొట్టు, గాజులు, బోనం సమర్పించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేలా చూడాలని కోరుతూ పురానాపూల్‌ దర్గాకు చాదర్‌ సమర్పించామన్నారు. అనంతరం సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ నగరంపై వరద ప్రభావం తీవ్రంగా ఉందన్నారు. 112 సంవత్సరాల క్రితం కురిసిన భారీ వర్షాలకు నాడు ఎంతో మంది నిరాశ్రయిలయ్యారన్నారు. ప్రస్తుతం పది రోజులుగా కురుస్తున్న వర్షాలతో నగరంలోని పలు చోట్ల ఉన్న చెరువులు ఒక్కొక్కటిగా తెగిపోతున్నాయన్నారు. 

ఆ నీరంతా జనావాసాల మధ్యకు రావడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. జడివానలతో వేల కోట్ల నష్టం జరిగిందన్నారు. వరదల ముంపు తొలిగి.. ప్రజలు క్షేమంగా ఉండాలని కోరుతూ గంగమ్మ తల్లికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. నిజాం హయాంలో మూసీ పొంగినప్పుడు గంగమ్మ తల్లికి పూజలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రతిఒక్క నగర వాసి చల్లంగా ఉండాలని కోరుతూ మూసీ నదికి పసుపు, కుంకుమ, గాజులు, ముక్కుపుడుక సమర్పించి వేద పండితుల సమక్షంలో పూజలు చేశామన్నారు. మేయర్‌ బొంతు రామ్మోహన్‌ మాట్లాడుతూ ప్రజా జీవనానికి ఎలాంటి ముప్పు వాటిల్లవద్దని కోరుకుంటూ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు. నగరంలో కురుస్తున్న వర్షాలతో ప్రతిఒక్కరూ ఇబ్బందులు పడుతున్నారన్నారు. వర్షాలు తగ్గిన వెంటనే దెబ్బతిన్న రోడ్లు పునరుద్ధరిస్తామన్నారు. 

అభివృద్ధి పనులనూ వేగవంతం చేస్తామన్నారు.  అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ పురానాపూల్‌లోని దర్గా హజరత్‌ ముసా ఖాద్రీలోనూ చాదర్‌ సమర్పించి సర్వమత ప్రార్థనలు నిర్వహించామని డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌ అన్నారు. మరోవైపు పురానాపూల్‌ వద్ద హైదరాబాద్‌ పార్లమెంట్‌ టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి పుస్తె శ్రీకాంత్‌ బోనాలు సమర్పించారు. కార్యక్రమంలో బహదూర్‌పుర, చార్మినార్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జ్‌లు మీర్‌ ఇనాయత్‌అలీ భాఖ్రీ, మహ్మద్‌ సలావుద్దీన్‌తో పాటు టీఆర్‌ఎస్‌ డివిజన్‌ అధ్యక్షులు పాల్గొన్నారు.