గురువారం 22 అక్టోబర్ 2020
Hyderabad - Oct 17, 2020 , 09:22:58

వైభవంగా జేఎన్‌టీయూహెచ్‌ స్నాతకోత్సవం

వైభవంగా జేఎన్‌టీయూహెచ్‌ స్నాతకోత్సవం

సవాళ్లను ఎదుర్కోవాలి

రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌

కేపీహెచ్‌బీ : సమాజంలో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు విద్యార్థులు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర గవర్నర్‌, జేఎన్‌టీయూహెచ్‌ వర్సిటీ ఛాన్స్‌లర్‌ తమిళిసై సౌందర రాజన్‌ అన్నారు. జేఎన్‌టీయూహెచ్‌ వర్సి టీ జేఎన్‌ఎన్‌ ఆడిటోరియంలో శుక్రవారం 9వ స్నాతకోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి వైస్‌ ఛాన్స్‌లర్‌ జయేశ్‌రంజన్‌, రెక్టార్‌ ఎ.గోవర్ధన్‌, రిజిస్ట్రార్‌ మంజూరు హుస్సేన్‌, ముఖ్యఅతిథి డీఆర్డీవో చైర్మన్‌ జి.సతీశ్‌రెడ్డి, వర్సిటీ వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. సమాజంలో వస్తున్న మార్పులకనుగుణంగా జీవితాలను మలుచుకోవాలని విద్యార్థులకు సూచించారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ దేశం గర్వించదగ్గ పౌరులుగా ఎదగాలన్నారు. డీఆర్డీవో చైర్మన్‌ సతీశ్‌రెడ్డి మాట్లాడుతూ ఏ దేశంపై ఆధారపడకుండా స్వశక్తితో భారతదేశం అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తుందని తెలిపారు. శాస్త్రసాంకేతిక రంగంలో ప్రపంచంలోనే నాల్గవ స్థానంలో నిలవడం గర్వకారణమన్నా రు. వర్సిటీలోనే చదువులన్నింటినీ పూర్తిచేసి వర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను పొంద డం సంతోషంగా ఉందని తెలిపారు. 

78,395 మంది విద్యార్థులకు కన్వకేషన్‌ పట్టాలు...

జేఎన్‌టీయూహెచ్‌ వర్సిటీ కళాశాలల్లో చదివిన 78,395 మంది విద్యార్థులకు కన్వకేషన్‌ పట్టాలను అందించినట్లు ఇన్‌చార్జి వైస్‌ఛాన్స్‌లర్‌ జయేశ్‌రంజన్‌ తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన 53 మందిని గోల్డ్‌మెడల్స్‌తో సత్కరించామన్నారు. న్యాక్‌ (ఎన్‌ఏఏసీ) ఏ గ్రేడ్‌ గుర్తింపుతోపాటు ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ 2020 ర్యాంకింగ్‌లో 57వ స్థానంలో నిలిచి ఎన్‌బీఏ గుర్తింపు పొందిందన్నారు.ఈ ఏడాది 478 మంది విద్యార్థులు క్యాంప స్‌ ప్లేస్‌మెంట్‌లో ఉద్యోగాలు సాధించడం గొప్ప విషయమని అన్నారు.

గోల్డ్‌మెడల్స్‌ సాధించిన విద్యార్థులు..

ఎర్రగుంటల దివ్యమానస (4 మెడల్స్‌), జూగూరు కావ్యశ్రీ (3 మెడల్స్‌), ఇ. అమూల్య (3 మెడల్స్‌), మూల నిత్య (3 మెడల్స్‌), గురుజాల అనూష (3 మెడల్స్‌), నిగర్‌ ఫాతిమా (3 మెడల్స్‌), తాల్లూరి మణిచందన (2 మెడల్స్‌), బొల్లబత్తుల సమత (2మెడల్స్‌) అందుకున్నారు. 

కొత్త విషయాలు నేర్చుకోవడం ఇష్టం.. 


కొత్త విషయాలు నేర్చుకోవడం ఇష్టం. అందువల్లే పోలీస్‌ శాఖకు ఉపయోగపడే సాంకేతిక అంశాలపై పరిశోధనలు చేశాను. వర్సిటీలో ‘ఏ స్టడీ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) ఇంటర్వేషన్‌ ఫర్‌ ఎన్‌హ్యావింగ్‌ ది ఎఫెక్టివ్‌నెస్‌ ఆఫ్‌ టీఎస్‌ పోలీస్‌ అడ్మినిస్ట్రేషన్‌' అనే అంశంపై చేసిన పరిశోధనకు పీహెచ్‌డీ పట్టా పొందడం సంతోషంగా ఉంది. - డీజీపీ మహేందర్‌రెడ్డి

గోల్డ్‌మెడల్స్‌ సాధించడం సంతోషంగా ఉంది..  

కష్టపడి చదివినందుకు ప్రతిఫలంగా 3 గోల్డ్‌మెడల్స్‌ రావడం సంతోషంగా ఉంది. మా నాన్న సివిల్‌ ఇంజినీర్‌, అమ్మ జేఎన్‌టీయూహెచ్‌లో ఉద్యోగి. ఇద్దరి మార్గదర్శకంలో చదివి గోల్డ్‌ మెడల్స్‌ సాధించాను. ప్రస్తుతం సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తున్నాను. -దివ్యమానసlogo