ఆదివారం 24 జనవరి 2021
Hyderabad - Nov 26, 2020 , 08:06:05

ప్రజల సహకారంతో నేరరహిత నగరం

ప్రజల సహకారంతో నేరరహిత నగరం

హైదరాబాద్‌ : ప్రజల సహకారంతోనే నేరరహిత హైదరాబాద్‌ సాధ్యమవుతందని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ స్పష్టం చేశారు. పోలీసులు ప్రజల ఆస్తులను కాపాడేందుకు  నిరంతరం కృషి చేస్తున్నారని సీపీ తెలిపారు. ప్రజల జోలికి వచ్చే ఏ ఒక్క నేరస్థుడిని వదిలిపెట్టమని హెచ్చరించారు. ఈ ఏడాది మొత్తం 11 ముఠాలను పట్టుకుని దాదాపు 106 కేసుల మిస్టరీ చేధించామని తెలిపారు. ఇందులో 35 మంది కరుడుగట్టిన దొంగలు, క్రిమినల్స్‌ను అరెస్టు చేసి, 5 తుపాకులను స్వాధీనం చేసుకున్నట్టు సీపీ వెల్లడించారు. 2019లో 5 గ్యాంగ్‌స్టర్లను అరెస్టు చేసి 5 తుపాకులను స్వాధీనం చేసుకున్నామని సీపీ సజ్జనార్‌ వివరించారు. ప్రజలు ఏలాంటి భయాందోళనకు  గురికావద్దని ఆయన సూచించారు. నగరంలోని మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో దాదాపు 5 లక్షలకు పైగా సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా ఉన్నదని సీపీ స్పష్టం చేశారు.  

నిర్భయంగా ఓటేయండి 

జీడిమెట్ల: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా ఓటు వేయాలని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ పిలుపునిచ్చారు. బుధవారం జీడిమెట్ల పీఎస్‌ పరిధిలోని గాంధీనగర్‌ ఉన్నత పాఠశాల పోలింగ్‌ కేంద్రాన్ని బాలానగర్‌ జోన్‌ డీసీపీ పీ పద్మజారెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా సీపీ  మాట్లాడుతూ.. ఓటర్లకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా రక్షణ చర్యలు తీసుకొని, ఓటు వేసేలా పోలీసులు పని చేయాలని సూచించారు. అనంతరం జీడిమెట్ల సీఐ బాలరాజు ఆధ్వర్యంలో ఓటు హక్కుపై చైతన్యం కల్పిస్తూ ఫ్లాగ్‌మార్చ్‌ని నిర్వహించారు. 

పోలింగ్‌ కేంద్రాలు పరిశీలించిన సీపీ..

బండ్లగూడ: సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో గ్రేటర్‌ ఎన్నికలకు బందోబస్తు ఏర్పాట్లను పూర్తిచేసినట్టు సీపీ సజ్జనార్‌ వెల్లడించారు. రాజేంద్రనగర్‌ ఏసీపీ పరిధిలోని అత్తాపూర్‌, రాంబాగ్‌, సులేమాన్‌నగర్‌, మైలార్‌దేవ్‌పల్లి, శాస్త్రిపురం, గగన్‌పహాడ్‌ ప్రాంతాల్లో బుధవారం సీపీ పర్యటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ నిర్భయంగా  ఓటేయాలని కోరారు. రాజేంద్రనగర్‌ పరిధిలో సుమారు వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆయన వెంట డీసీపీ ప్రకాశ్‌రెడ్డి, ట్రాఫిక్‌ డీసీపీ ఎన్‌ఎం విజయ్‌కుమార్‌, ఏడీసీపీ మాణిక్‌రాజ్‌, రాజేంద్రనగర్‌ ఏసీపీ అశోక్‌కుమార్‌, ట్రాఫిక్‌ ఏసీపీ విశ్వప్రసాద్‌,  ఇన్‌స్పెక్టర్‌ సురేష్‌, నర్సింహా తదితరులు ఉన్నారు.


logo