e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, August 6, 2021
Home హైదరాబాద్‌ జలదిగ్బంధం.. కొండంత అభయం

జలదిగ్బంధం.. కొండంత అభయం

జలదిగ్బంధం.. కొండంత అభయం
  • ఏకధాటి వాన.. నీట మునిగిన శివారు
  • సకాలంలో స్పందించి..సమస్యలకు పరిష్కారం
  • పొంగిపొర్లిన చెరువులు, నాలాలు
  • ఇండ్లను ముంచెత్తిన వరద నీరు రంగంలోకి ‘బల్దియా’ బృందం
  • సహాయక చర్యలు ముమ్మరం వరద ప్రాంతాల్లో పర్యటించిన ప్రజాప్రతినిధులు
  • సురక్షిత ప్రాంతాలకు ప్రజల తరలింపు

నగరంపై వరుణుడు విరుచుకపడ్డాడు.. నాలుగైదు రోజులుగా మోస్తరుతో ప్రారంభమైన వర్షం..బుధవారం రాత్రి వరకు దంచికొట్టింది. ఏకధాటిగా కురిసిన వానతో ప్రధానంగా శివారు ప్రాంతాలు వణికిపోయాయి. లోతట్టు ప్రాంతాలు, కాలనీలు జలమయమయ్యాయి. చెరువులు, కుంటలు, నాలాలు ఉప్పొంగడంతో రహదారులు, ఇండ్లల్లోకి నీరు చేరింది. అత్యధికంగా నాగోలు బండ్లగూడలో 21.2 సెం.మీ వర్షపాతం నమోదుకాగా, వరద ధాటికి నాగోలు చెరువు కట్ట తెగి చుట్టుపక్కల కాలనీలు నీటిలో చిక్కుకున్నాయి. వరద సాఫీగా వెళ్లేందుకు వెంటనే బల్దియా సహాయక బృందా లు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కబెడుతున్నాయి. డీఆర్‌ఎఫ్‌తోపాటు నీటి తొలగింపునకు ప్రత్యేకంగా 128 స్టాటిక్‌ బృందాలు రంగంలోకి దిగి వరదకు అడ్డుగా ఉన్న వ్యర్థాలను తొలగించాయి. మంత్రి సబితారెడ్డి, బల్దియా మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ముంపు ప్రాంతాల్లో పర్యటించి సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపారు. బాధితులను తాత్కాలిక శిబిరాలకు తరలించి వసతి కల్పిం చారు. కాగా ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాగల రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

జంట జలాశయాలకు జలకళ

తాగునీటి వరప్రదాయనిగా భాసిల్లుతున్న హిమాయత్‌సాగర్‌, గండిపేట(ఉస్మాన్‌సాగర్‌) జలాశయాలు కొత్త నీటితో కళకళలాడుతున్నాయి. నాలుగైదు రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాలతో జలాశయాల్లోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. గండిపేట పూర్తి నీటి సామర్థ్యం 1790 అడుగులు (3.90 టీఎంసీ)లు కాగా, ప్రస్తుతం 1784.22 అడుగులు ఉంది. హిమాయత్‌సాగర్‌ పూర్తి నీటి సామర్థ్యం 1763.50 (2.97 టీఎంసీ) అడుగులు కాగా, ప్రస్తుతం 1761 అడుగులకు చేరింది.
నగరంలో ఏకధాటిగా కురిసిన వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. బుధవారం రాత్రి 7.30గంటలకు నెమ్మదిగా చిరుజల్లులతో మొదలైన వాన.. కుండపోతగా పడింది. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఎడతెరిపి లేకుండా దంచికొట్టింది. బండ్లగూడలో అత్యధికంగా 21.2 సెం.మీలు, వనస్థలిపురం, హస్తినాపురంలో 19.0 సెం.మీల వర్షపాతం నమోదైంది. గతేడాది కూడా ఈ ప్రాంతాల్లోనే అత్యధికంగా 30.సెం.మీల వర్షపాతం నమోదైన విషయం తెలిసిందే. జోరు వానతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల నాలాలు, డ్రైనేజీలు పొంగిపొర్లాయి. ఇండ్లలోకి నీరు చేరాయి.

అలుగుపారిన చెరువులు..పొంగిన నాలాలు

- Advertisement -

ఉప్పల్‌ పరిధిలోని కావేరి నగర్‌, హబ్సిగూడ, రవీంద్రనగర్‌, నాచారం, ఇందిరానగర్‌, చిలుకనగర్‌లోని రాఘవేంద్రనగర్‌ కాలనీలో పెద్ద ఎత్తున వరదనీరు చేరడంతో ఇండ్లు జలమయమయ్యాయి. కావేరీనగర్‌ నాలా పొంగి పొర్లడంతో చిలుకానగర్‌-ఉప్పల్‌ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మీర్‌పేట పెద్ద చెరువు, మంత్రాల చెరువు, జిల్లెలగూడ సంద చెరువులు పూర్తిగా నిండి అలుగు పారడంతో లెనిన్‌నగర్‌, ప్రశాంత్‌నగర్‌, ఎంఎల్‌ఆర్‌ కాలనీ, మిథిలానగర్‌ తదితర ప్రాంతాల్లో ఇండ్లలోకి వరదనీరు చేరింది. రామిడి మల్లారెడ్డి కాలనీ, మధురాపురికాలనీ, శివనారాయణపురం, నవయువకాలనీ, సాయిబాలాజీ హోమ్స్‌ తదితర చోట్ల వరద ముంచెత్తింది. నాగోల్‌ చెరువు కట్ట తెగడంతో బండ్లగూడలోని అయ్యప్పకాలనీలు.. నీట మునిగాయి. సరూర్‌నగర్‌ చెరువు పొంగిపొర్లడంతో గడ్డిఅన్నారం డివిజన్‌ల్లోని పలు ఏరియాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంతాల వాసులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జీహెచ్‌ఎంసీ అధికారులు, ప్రజాప్రతినిధులు హుటాహుటినా చేరుకొని బాధితులకు అభయం ఇచ్చారు.

మేడ్చల్‌ జిల్లాలో కుండపోత..

మేడ్చల్‌, జూలై15(నమస్తే తెలంగాణ): మేడ్చల్‌ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు అత్యధిక వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. మేడ్చల్‌లో 45.8 దుండిగల్‌లో 48.9 బాచుపల్లిలో 50, కుత్బుల్లాపూర్‌లో 46.4, కూకట్‌పల్లిలో 49.3, బాలానగర్‌లో 54.4, అల్వాల్‌లో 55.9, మల్కాజిగిరిలో 71.2, ఉప్పల్‌లో 135.1, మేడిపల్లిలో 132.4, కాప్రాలో 72.1, శామీర్‌పేట్‌లో 49.9, కీసరలో 74.4, ఘట్‌కేసర్‌లో 106.7 , మూడుచింతలపల్లిలో 67.5 ఎంఎంల వర్షం కురిసిందని అధికారులు వెల్లడించారు.

669 ఫిర్యాదులు ..

లోతట్టు ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ప్రత్యేకంగా 128 స్టాటిక్‌ బృందాలు రంగంలోకి దిగి వరదకు అడ్డుగా ఉన్న వ్యర్థాలను తొలగించాయి. సమస్య పరిష్కారానికి ప్రత్యేకంగా 128 మినీ మొబైల్‌ బృందాలు పనిచేశాయి. మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. బాధితుల ఇబ్బందులు విని అక్కడికక్కడే పరిష్కారం చూపారు. మేయర్‌ సరూర్‌నగర్‌, తిరుమల నగర్‌ కాలనీ, గడ్డి అన్నారం డివిజన్‌లో పర్యటించారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం ద్వారా ఫిర్యాదులను స్వీకరించి ఎప్పటికప్పుడు ఎమర్జెన్సీ బృందాలను అప్రమత్తం చేసి సమస్యలను పరిష్కరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేశారు. సీజనల్‌ వ్యాధులు తలెత్తకుండా బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లారు. తాగునీటిని వేడి చేసుకుని తాగాలంటూ.. ప్రజలకు సూచించారు. అలాగే సమస్యాత్మక ప్రాంతాలు, హుస్సేన్‌సాగర్‌, గండిపడిన చెరువులపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజలెవ్వరూ ఆందోళన చెందవద్దని, పరిస్థితి అదుపులో ఉందని నగర ప్రజాప్రతినిధులు భరోసా ఇచ్చారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా జీహెచ్‌ఎంసీ కంట్రోల్‌ రూం నం. 21111111, 100, ట్రాఫిక్‌ సమస్యలపై పోలీసుల వాట్సాప్‌, హాక్‌ ఐలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాగా, వర్షానికి సంబంధించి..669 ఫిర్యాదులు రాగా, వెనువెంటనే సమస్యల పరిష్కారానికి చొరవ చూపారు.

ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

బడంగ్‌పేట, జూలై15: వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని మిథిలానగర్‌, కమలానగర్‌, ఎంఎల్‌ఆర్‌ కాలనీ, సత్యసాయి నగర్‌, శ్రీధర్‌ కాలనీ, వెంకటేశ్వర కాలనీల్లో పర్యటించారు.ప్రజలతో మాట్లాడి.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరద నీరు తొలగించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని కమిషనర్‌ సుమన్‌ రావును మంత్రి ఆదేశించారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్స్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. మంత్రి వెంట మేయర్‌ దుర్గా దీప్‌లాల్‌, డిప్యూటీ మేయర్‌ తీగల విక్రమ్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

అత్యవసరమైతే..

భారీ వర్షాలతో వరద పోటెత్తుతున్న నేపథ్యంలో ఎలాంటి అత్యవసర పరిస్థితి తలెత్తినా జీహెచ్‌ఎంసీ కంట్రోల్‌ రూం నంబర్‌ 21111111 లేదా 100ను సంప్రదించాలి. వెంటనే అధికారులు స్పందించి వరద ప్రాంతాల్లో సహాయక బృందాలను అప్రమత్తం చేస్తారు. గురువారం కంట్రోల్‌ రూంకు వచ్చిన ఫిర్యాదుల్లో అధికభాగం పరిష్కరించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
జలదిగ్బంధం.. కొండంత అభయం
జలదిగ్బంధం.. కొండంత అభయం
జలదిగ్బంధం.. కొండంత అభయం

ట్రెండింగ్‌

Advertisement