మంగళవారం 01 డిసెంబర్ 2020
Hyderabad - Oct 29, 2020 , 07:50:48

కారు స్టార్ట్‌ అయ్యుంటే.. డాక్టర్‌ ఆచూకీ ఇప్పటికీ దొరికేది కాదు

కారు స్టార్ట్‌ అయ్యుంటే.. డాక్టర్‌ ఆచూకీ ఇప్పటికీ దొరికేది కాదు

 • రెప్పవాల్చకుండా ఛేదించిన సైబరాబాద్‌ పోలీసులు
 • 12 బృందాలు ఏర్పాటు
 • ఏపీ, మహారాష్ట్ర, కర్నాటక సహకారంతో తనిఖీలు
 • అనంతపురంలో పట్టుబడిన బొలెరో వాహనం
 • డాక్టర్‌ సురక్షితం 
 • పోలీసుల అదుపులో ఆరుగురు కిడ్నాపర్స్‌
 • పరారీలో ప్రధాన సూత్రదారి
 • డాక్టర్‌ భార్య తరపు సమీప బంధువే నిందితుడు

డెంటల్‌ డాక్టర్‌ కిడ్నాప్‌.. ఛేజింగ్‌.. పోలీసు వర్గాల్లో ఆసక్తిని రేపింది. పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌, డీసీపీ ప్రకాశ్‌ రెడ్డి, అదనపు డీసీపీ సందీప్‌, ఏసీపీ అశోక్‌ చక్రవర్తి, శ్యాంబాబులతో పాటు 12 బృందాల అధికారులు, సిబ్బంది కంటి మీద కునుకు లేకుండా హై టెన్షన్‌ మధ్యలో ఛేజింగ్‌ను కొనసాగించారు. ఇటు ఏపీ, మహారాష్ట్ర పోలీసులు, అటు కర్నాటక పోలీసుల సహకారంతో వాహనాల తనిఖీలను నిర్వహించారు. అంతేకాకుండా నిందితులు, కుటుంబ సభ్యుల కదలికలపై నజర్‌ పెట్టడంతో గుట్టు మొత్తం వెలుగులోకి వచ్చింది. రహీం కారు స్టార్ట్‌ అయ్యి ఉంటే ఈ రోజుకి కూడా డాక్టర్‌ కిడ్నాప్‌ అంశం సస్పెన్స్‌గా ఉండేదని పోలీసులు తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా లభించిన క్లూ మొత్తం కిడ్నాప్‌ ముఠాను పట్టించింది. 

ఇలా సీసీ కెమెరాలు ద్వారా లభించిన మొదటి క్లూతో పోలీసులు ఛేజింగ్‌లో డెంటల్‌ డాక్టర్‌ బెహజాత్‌ హూస్సేన్‌ను క్షేమంగా ఇంటికి తీసుకువచ్చారు. ఈ కిడ్నాప్‌ ప్లాన్‌ వేసింది డాక్టర్‌ భార్య తరపున సమీప బంధువు ఆస్ట్రేలియా దేశం సిటిజన్‌లు ముస్తఫా, ముబాషీర్‌లు మరో 11మందితో కలిసి చేశారు. డాక్టర్‌ ఖాతాలోని రూ.10కోట్లు తీసుకుని వదిలేద్దామనుకున్నారు. దీని కోసం ఆన్‌లైన్‌ బిట్‌ కాయిన్‌ రూపంలో మళ్లించేందుకు కూడా ఓ సందర్భంగా పథకం రచించి పెట్టుకున్నారని విచారణలో తెలిసింది. అరస్టైన వారిలో సుమిత్‌ చంద్రకాంత్‌ భోస్లే, అక్షయ్‌ బాలు వైరీకర్‌, విక్కీ దత్త షిండే, మహ్మద్‌ రహీమ్‌, ఇమ్రాన్‌, ఇర్ఫాన్‌, సంజయ్‌లు ఉన్నారు. పరారీలో ప్రధాన సూత్రధారి ఆస్ట్రేలియా దేశస్తులు ముస్తఫా, ముబాషీర్‌, గణేశ్‌, పునిత్‌, పృథ్వీ, సిరి ఉన్నారు. ఈ సందర్భంగా ఏపీ పోలీసులు అనంతపురం ఎస్పీ సత్య యేసు బాబు, అనంతపురం 2 టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ జకీర్‌ హూస్సేన్‌, అనంపుతరం 3 టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ పి.రెడ్డప్ప, రప్తాడు ఎస్‌ఐ పీవై ఆంజనేయులు, కర్నాటక పోలీసులు చిత్రదుర్గ్‌ ఎస్పీ రాధిక, చల్లకేరీ సీఐ నలవాగుల మంజునాథ్‌, బీదర్‌ ఎస్పీ నగేశ్‌ డీఎల్‌, బళ్లారి ఎస్పీ సైదులు అదావత్‌, హుమ్నాబాద్‌ పీఎస్‌ఐ కిరణ్‌, క్రైమ్‌ పీసీ నవీన్‌, చిక్‌బల్లపూర్‌ ఎస్పీ మిథున్‌, కారావల్లి కోస్టల్‌ పోలీసు చేతన్‌, మహారాష్ట్ర పోలీసులు పూణే ఎస్పీ అభినవ్‌ దేశ్‌ముఖ్‌, రూరల్‌ టీమ్‌లకు సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

కిడ్నాప్‌ నుంచి ఛేజింగ్‌ వరకు...

  • 1:15-1:30 మధ్యాహ్నం సమయంలో.. బండ్లగూడలోని డెంటల్‌ డాక్టర్‌ బెహతాజ్‌ హుస్సేన్‌ నడుపుతున్న క్లినిక్‌కు గుర్తు తెలియని వ్యక్తులు బుర్ఖాలో వచ్చారు. అసిస్టెంట్‌ను బాత్‌రూమ్‌లో కట్టిపడేసి డాక్టర్‌ను కారులో ఎక్కించుకున్నారు. 
  • 1:30గంటల తర్వాత క్లినిక్‌ నుంచి బయలుదేరి కూకట్‌పల్లి ఎల్లమ్మ బండకు పయనమయ్యారు. అక్కడ ముందస్తుగా ఉన్న మరో గ్యాంగ్‌కు అప్పజెప్పారు.
  • 3.00 గంటల సమయంలో డెంటల్‌ డాక్టర్‌ సోదరుడు రాజేంద్రనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
   • 3.15...కు స్పాట్‌కు చేరుకున్న సైబరాబాద్‌ పోలీసులు...
   • 3.30...గంటలకు సీసీ కెమెరాల పరిశీలన...
   • 4.00...గంటలకు డాక్టర్‌ భవనంలో అద్దెకు ఉంటున్న ముబాషీర్‌ అతని ఇంట్లో పని చేసే రహీమ్‌ దృశ్యాలు కనపడ్డాయి. 
   • 4.15...అప్పటికే డాక్టర్‌ కుటుంబ సభ్యులు, సోదరుడు రహీమ్‌ను పట్టుకున్నారు. ఏలా దొరికాడంటే డాక్టర్‌ను కిడ్నాప్‌ చేసిన తర్వాత రహీమ్‌ పారిపోయేందుకు కారును స్టార్ట్‌ చేయబోయాడు. అప్పుడ అది స్టార్ట్‌ కాలేదు. అంతలోనే డాక్టర్‌ కుటుంబ సభ్యులు అతనిని పట్టుకోవడంతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. 
   • 6.00....గంటలకు సైబరాబాద్‌ పోలీసుల సాంకేతిక బృందం, క్యాట్‌ రంగంలోకి దిగింది. 
   • 6 నుంచి అర్ధరాత్రి 12 గంటలకు....రహీమ్‌ సమాచారం మేరకు సాంకేతికంగా మ్యాపింగ్‌ చేయడంతో హైదరాబాద్‌లో ఉన్న నిందితులు పోలీసులకు దొరికిపోయారు. 
   • అంతకు ముందు రాత్రి 11.30 గంటలకు నిందితులకు చెందిన కుటుంబ సభ్యులు మహరాష్ట్ర వైపు ప్రయాణం చేస్తున్నారని తెలుసుకుని ఆ మార్గన ఉన్న పోలీసు ఠాణాల్నింటితో పాటు మహరాష్ట్ర పోలీసులను అప్రమత్తం చేసి వాహనాల తనీఖీలను చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. 
   • 12.30 తర్వాత- రహీమ్‌తో పాటు ఇతర నిందితులు ఇచ్చిన సమాచారంతో డాక్టర్‌ను బొలెరో వాహనంలో బెంగళూరుకు తీసుకువెళ్తున్నారని తెలిసింది. 
   • అర్ధరాత్రి 1.00 గంటలకు -అనంతపురం, చిత్ర దుర్గ్‌, బళ్ళారి, ఉడిపి ప్రాంతాల ఎస్పీలతో సీపీ, డీసీపీ మాట్లాడి. ఈ మార్గన వాహనాల తనిఖీలను నిర్వహించారు. 
   • 28న ఉదయం 6.30 గంటలకు - అనంతపురం పోలీసులు వాహనాల తనిఖీల్లో బొల్లెరోను గుర్తించి రౌండప్‌ చేశారు. ఆ వెంటనే తెలంగాణ పోలీసులు చేరుకుని దుండగులను అదుపులోకి తీసుకుని డాక్టర్‌ సురక్షితంగా తమ ఆధీనంలోకి తీసుకుని హైదరాబాద్‌కు తీసుకువచ్చారు.