ఆదివారం 24 జనవరి 2021
Hyderabad - Nov 26, 2020 , 08:27:00

అవకాశాల గని.. ఉపాధి రాజధాని

అవకాశాల గని.. ఉపాధి రాజధాని

  • అభివృద్ధి.. ఐకమత్యంలోనూ భేష్‌
  • ప్రభుత్వ విధానాలకు ఇన్వెస్టర్లు ఫిదా
  • కరోనా క్లిష్ట కాలంలోనూ పరిశ్రమల రాక
  • మంత్రి కేటీఆర్‌ కృషితో అభివృద్ధి దిశలో నగరం

ఐటీ, ఫార్మా తదితర రంగాల్లో అవకాశాల గనిగా నిలిచింది మన హైదరాబాద్‌. ఉపాధి అవకాశాల సృష్టికి అనువైన స్టార్టప్‌ల ఏర్పాటు, వ్యాక్సిన్‌ తయారీకి అవకాశాలు ఇక్కడ నెలకొన్నాయి.. ఐకమత్య జీవనంతో మతసామరస్యానికి ప్రతీకగా నగరం పేరొందింది. విభిన్న సంస్కృతులకు వేదికగా, అభివృద్ధికి అడ్డాగా మారింది. అనువైన చారిత్రక సంపదతో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ విధానాలకు ఫిదా అయిన విదేశీ ఇన్వెస్టర్లు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నారు. అభివృద్ధి, శాంతిభద్రతల్లో హైదరాబాద్‌ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నది. మంత్రి కేటీఆర్‌ కృషితో నేడు భాగ్యనగరం అంతర్జాతీయ యవనికపై తనదైన ముద్ర వేస్తున్నది. విమానయానం.. విశాలమైన రహదారులు.. ఫ్లైఓవర్లు.. నిమిషాల్లో గమ్యం చేర్చే ఔటర్‌ రింగురోడ్డు. ఎంఎంటీఎస్‌, మెట్రోరైలు ప్రయాణం.. విస్తృత ప్రజారవాణా, అత్యాధునిక సాంకేతికత కలిగిన పోలీసు వ్యవస్థ.. ఇవి హైదరాబాద్‌కున్న ప్రత్యేకతలు. అందుకే దిగ్గజ కంపెనీలు నగరానికి క్యూ కడుతున్నాయి.

చెప్పారు.. చేసి చూపించారు..

‘దేశంలోనే ఏ నగరానికి లేనన్ని సానుకూల అంశాలెన్నో హైదరాబాద్‌ మహానగరానికి ఉన్నాయి. అలాంటి నగరం నుంచి ఐటీ ఎగుమతులను రెట్టింపు చేస్తాం’.... ఇదీ నాలుగేండ్ల క్రితం ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ చెప్పిన మాట. 

కేటీఆర్‌ చెప్పినట్టుగానే.. నాలుగేండ్లలోనే ఐటీ ఎగుమతులు రెట్టింపు అయ్యాయి. 2013-14లో ఐటీ ఎగుమతులు రూ.57,258 కోట్లు ఉంటే.. 2018-19లో అవి రూ.1,09,219 కోట్లకు చేరాయి. ఫలితంగా ఐటీ ఎగుమతుల్లో దేశంలోనే రెండో అతి పెద్ద నగరంగా హైదరాబాద్‌ నిలిచింది. అంతర్జాతీయ ఐటీ దిగ్గజాల మొదలు.. అంకుర కంపెనీల వరకు హైదరాబాద్‌ వైపే చూసేలా.. ఐటీ రంగం అభివృద్ధికి ప్రభుత్వం బాటలు వేసింది. టీ-హబ్‌ను ఏర్పాటు చేసి స్టార్టప్‌ క్యాపిటల్‌గా నగరాన్ని తీర్చిదిద్దింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సంస్థలు మైక్రోసాఫ్ట్ట్‌, గూగుల్‌, ఫేస్‌బుక్‌, ఆపిల్‌, అమెజాన్‌, ఐకియా ఇలా పదుల సంఖ్యలో నగరంలో కొలువుదీరాయి.

ఐటీ ఎగుమతుల్లో రికార్డు

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీకి కేరాఫ్‌ అడ్రస్‌.. హైదరాబాద్‌. ఐటీ ఎగుమతుల్లో నగరం రెండో స్థానంలో కొనసాగుతున్నది. తెలంగాణ వచ్చాక ఐటీ ఉత్పత్తులు రెట్టింపయ్యాయి. ప్రపంచంలోనే అతిపెద్ద అమెజాన్‌ క్యాంపస్‌, అమెరికా తర్వాత మెక్రోసాఫ్ట్‌కు అతిపెద్ద క్యాంపస్‌, ఆసియాలో గూగుల్‌కు మొదటి కార్యాలయం, దేశంలోనే మొదటి ఐకియా స్టోర్‌ హైదరాబాద్‌లోనే ఏర్పాటయ్యాయి. ఇక ఫేస్‌బుక్‌, ఆపిల్‌ సైతం హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టాయి. 2013-14లో రూ.57,253 కోట్ల విలువైన ఎగుమతులు ఉంటే.. 2019-20లో రూ.1,28,607 కోట్లుగా నమోదయ్యాయి. వృద్ధిరేటు 18 శాతంగా ఉన్నది. ఇప్పటికే 6లక్షల మంది ఐటీ ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. ముఖ్యంగా టెక్నాలజీపై నైపుణ్యం ఉన్న యువత తెలంగాణలోనే అధికంగా ఉంది. బెంగళూరు, చెన్నై, ముంబై సాఫ్ట్‌వేర్‌ సంస్థలు ఇక్కడి వారికి అధిక జీతంతో ఆఫర్లు ఇస్తుంటాయి. డిజిటల్‌ తెలంగాణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నది. టీఎస్‌ఐఐసీ, టీ-హబ్‌, టాస్క్‌ వంటి వాటితో  ఐటీ కార్యకలాపాలు పెరిగేలా ప్రోత్సహిస్తున్నది.

లుక్‌ ఈస్ట్‌ పాలసీకి చర్యలు

ఐటీ కారణంగా ఒకవైపే విస్తరించడాన్ని గుర్తించిన ప్రభుత్వం నగరాన్ని నలువైపులా విస్తరించేందుకు పక్కా ప్రణాళికలు రూపొందించింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం లుక్‌ ఈస్ట్‌ పాలసీని తీసుకువచ్చి ఐటీ కంపెనీలు హైదరాబాద్‌-వరంగల్‌ జాతీయ రహదారి చుట్టు పక్కల ఏర్పాటయ్యేలా చర్యలు చేపట్టింది. అదేవిధంగా ఐటీ కంపెనీలు శంషాబాద్‌-ఆదిభట్ల, మేడ్చల్‌, కొంపల్లి, దుండిగల్‌ ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు ఇప్పటికే చర్యలు చేపట్టింది. విస్తరించిన ఐటీ కారిడార్‌ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఐటీ ముఖ చిత్రం మారిపోయింది. దేశంలోని ఇతర రాష్ర్టాలకు చెందిన వారు సైతం హైదరాబాద్‌లో స్థిరపడేందుకు ఆసక్తి చూపారు. దీంతో ఐటీ కారిడార్‌ చుట్టుపక్కల నివాసప్రాంతాలకు మంచి డిమాండ్‌ ఏర్పడింది. ఐటీ కారిడార్‌ నుంచే ఔటర్‌ రింగురోడ్డుకు అనుసంధానం ఉండటంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఇక్కడే ఊపందుకుంది. గచ్చిబౌలి, నానక్‌రాంగూడ, నార్సింగి మీదుగా నుంచి శంషాబాద్‌ వరకు, ఇటు కోకాపేట మీదుగా కొల్లూరు, పటాన్‌చెరు వరకు ఐటీ కారిడార్‌ శరవేగంగా విస్తరించింది.

ఫార్మా, వ్యాక్సిన్‌ హబ్‌..

ఆసియాలోనే అతిపెద్ద ఫార్మా హబ్‌గా, ఫార్మా క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియాగా సైతం నగరం ప్రసిద్ధిగాంచింది. జాతీయ ఫార్మా ఉత్పత్తుల్లో 35శాతం ఒక్క హైదరాబాద్‌లోనే తయారవుతున్నాయి. అంతేకాకుండా విదేశీ ఎగుమతుల్లో 20శాతం ఇక్కడి నుంచే ఉంటున్నాయి. ఈ నాలుగేండ్లలో సుమారుగా 100 బిలియన్ల పెట్టుబడులను నగరం ఆకర్షించగలిగింది. లైఫ్‌ సైన్సెస్‌ పాలసీతోపాటు, జినోమ్‌ వ్యాలీ 2.0, హైదరాబాద్‌ ఫార్మాసిటీ, మెడికల్‌ డివైజెస్‌ పార్కుల ఏర్పాటుకు చర్యలు చేపట్టడంతో ఈ రంగం మరింత పుంజుకోనున్నది.

సులభతర ప్రజారవాణా

దేశంలోని అన్ని ప్రాంతాలతోపాటు, అంతర్జాతీయ నగరాలకు ఎయిర్‌ కనెక్టివిటీ ఉన్న ప్రాంతం హైదరాబాద్‌. దేశంలోని అన్ని ప్రాంతాలను కలిపేలా రోజుకు వందల్లో విమానాలు, 160కి పైగా రైళ్లు, 2 వేల బస్సులు నిత్యం రవాణా సౌకర్యాన్ని అందజేస్తున్నాయి. టెలిఫోన్‌ ఎక్సేంజీలు, ఆప్టిక్‌ ఫైబర్‌ కమ్యూనికేషన్‌ లైన్లు ఉండటం కూడా అనుకూలమైన అంశం. మూడు జాతీయ రహదారులు, ఏడు రాష్ట్ర రహదారులు నగరం గుండా వెళుతున్నాయి. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశయ్రం సైతం అభివృద్ధికి దోహదం చేస్తున్నది. నగరంలోని మెట్రో, ఎంఎంటీఎస్‌ వంటివి కూడా ప్రజారవాణాలో కీలకంగా వ్యవహరిస్తున్నాయి.

ఆఫీస్‌ స్పేస్‌లో రికార్డు

 2015-19 మధ్యకాలంలో 2.1 యూఎస్‌ బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించగలిగింది. ఇదే సమయంలో మనదేశానికి 35.2 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. మొత్తంగా తీసుకుంటే ఒక్క హైదరాబాద్‌కు 6శాతం పెట్టుబడులు రావడం విశేషం. దీంట్లో 85శాతానికి పైగా పెట్టుబడులు ఆఫీస్‌స్పేస్‌కు సంబంధించినవే. మిగతావి రిటైల్‌, వేర్‌హౌజింగ్‌ రంగానికి చెందినవి. 2014-2019 మధ్యకాలంలో కమర్షియల్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ 172 శాతం వృద్ధిరేటును నమోదు చేసింది. ఆఫీస్‌ స్పేస్‌ వినియోగం 2013లో 11శాతంగా ఉంటే.. 2019కి వచ్చేసరికి అది 22శాతానికి ఎగబాకింది. ఒక్క 2019లోనే 1.2 మిలియన్‌ చదరపు మీటర్ల ఆఫీస్‌ స్పేస్‌ అందుబాటులోకి రావడం దేశంలోనే ఒక రికార్డు. ఐటీ, ఐటీఈఎస్‌ ఆఫీస్‌ స్పేస్‌ వినియోగం 2014 నుంచి 2019 నాటికి 211శాతం పెరిగింది. పరిశ్రమలకు అనుమతులు తొందరగా లభించేల టీఎస్‌ఐపాస్‌ విధానం, ఐటీ కంపెనీలు అభివృద్ధి చెందేలా గ్రిడ్‌ పాలసీ తదితర ఫ్రెండ్లీ స్కీముల ఏర్పాటులో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది.

విమానయానంలోనూ..

హైదరాబాద్‌నుంచి రాకపోకలు సాగించే విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నది. దేశం మొత్తంలో విమాన ప్రయాణికుల్లో 6.4శాతం మంది మన హైదరాబాద్‌ నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. ఇది 2010-11లో 5.3 శాతంగా ఉంటే, 2020కి వచ్చేసరికి 6.4శాతానికి చేరుకుంది. విమాన తయారీ కంపెనీలయిన ప్రత్‌ అండ్‌ విట్నీ, లాక్‌హెడ్‌ మార్టిన్‌, బోయింగ్‌, ఎయిర్‌బోబస్‌, జీవీ ఏవియేషన్‌, రాఫెల్‌ అండ్‌ పిలాటస్‌ కంపెనీలు హైదరాబాద్‌ కేంద్రంగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి.  కరోనా కాలంలోనూ 1,658 పరిశ్రమలు కరోనా క్లిష్ట పరిస్థితుల్లోనూ నగరవాసులు ధైర్యంగా ఉన్నారు. లాక్‌డౌన్‌లో టీఆర్‌ఏ (ట్రస్ట్‌ రీసెర్చ్‌ అడ్వైజరీ) సంస్థ దేశవ్యాప్తంగా జరిపిన సర్వేలో  82శాతం మంది నగరవాసులు మనోధైర్యాన్ని ప్రదర్శించారని పేర్కొంది. వర్క్‌ ఫ్రం హోంలో ఉన్న ఉద్యోగులు 24 గంటల కరెంటు సదుపాయంతో కీలక ప్రాజెక్టులను పూర్తిచేయగలిగారు. కరోనా కాలంలో దేశంలో అనేక నగరాల్లో కంపెనీలు మూతపడాల్సిన పరిస్థితి ఉంటే.. హైదరాబాద్‌లో మాత్రం కొత్తగా 1,658 పరిశ్రమలు వచ్చాయి.logo