శుక్రవారం 30 అక్టోబర్ 2020
Hyderabad - Oct 17, 2020 , 08:42:38

కారంపొడి కొట్టినా.. వెన‌క్కి త‌గ్గ‌లే

కారంపొడి కొట్టినా.. వెన‌క్కి త‌గ్గ‌లే

  • రాళ్లురువ్వి.. పలు వాహనాలు ధ్వంసం
  • పోలీసులు టీయర్‌ గ్యాస్‌ ప్రయోగం
  • పది మందిని అరెస్ట్‌ చేసి నగరానికి తరలింపు
  • పీటీ వారెంట్‌పై మరో ఎనిమిది మంది

ఓఎల్‌ఎక్స్‌ ప్రకటనలతో మోసం చేస్తున్న రాజస్తాన్‌ చీటర్స్‌ను పట్టుకునేందుకు హైదరాబాద్‌ పోలీసులు చేసిన యుద్ధం కాకీ సినిమాను తలపించింది. నిందితుల స్థావరాలను గుర్తించి పట్టుకునేందుకు వెళ్లిన నగర పోలీసులపై అక్కడి గ్రామాల ప్రజలు తిరుగబడ్డారు. పోలీసులు వస్తున్న విషయాన్ని ముందుగానే పసిగట్టిన నేరగాళ్లు అప్పటికే ఏర్పాటుచేసుకున్న ముఠాలను రెచ్చగొట్టారు. గ్రామస్తులతో కలిసి పోలీసులపైకి కారంపొడితో దాడికి దిగారు. ఆ క్రమంలో పోలీసులు టీయర్‌గ్యాస్‌ ప్రయోగించి ఎట్టకేలకు నేరగాళ్లకు పట్టుకుని హైదరాబాద్‌ తీసుకువచ్చారు. 

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : సైబర్‌చీటర్లను పట్టుకోవడం కోసం హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు రాజస్తాన్‌లోని రెండు గ్రామాల ప్రజలతో యుద్ధం చేయాల్సి వచ్చింది. ఈ సారి స్థానిక పోలీసులు పూర్తిగా సహకరించడంతో వందలాది మంది గ్రామస్తులను పక్కకు తప్పించి, టీయర్‌ గ్యాస్‌ ప్రయోగించి 10మంది సైబర్‌నేరగాళ్లను అరెస్ట్‌ చేశారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటన భరత్‌పూర్‌లోని సైబర్‌నేరగాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. సీసీఎస్‌ జాయింట్‌ సీపీ అవినాశ్‌ మహంతి కథనం ప్రకారం... ఓఎల్‌ఎక్స్‌లో వివిధ ప్రకటనలు ఇస్తూ, తాము ఆర్మీ అధికారులమంటూ నకిలీ గుర్తింపుకార్డులు తయారు చేసుకొని రాజస్తాన్‌ రాష్ట్రంలోని భరత్‌పూర్‌ జిల్లాలోని కొన్ని గ్రామాలకు చెందిన సైబర్‌నేరగాళ్లు దేశ వ్యాప్తంగా మోసాలకు పాల్పడున్నారు. ఈ మోసాలు చేసేందుకు సైబర్‌నేరగాళ్లు ఆయా గ్రామాల్లో 2018 మే నుంచి గ్యాంగ్‌లుగా ఏర్పడ్డారు. ఓఎల్‌ఎక్స్‌, క్వికర్‌, ఫేస్‌బుక్‌ మార్కెట్‌ ప్లేస్‌లో వాహనాలు, ఫోన్లు, ఫర్నిచర్‌, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువుల క్రయ, విక్రయాల ప్రకటనలు ఇస్తారు. తాము ఆర్మీ, సీఐఎస్‌ఎఫ్‌లలో పనిచేస్తున్నామంటూ తమకు తాముగా చెప్పుకొని, భారత సైనికులపై దేశ ప్రజలకు ఉన్న నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటారు. ఈ ప్రకటనలలో ఉన్న వస్తువును కొనేందుకు ఎవరైనా ఫోన్‌ చేయగానే దాన్ని తక్కువకు విక్రయించడం, ఎక్కువ ధరకు కొనేందుకు ముందుకు వస్తారు. వాట్సాప్‌లో ఆర్మీ అంటూ చెప్పుకునే నకిలీ ఐడీ కార్డులు, వాహనాలకు సంబంధించిన నకిలీ ఆర్సీలు కూడా పంపిస్తారు. ముందుగా వాహనం ఎయిర్‌పోర్టులో ఉంది, గోడౌన్‌లో ఉందంటూ గేట్‌ పాస్‌, ట్రాన్స్‌పోర్టు, ఇన్సూరెన్స్‌, డెలివరీ చార్జీలంటూ బాధితులను మాటల్లో పెట్టి మోసం చేస్తారు. ఎవరైనా నిలదీస్తే ఒప్పందం కంటే ఎక్కువగా మీ డబ్బులు మా వద్ద ఉంటే మీకు తిరిగి ఇచ్చేస్తామంటూ నమ్మిస్తారు. ఇలా అందిన కాడికి బాధితుల వద్ద నుంచి వేలు, లక్షలు లాగేస్తుంటారు.

భరత్‌పూర్‌ పోలీసులకు చిక్కిన 800 సిమ్‌లు 

హైదరాబాద్‌ పోలీసులు ఇచ్చిన సమాచారంతో భరత్‌పూర్‌ ఎస్పీ ఓఎల్‌ఎక్స్‌ సైబర్‌చీటర్లపై ప్రత్యేక ఫోకస్‌ పెట్టించారు. దీంతో అక్కడ కుటీర పరిశ్రమగా మారిన సైబర్‌నేరగాళ్లపై దాడులు చేయించి 8మందిని అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి 800 సిమ్‌కార్డులను అక్కడి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో హైదరాబాద్‌కు సంబంధించిన పలువురిని మోసం చేసినట్లు నిందితులు వెల్లడించారు. దీంతో అక్కడకు వెళ్లిన హైదరాబాద్‌ పోలీసులు పీటీ వారెంట్‌పై 8మందిని ఈ నెల 9వ తేదీన అదుపులోకి తీసుకొని పడ్లా గ్రామానికి చెందిన అరీఫ్‌ఖాన్‌, దీను ఖాన్‌, ఇలియాస్‌ ఖాన్‌, పుస్పేంద్రసింగ్‌, రాధే శ్యామ్‌, మోహన్‌ సింగ్‌, హకమ్‌ ఖాన్‌లను హైదరాబాద్‌కు తరలించారు. 

పోలీసులపై కారం పొడితో దాడి!

నగరానికి చెందిన పలువురు బాధితుల ఫిర్యాదుల మేరకు సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీస్‌స్టేషన్‌లో పలు కేసులు నమోదయ్యాయి. నాలుగు కేసుల్లో పక్కా ఆధారాలు ఉండటంతో ఆయా గ్యాంగ్‌లను పట్టుకోవడం కోసం సైబర్‌క్రైమ్స్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్‌ నవీన్‌ బృందం రాజస్తాన్‌కు వెళ్లింది. భరత్‌పూర్‌ ఎస్పీ అమన్‌దీప్‌సింగ్‌ను కలిసి, ఓఎల్‌ఎక్స్‌లో ప్రకటనల పేరుతో మోసం చేస్తున్న వారి గూర్చి వివరించారు. అక్కడి ఐపీఎస్‌ అధికారి అమన్‌దీప్‌సింగ్‌ సిటీ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు 20వాహనాలతో 100మంది సిబ్బంది, ఆయుధాలు, టీయర్‌గ్యాస్‌తో కూడిన సౌకర్యాలను అప్పగించారు. దీంతో భరత్‌పూర్‌ జిల్లాలోని ఖోవో పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పక్కపక్కనే ఉన్న చుల్హెర, కల్యాన్‌పుర గ్రామాల్లో ఉన్న నిందితులను పట్టుకోవడం కోసం పోలీసు బృందాలు రాత్రి 2 గంటల సమయంలో అక్కడకు చేరుకున్నాయి. అప్పటికే పోలీసుల రాకను గుర్తించిన ఆయా గ్రామస్తులు పోలీసులను అడ్డుకున్నారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. మహిళలు కారం పొడితో విరుచుకుపడ్డారు. అయితే నిందితులు పారిపోయేందుకు ప్రయత్నిస్తుండటంతో అక్కడి పోలీసులు టీయర్‌ గ్యాస్‌ను ప్రయోగించి, అందరినీ చెల్లచెదురు చేశారు. 10మంది నిందితులను అక్కడే అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ దాడుల్లో మూడు పోలీసు వాహనాలు ధ్వంసం చేయడంతో పాటు పోలీసుల విధులకు ఆటంకం కల్గించిన గ్రామస్తులపై కేసులు నమోదు చేశారు. ఈ దాడుల్లో చుల్హెరకు చెందిన వాజిబ్‌ ఖాన్‌, షాహిల్‌, ఇఫ్రాన్‌, తారీఫ్‌, అజారుద్దీన్‌, రాహుల్‌, కల్యాణ్‌పూర్‌కు చెందిన షాహిద్‌, ఉమర్‌ ఖాన్‌లతో పాటు ఖారిక గ్రామానికి చెందిన సత్వీర్‌సింగ్‌, మోహన్‌సింగ్‌లను అరెస్ట్‌ చేసి, వాళ్ల వద్ద 17సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకొని, హైదరాబాద్‌కు తరలించారు.