శుక్రవారం 05 మార్చి 2021
Hyderabad - Jan 17, 2021 , 05:09:06

టీకా వచ్చిందిగా ఢోకా లేదిక

టీకా వచ్చిందిగా ఢోకా లేదిక

  • గ్రేటర్‌లో 33 కేంద్రాల్లో 949 మందికి టీకా 
  • గాంధీలో తొలి టీకా తీసుకున్న పారిశుధ్య కార్మికురాలు కృష్ణమ్మ
  • 18 నుంచి కేంద్రాలతోపాటు టీకా వేసుకునేవారి సంఖ్య పెంపు

కరోనాను అంతమొందించే వ్యాక్సిన్‌ ప్రక్రియ శనివారం షురూ అయ్యింది. ఎంతో కసరత్తు, సుదీర్ఘ సమీక్షల అనంతరం తొలి టీకాను స్వచ్ఛయోధులు, ప్రభుత్వ వైద్యులు, సిబ్బందికి ఇచ్చారు. మూడు జిల్లాల పరిధిలో 33 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ ప్రారంభం కాగా, మొదటిరోజు 949 మందికి టీకా ఇచ్చారు. తొలి టీకాను గాంధీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికురాలు కృష్ణమ్మ తీసుకోగా, అనంతరం వైద్యులు, ఉన్నతాధికారులు వేసుకొని స్ఫూర్తిని చాటారు. వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి ఎలాంటి దుష్ఫలితాలు తలెత్తకపోవడంతో  అందరినీ ఇంటికి పంపించారు.    

హైదరాబాద్‌ : ఎపుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరోనా టీకా రానేవచ్చింది.  ఉదయం 10.36గంటలకు వర్చువల్‌ విధానంలో ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి టీకాను ప్రారంభించారు. గ్రేటర్‌ పరిధిలోని 33కేంద్రాల్లో కరోనా టీకా పంపిణీ  విజయవంతంగా సాగింది. ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు మొదటి విడుతలో వైద్యర్యంగంలో పనిచేసే వారికే ప్రాధాన్యతను ఇవ్వడంతోపాటు తొలి టీకా దవాఖానల్లో పనిచేసే పారిశుధ్య కార్మికులకు వేశారు. తొలి రోజు గాంధీ దవాఖానలో వైద్యరంగంలో పనిచేసే పారిశుధ్య కార్మికుల నుంచి  డైరెక్టర్‌ స్థాయి వైద్యాధికారుల వరకు కరోనా టీకా తీసుకున్నారు.  గ్రేటర్‌ వ్యాప్తంగా 1,08,925మంది హెల్త్‌కేర్‌ వర్కర్లను గుర్తించి వారి పేర్లను కొ-విన్‌ యాప్‌లో పొందుపరిచిన విషయం తెలిసిందే. మొదటి రోజు ప్రతి కేంద్రంలో 30మందికి టీకా ఇచ్చారు. గ్రేటర్‌ వ్యాప్తంగా మొత్తం 33 కేంద్రాల్లో 1020 మందికి టీకా ఇవ్వాల్సి ఉండగా 949మందికి టీకా వేశారు. గాంధీ దవాఖానలో కేంద్ర హోం సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఆధ్వర్యంలో తొలి టీకాను పారిశుధ్య కార్మికురాలు కృష్ణమ్మకు వేశారు. అనంతరం వైద్య విద్య సంచాలకులు, వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ డాక్టర్‌ రమేశ్‌ రెడ్డి, ఐపీఎం డైరెక్టర్‌, నల్లకుంట ఫీవర్‌ హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శంకర్‌, గచ్చిబౌలిలోని టిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ విమలా థామస్‌తోపాటు పలువురు పారిశుధ్య కార్మికులు, నర్సింగ్‌ సిబ్బంది, సెక్యూరిటీగార్డులు, వైద్యులు కరోనా టీకా తీసుకుని తమ వేలిపై వేసిన సిరా మార్కుతో అందరికీ అభివాదం చేస్తూ కనిపించారు. నల్లకుంటలోని తిలక్‌నగర్‌ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, కలెక్టర్‌ శ్వేతా మహంతి, నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌తో కలిసి మంత్రి కేటీఆర్‌ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలి టీకాను యూపీహెచ్‌సీలో ఆయమ్మగా పనిచేస్తున్న రేణుకకు వేశారు. నిమ్స్‌ దవాఖానలో  గవర్నర్‌ తమిళిసై టీకా పంపిణీ ప్రారంభించారు. వ్యాక్సినేషన్‌ పూర్తయిన తరువాత అరగంటపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.

18 నుంచి కేంద్రాలతోపాటు టీకా వేసుకునేవారి సంఖ్య పెంపు

సోమవారం నుంచి టీకా కేంద్రాల సంఖ్యను పెంచనున్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు. అంతే కాకుండా ప్రస్తుతం 30 మంది ఉన్న టీకా వేసుకునేవారి సంఖ్యను 50కి పెంచనున్నట్లు తెలిపారు. మేడ్చల్‌ జిల్లా పరిధిలో ప్రస్తుతం ఉన్న 11 టీకా కేంద్రాలను సోమవారం నుంచి 20కి పెంచనున్నట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ మల్లికార్జున్‌ తెలిపారు. 

ఇప్పటి వరకు అంతా సేఫ్‌

గ్రేటర్‌ వ్యాప్తంగా ఏ సెంటర్‌లో కూడా టీకా తీసుకున్న సమస్యలు తలెత్తకపోవడంతో వారిని ఇంటికి పంపించారు. ప్రతి టీకా కేంద్రానికి ఒక ప్రత్యేక పర్యవేక్షణాధికారిని ఏర్పాటు చేయడంతో వారు టీకా ప్రక్రియను సూక్ష్మంగా పరిశీలించారు. రాత్రి వరకు టీకా తీసుకున్నవారంతా సేఫ్‌గానే ఉన్నట్లు వైద్యాధికారులు స్పష్టం చేశారు. ఏవైనా దుష్ప్రభావాలుంటే 48గంటల్లో బయట పడతాయని, సమస్య ఉంటే 1075, 104నంబర్లకు గానీ లేదా ప్రభుత్వ దవాఖానలను ఆశ్రయించవచ్చని వైద్యాధికారులు సూచించారు. 

చాలా సంతోషంగా ఉంది 

కరోనా వ్యాక్సినేషన్‌ ప్రారంభంలోనే వ్యాక్సిన్‌ను తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన వ్యాక్సిన్‌ రావడంతో ఇక కరోనా భయం పోయింది. అందరూ వ్యాక్సిన్‌ వేసుకునేందుకు ముందుకు రావాలి. - డాక్టర్‌ అనురాధ,ఆర్‌ఎంవో,ఉస్మానియా

ఎవరూ భయపడొద్దు

నేను సంతోషంగా టీకా తీసుకున్నా. కరోనా వ్యాక్సిన్‌ తీసుకునేందుకు ఎవరూ భయపడొద్దు. అపోహలు వద్దు. ముందు జాగ్రత్తగా ఈ టీకా తీసుకున్నా. ఎలాంటి ఇబ్బంది కలుగలేదు. రెండో డోసు 28 రోజుల తరువాత ఇస్తామని చెప్పారు.  - డాక్టర్‌ సుకన్య, ఏఎంఎస్‌ దవాఖాన

సైడ్‌ ఎఫెక్ట్స్‌  లేవు

వ్యాక్సిన్‌ తీసుకోవడానికి మేమే భయపడితే మిగతా వాళ్లు ఎలా తీసుకుంటారు. నిర్భయంగా ముందుకు వచ్చి టీకా తీసుకున్నాను. మిగతా వాళ్లు కూడా ముందుకు రావాలి. ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేవు. నేను హ్యాపీగా ఉన్నాను. - పరిమళ, స్టాఫ్‌ నర్సు, (అంబర్‌పేట)

అధికారులకు రుణపడి ఉంటా.. 

తనలాంటి సాధారణ ఉద్యోగికి తొలిరోజు వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు కృషి చేసిన ప్రతి ఒక్క అధికారికి రుణపడి ఉంటా. వ్యాక్సిన్‌పై డ్రై రన్‌లో వైద్యులకు అవగాహన కల్పించిన తీరు, ఏర్పాట్ల సమయంలో ఎంతో సంతోషంగా ఉండేది. తనకూ వ్యాక్సిన్‌ ఇస్తే బాగుండేది అనుకున్నా. కానీ వ్యాక్సినేషన్‌ కేంద్రంలో తాను వ్యాక్సిన్‌ తీసుకోవడం సంతోషకరం. - సత్యనారాయణ,ఈఎన్‌టీ దవాఖాన సెక్యూరిటీ గార్డు

ధైర్యం నింపి కాపాడుకున్నాం

కరోనా సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కరోనా సోకిన పేషెంట్‌ వద్దకు వెళ్లి వారిలో ధైర్యం నింపి మా ప్రాణాలను పణంగా పెట్టి వారిని కాపాడుకున్నాం. ప్రభుత్వం, పోలీసుల సహకారంతో ప్రజల్లో అవగాహన పెంచుతూ మేము చేసిన సేవలను గుర్తించి మొదటి టీకా నాకే వేయడం సంతోషంగా ఉంది. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు. - కె. జయమ్మ, ఏఎన్‌ఎం 

అందరికీ పండుగ రోజు

మనందరికీ ఆస్తులు ఎన్నీ ఉన్నా ఆరోగ్యం బాగోలేకపోతే అవన్నీ ఉత్తదే..కరోనా వచ్చి అందరికీ ఓ గుణపాఠం నేర్పింది.  ఆరోగ్యపరమైన సూత్రాలను పాటించేలా చేసింది. కరోనా భయంతో చాలా మంది ఆరోగ్యంపై దృష్టి సారించారు. టీకా వచ్చిందని నిర్లక్ష్యం చేస్తే పరిస్థితులు తారుమారు అవుతాయి. ఈ రోజు మనందరికీ ఓ పండుగ రోజుగా గుర్తు చేసుకోవాలి. - లత, ఆశావర్కర్‌, నార్సింగి మున్సిపాలిటీ
VIDEOS

logo