శనివారం 06 జూన్ 2020
Hyderabad - Apr 04, 2020 , 04:18:19

మరమ్మతులకిదే మంచి సమయం

మరమ్మతులకిదే మంచి సమయం

లాక్‌డౌన్‌ వేళ వడివడిగా రహదారుల పునరుద్ధరణ

మంత్రి కేటీఆర్‌ ఆదేశంతో.. పనుల్లో వేగం పెంచిన బల్దియా

45 కిలోమీటర్ల మేర పూర్తయిన పనులు

రోడ్ల పునరుద్ధరణ మరమ్మతుల కోసం జీహెచ్‌ఎంసీ లాక్‌డౌన్‌ సమయాన్ని సద్వినియోగపరుచుకోనుంది. రోజుకు 10నుంచి 15కిలోమీటర్ల వరకు రీకార్పెటింగ్‌ పనులు పూర్తిచేసున్నారు. లాక్‌డౌన్‌ పూర్తయ్యేవరకు రేయింబవళ్లూ పనిచేయనున్నారు. ఇప్పటికే 45కిలోమీటర్ల మేర రీ కార్పెటింగ్‌ పూర్తి చేసి 2 వేలకుపైగా గుంతలను పూడ్చివేశారు. సెంట్రల్‌ మీడియా, ఫుట్‌పాత్‌లు, లేన్‌ మార్కింగ్‌ పనులు కూడా చురుకుగా కొనసాగుతున్నాయి. 

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ప్రస్తుత లాక్‌డౌన్‌ సందర్భంగా ట్రాఫిక్‌ ఇబ్బందులు లేనందున సాధ్యమైనంత వేగంగా రోడ్డు నిర్మాణ పనులు నిర్వహించాలని పురపాలకశాఖ మంత్రి కేటీ రామారావు జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా ఇతర రాష్ర్టాలనుంచి బీటీ వాహనాలకు అడ్డంకులు లేకుండా ఆయన తగిన చర్యలు తీసుకున్నారు. 

709 కిలోమీటర్ల మేర.. 
ఐదేళ్ల పాటు 

రహదారుల సమగ్ర కార్యనిర్వహణ పథకం (సీఆర్‌ఎంపీ) కింద 709.49 కిలో మీటర్లమేర ప్రధాన రోడ్లను ఐదేళ్లపాటు నిర్వహించేందుకు ప్రభుత్వం 1839 కోట్లతో 7 ప్యాకేజీల పనులను మంజూరుచేసి ప్రైవేటు ఏజెన్సీలకు పనులు కేటాయించింది. మొదటి ఏడాదిలో 50 శాతం రోడ్ల రీ కార్పెటింగ్‌, రెండో ఏడులో 30శాతం, మూడో ఏడులో 20శాతం రీకార్పెటింగ్‌ పూర్తిచేయాలని నిర్ణయించారు. మిగిలిన రెండేళ్లు వాటిని పాడైపోకుండా నిర్వహించాలి. వీటితో పాటు గుంతల పూడ్చివేత, రోడ్లపై నీలిచే నీటిని తొలగించడం, పారిశుధ్య పనులు, యంత్రాల ద్వారా రోడ్లను ఊడ్చడం, ఫుట్‌పాత్‌లను అభివృద్ధి చేయడం వంటి పనులు కూడా ఇందులో భాగంగా ఉన్నాయి. 

పాడైతే బాగుచేయాల్సిందే

నిర్వహణదారులు ఏటా పాడైన ప్రాంతాల్లో రోడ్లను బాగుచేయాలి. లేన్‌ మార్కింగ్స్‌ వేయాలి. ఫుట్‌పాత్‌లకు రంగులద్దాలి. సెంట్రల్‌ మీడియంను అందంగా ఉండేలా తీర్చిదిద్దాలి. ఎక్కడిక్కడ రోడ్డు భద్రత సూచికలను ఏర్పాటు చేయాలి. ఫుట్‌పాత్‌లు, సెంట్రల్‌ మీడియాలపై పచ్చదనాన్ని పెంపొందించాలి. ఈ ఐదేండ్లలో ఇంకా ఏదైనా అదనపు పనులు చేపట్టాల్సివస్తే అంచనా వ్యయం ప్రకారం సదరు సంస్థలే నిర్వహించాల్సి ఉంటుంది. దీనికి జీహెచ్‌ఎంసీ అదనంగా చెల్లిస్తుంది. రోడ్ల తవ్వకాలను అనుమతించే అధికారాన్ని ప్రైవేటు ఏజెన్సీలకే అప్పగించారు. జోనల్‌ కమిషనర్లకు పనుల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. 


logo