బుధవారం 25 నవంబర్ 2020
Hyderabad - Oct 23, 2020 , 06:59:34

కోలుకుంటున్న నగరం

కోలుకుంటున్న నగరం

ముంపు కాలనీలను వదులుతున్న నీళ్లు 

విస్తృతంగా బల్దియా సహాయక చర్యలు

పేరుకుపోయిన బురద, చెత్త తొలగింపు

బ్లీచింగ్‌ పౌడర్‌, క్రిమిసంహారకాల పిచికారీ

కొనసాగుతున్న ఆర్థిక సాయం పంపిణీ

ఊపిరి పీల్చుకుంటున్న వరద బాధితులు

వరద విధ్వంసం నుంచి నగరం క్రమంగా తేరుకుంటున్నది. ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలతో ముంపు ప్రాంతాలుకోలుకుంటున్నాయి. బల్దియా, జలమండలి, డీఆర్‌ఎఫ్‌ ముమ్మర చర్యలతో కాలనీలు, సెల్లార్లను నీళ్లు వదులతున్నాయి. రోడ్లపై మేట వేసిన బురద, చెత్తను తొలగించడంతోపాటు సిబ్బంది బ్లీచింగ్‌ పౌడర్‌, క్రిమి సంహారకాలు చల్లుతున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన ఆర్థిక సాయంపంపిణీ కొనసాగుతున్నది. వాతావరణం తెరిపివ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. చాలాచోట్ల వరద ముంపునకు అస్తవ్యస్తంగా మారిన ఇండ్లను జనం శుభ్రం చేసుకుంటున్నారు. 

సిటీబ్యూరో: వరద కష్టాల నుంచి నగరం క్రమంగా కోలుకుంటున్నది. ముంపునకు గురైన కాలనీలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. వరుణుడు శాంతించడంతో బాధితులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక బల్దియా సహాయక చర్యలు ముమ్మరం చేసింది. ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్‌ మరింత వేగంగా సాగుతున్నది. ముంపు ప్రాంతాల్లోని నీటిని, పేరుకుపోయిన బురదను తొలగిస్తున్నారు. బ్లీచింగ్‌ పౌడర్‌తో పాటు క్రిమి సంహారకాలను పిచికారీ చేస్తున్నారు.  

వివిధ కాలనీల్లో.. 

కాప్రా ఈశ్వరిపురి కాలనీ, చర్లపల్లి టీచర్స్‌ కాలనీ, మల్లాపూర్‌ భవానీ నగర్‌, శక్తిసాయినగర్‌, నాచారం ఎర్రకుంట, రాఘవేంద్రనగర్‌, ఇందిరానగర్‌, ఉప్పల్‌ ధర్మపురి కాలనీ, అన్నపూర్ణ కాలనీ, శ్రీగిరి కాలనీ, కావేరీనగర్‌, ఉప్పల్‌ శాంతినగర్‌, మల్లికార్జుననగర్‌, నాగోలు అయ్యప్ప కాలనీ, రాఘవేంద్రకాలనీ, హయాత్‌నగర్‌ జడ్జెస్‌ కాలనీ, గౌతంనగర్‌, బంజారాకాలనీ, ఎల్బీనగర్‌లోని జనప్రియ కాలనీ, హస్తినాపురం రెడ్డి కాలనీ, గోకుల్‌ ఎన్‌క్లేవ్‌, శివసాయి కాలనీ, చంపాపేట్‌ ఉదయ్‌నగర్‌ కాలనీ, లింగోజిగూడ సాయినగర్‌, తపోవన్‌ కాలనీ, గడ్డిఅన్నారం వీవీనగర్‌, కమలానగర్‌, టోలీచౌకీ అహ్మద్‌నగర్‌,  అంబర్‌పేట్‌ గంగూబాయి బస్తీ, ఎర్రన్న బస్తీ తదితర కాలనీల్లో వరద నీరు చాలా వరకు తగ్గిపోయింది. 13న వచ్చిన భారీ వర్షానికి ఈ కాలనీల్లో సుమారు ఐదారు అడుగుల ఎత్తు వరకు ఇండ్లలో నీరు నిండిపోగా, ప్రస్తుతం చాలా వరకు తగ్గిపోయింది.  

బంధువుల ఇండ్లకు వెళ్లి.. 

యూసుఫ్‌గూడలోని బోరబండ, రహ్మత్‌నగర్‌, ఎర్రగడ్డ, సిద్ధిఖ్‌నగర్‌, ప్రేమ్‌నగర్‌, గచ్చిబౌలిలోని గోపన్‌పల్లితండా, పాపిరెడ్డి కాలనీ, ఖాజాగూడ, మాదాపూర్‌ ఇజ్జత్‌నగర్‌, మియాపూర్‌ న్యూ కాలనీ, ఆర్సీపురం కానుకుంట పరిసర ప్రాంతాలు, ఓల్డ్‌ బోయిన్‌పల్లి అబ్రార్‌నగర్‌, ముస్లింబస్తీ, కూకట్‌పల్లి ఏవీబీపురం కాలనీ, సుభాష్‌నగర్‌ అయోధ్యనగర్‌, సోనియా గాంధీనగర్‌, చింతల్‌ దుర్గానగర్‌, గాజులరామారం జయశంకర్‌నగర్‌ తదితర కాలనీల్లో సైతం చాలా వరకు వరద నీరు తగ్గిపోవడంతో పునరావాస కేంద్రాలకు, బంధువుల ఇండ్లకు వెళ్లిన వారు తిరిగి తమ నివాసాలకు చేరుకుంటున్నారు.  అల్వాల్‌ సాయినగర్‌, లోతుకుంట, అల్వాల్‌ శ్రీనివాస్‌నగర్‌, వెంకటాపురం శివానగర్‌, భూదేవినగర్‌, లోటస్‌పాండ్‌ కాలనీ, ఆర్బీఐ కాలనీ, శ్రీదత్త కాలనీ, దోమలగూడ స్ట్రీట్‌ నం . 1, 3, హిమాయత్‌నగర్‌ గగన్‌మహల్‌, కాచిగూడ మౌలానా ఆజాద్‌నగర్‌, చప్పల్‌బజార్‌, అంబర్‌పేట్‌, మల్కాజిగిరి ఈస్ట్‌ ఆనంద్‌బాద్‌లోని ఎన్‌ఎండీసీ కాలనీ, బేగంపేట్‌ ప్రకాశ్‌నగర్‌, మయూరీ చీకోటి గార్డెన్స్‌, మలక్‌పేట్‌ శంకర్‌నగర్‌, పద్మానగర్‌, ఐఎస్‌ సదన్‌ విష్ణుపురికాలనీ, వడ్డెరబస్తీ తదితర కాలనీలకు సైతం ముంపు నుంచి విముక్తి 

లభించింది. 

ఎక్కువ శాతం ముంపునకు గురైన ఫలక్‌నుమా అల్‌జుబైల్‌ కాలనీ, కబీర్‌నగర్‌, చాంద్రాయగుట్టలోని బండ్లగూడ రాజీవ్‌గాంధీ నగర్‌, ఉప్పుగూడ శివాజీనగర్‌, పల్లె చెరువు పరిసర కాలనీలు, మల్లేపల్లి నదీంకాలనీ, ఆసిఫ్‌నగర్‌, అహ్మద్‌ కాలనీ, దుర్గానగర్‌, ఖైరతాబాద్‌లోని ఎంఎస్‌ మక్తా, బీఎస్‌ మక్తా,  బీజేఆర్‌నగర్‌, గాంధీనగర్‌, అడిక్‌మెట్‌ నాగమయ్య కుంట, పద్మాకాలనీ, రాజేంద్రనగర్‌ అలీనగర్‌, మైలార్‌దేవ్‌పల్లిలోని గగన్‌పహాడ్‌, సుభాష్‌నగర్‌, పల్లె చెరువు పరిసర ప్రాంతాలు, రాజేంద్రనగర్‌ అప్పాచెరువు పరిసరాల్లోనూ నీరు తగ్గుముఖం పట్టింది. అలాగే వరదతో నిండిపోయిన సెల్లార్లలో సైతం నీరు క్రమక్రమంగా ఖాళీ అవుతున్నాయి. పలుచోట్ల బల్దియా సిబ్బంది మోటర్ల సహాయంతో నీటిని తోడుతుండగా, కొన్ని ఏరియాల్లో అపార్ట్‌మెంట్ల నిర్వాహకులే మోటర్ల సహాయంతో నీటిని తోడిపోస్తున్నారు. సుమారు 2000లకుపైగా సెల్లార్లు నీటితో నిండిపోయినప్పటికీ ప్రస్తుతం చాలా వరకు నీరు తొలగిపోవడంతో అపార్ట్‌మెంట్‌ వాసులు ఊపిరి పీల్చుకుంటున్నారు. 

చాలా ప్రాంతాల్లో రోడ్లు, ఇండ్లలోని నీరు తొలగిపోయినప్పటికీ బురద సమస్య వేధిస్తున్నది. ఫలక్‌నుమా, కర్మన్‌ఘాట్‌, మలక్‌పేట్‌, రామంతాపూర్‌ తదితర ప్రాంతాల్లో ఇండ్లు, రోడ్లపై పెద్ద ఎత్తున బురద పేరుకుపోవడంతో దుర్వాసనతో జనం ఇబ్బంది పడుతున్నారు. రామంతాపూర్‌లోని లక్ష్మీనగర్‌, హబ్సిగూడ రవీంద్రనగర్‌కాలనీ, ఉప్పల్‌ నల్లచెరువు పరిసర ప్రాంతాలు, పాతనగరంలోని మూసీ సమీప ప్రాంతాల్లో  సైతం గృహాల్లో బురద పేరుకుపోవడంతో తిప్పలు తప్పడం లేదు. రోడ్లపై బురద, ఇసుక మేటలు వేయడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు వస్తున్నాయి. బల్దియా సిబ్బంది బురద, వ్యర్థాలను తొలగిస్తుండగా, కొంత పొడి వాతావరణం ఏర్పడితే దుర్గంధం తగ్గే అవకాశమున్నది. 

నగరంలో సాధారణ పరిస్థితుల పునరుద్ధరణకు బల్దియా పెద్ద ఎత్తున కృషి చేస్తున్నది. మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు 18 నుంచి నగర వ్యాప్తంగా ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వీధుల్లో పేరుకుపోయిన బురదను తొలగిస్తున్నారు. 7608 చోట్ల పేరుకుపోయిన వ్యర్థాల తొలగింపునకు అదనంగా 277 వాహనాలను వినియోగిస్తున్నారు. వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు బ్లీచింగ్‌ పౌడర్‌ను చల్లుతున్నారు.