శుక్రవారం 27 నవంబర్ 2020
Hyderabad - Oct 28, 2020 , 07:33:47

ఎన్నో అనుకుని.. పోలీసులకు చిక్కిండు

ఎన్నో అనుకుని.. పోలీసులకు చిక్కిండు

  • డబ్బు వస్తే ఇంటికి వెళ్లకుండా జల్సాకు సిద్ధం
  • బీహార్‌కు రైలు టికెట్‌ బుకింగ్‌
  • రాష్ట్రం దాటిన తర్వాత డెడ్‌బాడీ ఆచూకీ చెప్దామనుకున్నడు
  • అథియాన్‌ మృతి కేసు విచారణలో నిందితుడి వెల్లడి

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : బాలుడు అథియాన్‌ చనిపోయిన విషయాన్ని రాష్ట్రం దాటాక చెప్పుదామనుకున్నాడు...రూ.15 లక్షలు కాదు రూ.10 వేలు ఇచ్చినా తీసుకునేవాడు..ఇది శామీర్‌పేట్‌లో ఐదు సంవత్సరాల బాలుడితో కిక్‌ జంపింగ్‌ చేయించి.. అతడి మృతికి కారకుడైన బీహార్‌కు చెందిన మైనర్‌ పోలీసు దర్యాప్తులో వెల్లడించిన ఆసక్తికరమైన విషయం.  శామీర్‌పేట్‌ పీఎస్‌ పరిధిలో వెలుగులోకి వచ్చిన అథియాన్‌ మృతి అంశం తెలిసిందే. అథియాన్‌తో కిక్‌ జంపింగ్‌ చేయిస్తూ.. షేర్‌ చాట్‌లో వీడియో చేస్తుండగా.. బాలుడు చేతులు భూమికి ఆనించి రెండు కాళ్లు ఒక్కసారిగా గాల్లోకి ఎత్తి జంపింగ్‌ చేయాలి.. అలా చేసే క్రమంలో అథియాన్‌ కిందపడి తలకు తీవ్ర గాయమైన గాయం తగిలి మరణించాడు. ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పాల్సిన ఆ మైనర్‌... భయంతో అథియాన్‌ చనిపోయాడని అతడికి మొత్తం టేప్‌ చుట్టేసి ఓ పెద్ద బ్యాగులో వేసుకుని ఉప్పర్‌పల్లి ఓఆర్‌ఆర్‌ వద్ద చెట్ల మధ్యలో పడేసి తిరిగి తన గదికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆదివారానికి బీహార్‌ వెళ్లేందుకు రైలు టిక్కెట్‌ బుక్‌ చేసుకున్నాడు. చోరీ చేసిన ఫోన్‌తో కిడ్నాపర్‌గా మాట్లాడి.. రూ.15 లక్షలు డిమాండ్‌ చేసిన విషయం పోలీసు దర్యాప్తులో వెలుగు చూసిందే. డబ్బు అందగానే  నేరుగా సికింద్రాబాద్‌లో బీహార్‌ రైలు ఎక్కి.. రాష్ట్రం దాటిన తర్వాత చోరీ చేసిన సెల్‌ ఫోన్‌ను స్విచ్‌ ఆఫ్‌లో పెట్టి  రైలు మార్గంలో పడేసేందుకు స్కెచ్‌ వేసుకున్నాడు. అంతకుముందు అథియాన్‌ డెడ్‌ బాడీ ఎక్కడ ఉందో చెప్పుదామనుకున్నాడు. ఇలా... రూ. 15 లక్షలు డిమాండ్‌ చేసిన బీహార్‌ మైనర్‌ చివరికి రూ.10 వేలు కూడా తీసుకునేందుకు సిద్ధమయ్యినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆ డబ్బుతో అటు బీహార్‌లోని ఇంటికి వెళ్లకుండా.. ఏదైన కొత్త ప్రాంతానికి వెళ్లి జల్సా చేయాలని పథకం వేసుకున్నట్లు విచారణలో తెలిపాడు. ఇంతలో పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో అతడిని ఆదివారం అదుపులోకి తీసుకోవడంతో సీన్‌ రివర్స్‌ అయ్యి కటకటాలపాలయ్యాడు.