దేశం గర్విస్తుంది : గవర్నర్

- ఫార్మా క్యాపిటల్‌గా హైదరాబాద్
- వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితం
- గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్
- నిమ్స్‌లో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం
ఖైరతాబాద్, జనవరి 16 : ‘ప్రపంచంలోనే భారతదేశానికి ఘన కీర్తి లభించింది..పది నెలల పాటు ప్రజలను వణికించిన కరోనాకు ముగింపు మొదలైంది..ఇక ఏ దేశంపై ఆధారపడాల్సిన అవసరం లేదు..కరోనా వ్యాక్సిన్ తయారీలో స్వీయ సమృద్ధి సాధించాం.. దేశ ప్రజలంతా గర్వపడాలి’ అని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) దవాఖానలో కరోనా వ్యాక్సినేషన్‌ను శనివారం గవర్నర్ ప్రారంభించారు. తొలి టీకా నిమ్స్ అన్‌స్కిల్డ్ వర్కర్ కె. చంద్రకళకు గవర్నర్ సమక్షంలో వేశారు. ఆమెతోపాటు కార్డియో థోరాసిక్ సర్జన్ డాక్టర్ ఎం. అమరేశ్ రావు, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్. లక్ష్మీభాస్కర్ తదితరులకు వ్యాక్సినేషన్ చేశారు. అనంతరం గవర్నర్ మీడియాతో మాట్లాడారు. శాస్త్రవేత్తల కృషి ఫలితంగా ఏ దేశంపై ఆధారపడకుండా స్వీయ వ్యాక్సిన్ తయారు చేసుకున్నామన్నారు. వ్యాక్సిన్‌పై ఎలాంటి అపోహలు అవసరం లేదని, ఇది గర్వపడాల్సిన సమయమన్నారు. తెలంగాణలోని హైదరాబాద్ నగరంలో ఈ వ్యాక్సిన్ రూపుదిద్దుకోవడం కొత్త శఖానికి తెర లేచిందని, నగరం ఫార్మా క్యాపిటల్‌గా రూపాంతరం చెందిందని, ఇక్కడి నుంచి 150 దేశాలకు వివిధ రకాల మందులను ఎగుమతి చేస్తున్న ఘనత దక్కిందన్నారు.
ప్రధాని ఆదేశాల మేరకు ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు టీకా వేసిన తర్వాత, ప్రజలందరికీ అందిన తర్వాతే తాను వేసుకుంటానని స్పష్టం చేశారు. వ్యాక్సిన్ వేసుకున్న వారికి ఇప్పటి వరకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కనబడలేదని, ఏమైనా లక్షణాలు కనబడితే వారికి తక్షణ సేవలందించేందుకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారన్నారు. రెండో డోస్ తీసుకున్న తర్వాత మరింత రక్షణ కవచం లభిస్తుందన్నారు. గవర్నర్ వెంట నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె. మనోహర్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నిమ్మ సత్యనారాయణ, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్లు డాక్టర్ కృష్ణా రెడ్డి, డాక్టర్ లక్ష్మీభాస్కర్, జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ వైఎస్ఎన్ రాజు, లైజనింగ్ ఆఫీసర్ డాక్టర్ మార్త రమేశ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం టీకా వేసుకున్న ప్రతి ఒక్కరికీ రాజముద్రతో కూడిన ప్రశంస పత్రం, ఒక గులాబీ పువ్వును రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ అందజేశారు.