e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home హైదరాబాద్‌ వేదికొక్కటే.. సేవలు అనంతం!

వేదికొక్కటే.. సేవలు అనంతం!

వేదికొక్కటే.. సేవలు అనంతం!
 • కొవిడ్‌ రోగుల కోసం ఓ యాప్‌..
 • రూపొందించిన నలుగురు హైదరాబాదీలు
 • డిజిటల్‌ ప్ల్లాట్‌ ఫాంపై వైద్యం, ఆక్సిజన్‌, మందుల వివరాలు
 • ప్రారంభించిన 20 రోజుల్లోనే 3.30 లక్షల మందికి చేరువ

కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ సుడిగాలిలా చుట్టుముడుతున్నది. దేశ వ్యాప్తంగా విలయ తాండవం చేస్తున్నది. వైద్యశాలల్లో బెడ్లు దొరకక, ఆక్సిజన్‌ లభించక అనేక మంది అవస్థలు పడుతున్నారు. కొంతమంది ప్రాణాలను కోల్పోతున్నారు. ఆ ఆర్తనాదాలను చూసిన మానవతాహృదయులు చలించి తమకు తోచిన విధంగా, తమకు చేతనైన రీతిలో బాధితులకు అండగా నిలుస్తున్నారు. విపత్కర పరిస్థితుల్లో ఆపన్నహస్తం అందిస్తూ బాసటగా నిలుస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన పలువురు యువకులు సైతం తమవంతుగా సేవలను అందిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. ఏకంగా కొవిడ్‌ బాధితులకు అండగా నిలబడేందుకు వెబ్‌ అధారిత యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చి సేవలను అందిస్తున్నారు. వారి సేవలపై ‘నమస్తే తెలంగాణ’ కథనం..

ఒక్క క్లిక్‌తో సమస్త సమాచారం..

కొవిడ్‌ బాధితులకు అత్యవసరమైన సేవలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని http:// hydco vidresources.com యాప్‌లో పొందుపరిచారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆక్సిజన్‌ దొరికే సెంటర్లు.. అంబులెన్స్‌ సర్వీసుల వివరాలు.. వివిధ వైద్యశాలల్లో అందుబాటులో ఉన్న బెడ్లు.. కొవిడ్‌ టెస్ట్‌, వ్యాక్సినేషన్‌ సెంటర్లు.. అత్యవసర మందులు లభించే షాప్‌లు.. బ్లడ్‌, పాస్లా బ్యాంకులు, ఉచిత భోజనం అందిస్తున్న సంస్థలు, ఒకవేళ కరోనా బారిన పడి చనిపోయినవారికి అంత్యక్రియలను నిర్వహించే వ్యక్తులు, సంస్థలు ఇలా అన్ని సేవలకు సంబంధించిన వివరాలను ఒకే వేదికపై పొందుపరిచారు. మానసిక రుగ్మతలకు అందిస్తున్న వైద్యసేవలను సైతం అందులో పరిచారు. అంతేకాక రక్తదానం, ప్లాస్మా ఆవశ్యకతను వివరిస్తూ ఆ దిశగా యువతను ప్రోత్సహిస్తున్నారు. మరోవైపు సీఎం, పీఎం రిలీఫ్‌ ఫండ్‌కు విరాళాలను అందించాలని అవగాహన కల్పిస్తున్నారు.

ఎప్పటికప్పుడు ఆప్‌డేట్‌..

యాప్‌ను రూపొందించి వదిలేయకుండా నిరంతరం వలంటీర్లు పర్యవేక్షిస్తున్నారు. సోషల్‌మీడియా, ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా ద్వారా సేకరించిన వివిధ స్వచ్ఛంద సంస్థలు, అవి అందిస్తున్న సేవలను తెలుసుకుంటూ, వారి నుంచి వివరాలు, కాంటాక్ట్‌ నెంబర్లను తీసుకుంటూ ఏరోజుకా రోజు యాప్‌ నమోదు చేస్తున్నారు. అదేవిధంగా ఆయా సంస్థలకు ఎప్పటికప్పుడు ఫోన్లు చేస్తూ అందుబాటులో ఉన్న వసతులు తెలుసుకుంటూ ఆ సమాచారాన్ని కూడా యాప్‌లో పొందుపరుస్తుండటం అభినందనీయం.

ఒక్కరోజులోనే యాప్‌..

 • హైదరాబాద్‌కు చెందిన మేధా సోషల్‌వర్క్‌లో మాస్టర్‌ డిగ్రీ పూర్తి చేశారు.
 • ప్రస్తుతం నగరంలోని ఓ బహుళజాతి కంపెనీలో కన్సల్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
 • కరోనా బాధితుల కష్టాలను చూసి చలించిపోయిన ఆమె తొలుత కరోనా రోగులకు ఉచిత సేవలను అందిస్తున్న వివిధ స్వచ్ఛంద సంస్థల వివరాలను సేకరించి గూగుల్‌లో షీట్‌లో అప్‌లోడ్‌ చేసింది.
 • ఇది చూసిన నగరానికి చెందిన మరో యువతి, లాయర్‌ వెన్సీ కృష్ణ ముందుకొచ్చింది.
 • మేధాను ఫోన్‌లో సంప్రదించింది. గూగుల్‌ షీట్‌ కాకుండా వెబ్‌ అధారిత యాప్‌ను రూపొందిద్దామని ప్రతిపాదించింది.
 • అది నచ్చడంతో వెంటనే ఆ పనిలో నిమగ్నమయ్యారు.
 • మరో మిత్రుడు, ఎకనామిస్ట్‌ అభిషేక్‌ అనిరుధన్‌ సాయంతో ఒకే రోజులో ‘హైదరాబాద్‌ కొవిడ్‌ రీసోర్స్‌’ పేరిట యాప్‌ను రూపొందించడమే గాక ఆవిష్కరించారు.
 • 20 రోజుల్లోనే 3 లక్షల 30వేల మందికి పైగా యాప్‌ చేరువ కావడం గమనార్హం.
 • ఇక యాప్‌ నిర్వహణకు ప్రస్తుతం మొత్తంగా 70 మందికి పైగా వలంటీర్లు సేవలను అందిస్తున్నారు.
 • వారంతా విభిన్న రంగాల్లో పని చేస్తున్న వారు, ఉన్నత విద్యావంతులు కావడం గమనార్హం.
 • ఓ వైపు తమ రోజువారీ పనులను చేసుకుంటూనే మరోవైపు సామాన్యుల కోసం యాప్‌ను నిర్వహిస్తున్నారు.

కేటీఆర్‌ ప్రశంసించడం గర్వంగా ఉంది..

 • కొవిడ్‌ బారిన పడిన సామాన్యుల కష్టాలను చూడలేకపోయిన. వారికి నా వంతుగా ఏదైనా సాయం చేయాలని నిర్ణయించుకున్నా.
 • ఆలోచన రాగానే అన్ని స్వచ్ఛంద సంస్థల వివరాలు సేకరించి పోస్టు చేశా.
 • దీంతో అనేక మంది ముందుకు వచ్చారు. మాతో కలిసి పని చేశారు. అందరం కలిసి సమష్టిగా సేవలు అందిస్తున్నాం.
 • యాప్‌ సమాచారం తెలుసుకున్న మంత్రి కేటీఆర్‌ మమ్మల్ని ప్రశంసిస్తూ ట్విట్‌ చేశారు.
 • అది మరువలేం. భవిష్యత్‌లోనూ ఇలాంటి సేవలను కొనసాగిస్తాం. – మేధా

సామాన్యులకు ఎంతో మేలు..

హైదరాబాద్‌ కొవిడ్‌ రీసోర్స్‌ యాప్‌ సామాన్యులకు ఎంతగానో ఉపకరిస్తున్నది. ఆపద వేళ ఎంతో మందికి కావాల్సిన సమాచారాన్ని అందిస్తున్నది. సాయం పొందిన వాళ్లు ప్రత్యేకంగా ఫోన్‌ చేసి కృతజ్ఞతలు తెలుపుతుంటే ఎంతో సంతృప్తిగా ఉన్నది. – కిరణ్‌చారి, అంతర్జాతీయ క్రీడాకారుడు

ఆ బాధను స్వయంగా అనుభవించా..

కొద్దిరోజుల క్రితం మా అమ్మ కొవిడ్‌ బారిన పడ్డారు. ఆ సమయంలో ఆ బాధను స్వయంగా అనుభవించా. ఎక్కడ బెడ్లు దొరుకుతాయో? ఎలాంటి సేవలు అందుతాయోనని సమాచారం తెలియక ఇబ్బందులు పడ్డాం. అందుకే యాప్‌ను రూపొందించాలని నిర్ణయించుకున్నా. మేధా, ఇతర మిత్రులతో కలిసి దీనిని రూపొందించాం. మా వంతుగా చేస్తున్న ఈ చిరుసాయం నలుగురికి ఉపయోగపడుతున్నందుకు ఆనందంగా ఉంది. – వెన్సీ కృష్ణ, లాయర్‌

ఇతర రాష్ట్రాల వారు అడుగుతున్నారు..

మేం రూపొందించిన యాప్‌కు విశేష స్పందన లభిస్తుంది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పాటు, బెంగళూర్‌, ఆంధ్రప్రదేశ్‌ తదితర రాష్ట్రాల వారు కూడా ముందుకు వస్తున్నారు. మరో యాప్‌ను రూపొందించాలని కోరుతున్నారు. ఈ మధ్యనే సుమారు 20 మందితో వర్చువల్‌ మీటింగ్‌ నిర్వహించాం. వెబ్‌ ఆధారిత యాప్‌ను రూపొందించడంపై అవగాహన కల్పించాం. యాప్‌ సేవలను భవిష్యత్‌లో విస్తరిస్తాం. – అభిషేక్‌, అనిరుధన్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వేదికొక్కటే.. సేవలు అనంతం!

ట్రెండింగ్‌

Advertisement