గురువారం 03 డిసెంబర్ 2020
Hyderabad - Oct 30, 2020 , 06:59:54

హుస్సేన్‌సాగర్‌ నాలాకు రిటైనింగ్‌ వాల్‌

హుస్సేన్‌సాగర్‌ నాలాకు రిటైనింగ్‌ వాల్‌

  • రూ.68.40కోట్లు కేటాయింపు
  • నల్లకుంట రత్నానగర్‌కు తీరనున్న సమస్య
  • నాలా పరీవాహక ప్రాంతాల్లో పర్యటించిన మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌

అంబర్‌పేట : హుస్సేన్‌సాగర్‌ నుంచి మూసీ వరకు ఉన్న నాలా పటిష్టత, అభివృద్ధికి రూ.68.40కోట్ల నిధులతో పనులు చేపడుతున్నట్లు జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తెలిపారు. వరద బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు ఇటీవల నల్లకుంట డివిజన్‌ రత్నానగర్‌లో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ పర్యటించారు. ఈ సందర్భంగా రత్నానగర్‌ బస్తీని ఆనుకొని రిటైనింగ్‌ వాల్‌ నిర్మించి, ఈ ప్రాంతంలోని కాలనీల వరద ముంపు సమస్యను పరిష్కరిస్తానని మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు. తదనుగుణంగా కేటీఆర్‌ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌, స్థానిక కార్పొరేటర్‌ గరిగంటి శ్రీదేవిరమేశ్‌, జోనల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఇరిగేషన్‌ అధికారులతో కలిసి నల్లకుంటలో మేయర్‌ పర్యటించారు. వరద ముంపునకు గురవుతున్న కాలనీల కుటుంబాలతో మేయర్‌ మాట్లాడారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు హుస్సేన్‌సాగర్‌ నుంచి మిగులు జలాలు ప్రవహిస్తున్న రత్నానగర్‌ నాలాకు పొడవున రిటైనింగ్‌ వాల్‌ను నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ పర్యటనలో నీటి పారుదల విభాగం రిటైర్డ్‌ ఎస్‌ఈ వై.శేఖర్‌రెడ్డి, ఈఈ రేణుక, ఏఈ రాజేశ్‌ తదితరులు పాల్గొన్నారు.