ఆదివారం 07 మార్చి 2021
Hyderabad - Jan 22, 2021 , 07:37:17

కత్తితో పొడిచి.. గొంతు కోశాడు

కత్తితో పొడిచి..  గొంతు కోశాడు

శేరిలింగంపల్లి : భార్య మరొకరితో తిరుగుతుందని అనుమానం పెంచుకున్నాడు.. పలుమార్లు ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించాడు.. ఈ క్రమంలో మాటామాటా పెరిగి కత్తితో భార్య కడుపులో పొడిచి, గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు. గతంలో మరో ఇద్దరితో వివాహమై.. మనస్ఫర్థలతో విడిపోయి.. మూడో పెండ్లి చేసుకున్న భర్త చేతిలో చివరికి హతమైంది. ఈ సంఘటన రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్నది. ఇన్‌స్పెక్టర్‌ రవీందర్‌ కథనం ప్రకారం... మహారాష్ట్ర, నాందేడ్‌ జిల్లా, ఇస్లాంపురా కాలనీకి చెందిన ఫర్హానా ఖురేషీ (25)కి గతంలో రెండు పెండ్లిళ్లు జరగగా మనస్ఫర్థలతో వారితో విడిపోయింది. ముగ్గురు పిల్లలు ధనేష్‌ ఖురేషీ (13), తమన్నా ఫాతిమా (12), ఫర్వేజ్‌ ఖురేషీ (9)తో కలిసి నివాసం ఉంటుంది. కాగా.. ఫర్హానా స్నేహితులు కర్ణాటకలో ఉండటంతో తరచూ అక్కడికి వెళ్లి వస్తున్న క్రమంలో కర్ణాటక, బీదర్‌ జిల్లా హోమ్నాబాద్‌కు చెందిన మహ్మద్‌ మోహిషీన్‌ ఖాన్‌ (31)తో పరిచయం ఏర్పడింది. గత 2 సంవత్సరాలుగా కొనసాగిన పరిచయం ప్రేమగా మారి సహజీవనానికి దారి తీసింది.

దీంతో 5 నెలల క్రితం వారిద్దరు నగరానికి వచ్చి వివాహం చేసుకున్నారు. ముగ్గురు పిల్లలతో కలిసి ఫర్హానా భర్తతో కలిసి గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో నివాసం ఉంటుంది. మోహసీన్‌ ఖాన్‌ కిరోసిన్‌ డీలర్‌గా పనిచేస్తున్నాడు. కొన్ని రోజులు మంచిగానే ఉన్న తర్వాత ఇటీవల వారిమధ్య విబేధాలు ఏర్పడ్డాయి. భార్య ప్రవర్తనలో మార్పు వచ్చిందని, మరొకరితో తిరుగుతుందని అనుమానం పెంచుకుని.. తరచూ ఆమెతో గొడవపడుతుండేవాడు. ఈ అనుమానం పెనుభూతంగా మారింది. ఈ క్రమంలో  రాత్రి 11 గంటల ప్రాంతంలో మోహసీన్‌.. భార్యను ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించగా.. వారి మధ్య మాటామాటా పెరిగింది. ఈ క్రమంలో ఆవేశంతో మోహసీన్‌... కత్తితో భార్య కడుపులో పొడిచి, గొంతు కోసి హత్య చేశాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.  వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. నిందితుడిని అరెస్ట్‌చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

VIDEOS

logo