శుక్రవారం 04 డిసెంబర్ 2020
Hyderabad - Sep 06, 2020 , 00:07:41

బోగీకి వందమందే

బోగీకి వందమందే

రేపటి నుంచి అందుబాటులోకి మెట్రో సేవలు

ఏర్పాట్లు పరిశీలించిన ఎన్వీఎస్‌ రెడ్డి, ఎల్‌అండ్‌టీ ప్రతినిధులు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఐదు నెలల విరామం తర్వాత నగరంలో మెట్రో సర్వీసులు సోమవారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి, ఎల్‌అండ్‌టీ మెట్రో ఎండీ కేవీబీరెడ్డిలతో కూడిన అధికారుల బృందం అమీర్‌పేట ఇంటర్‌ చేంజ్‌ స్టేషన్‌లో ఏర్పాట్లను పరిశీలించింది. కరోనా నేపథ్యంలో తీసుకుంటున్న చర్యల గురించి ఈ సందర్భంగా వారు వివరించారు.

మూడు రోజుల్లో మూడు కారిడార్లు : ఎన్వీఎస్‌రెడ్డి

ఒకే రోజు కాకుండా మూడురోజుల్లో మూడు కారిడార్లను ప్రారంభించనున్నామని ఎన్వీఎస్‌రెడ్డి వెల్లడించారు. ఈ నెల 7న మియాపూర్‌ - ఎల్బీనగర్‌, 8న నాగోల్‌ - రాయదుర్గం, 9న జేబీఎస్‌ - ఎంజీబీఎస్‌ మార్గాల్లో మెట్రోరైళ్లను నడపనున్నామని ఎన్వీఎస్‌రెడ్డి వెల్లడించారు. సోమ, మంగళవారాల్లో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 నుంచి రాత్రి 9 వరకు మాత్రమే రైళ్లను నడపనుండగా, బుధవారం నుంచి మాత్రం ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు అంతరాయం లేకుండా సర్వీసులను నడుతామన్నారు. బోగీకి వందమంది చొప్పున మొత్తం 300ల మందినే అనుమతిస్తామని, ప్రతీ ఐదు నిమిషాలకు సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు. ఇప్పటికే మాక్‌డ్రిల్స్‌ నిర్వహించి ఆపరేషన్స్‌కు సన్నాహకాలు చేశామన్నారు. ప్రయాణికుల రద్దీ, పార్కింగ్‌ ఏర్పాట్లపై సమీక్షించామని  తెలిపారు. ఇండియన్‌ సొసైటీ ఆఫ్‌ హీటింగ్‌, రిఫ్రిజిటేరింగ్‌ అండ్‌ ఏయిర్‌ కండిషనింగ్‌ ఇంజినీర్స్‌ (ఇష్రీ) మార్గదర్శకాల ప్రకారం టెర్మినల్‌ స్టేషన్లల్లో రైళ్లను ఎక్కువసేపు నిలిపి, తలుపులన్నింటిని తెరిచి ఉంచుతున్నామని తెలిపారు. ఫలితంగా రైళ్లల్లో 75శాతం స్వచ్ఛగాలి లభించే అవకాశముందన్నారు. కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించిన గాంధీ దవాఖాన, భరత్‌నగర్‌, మూసాపేట, ముషీరాబాద్‌, యూసుఫ్‌గూడ స్టేషన్లలో రాకపోకలు నిషేధించారు. 

ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి : కేవీబీరెడ్డి

5 నెలల సుధీర్ఘ విరామం తర్వాత మెట్రోరైళ్లను నడపబోతున్నామని ఎల్‌అండ్‌టీ మెట్రో ఎండీ కేవీబీరెడ్డి తెలిపారు. స్టేషన్లలో మార్కింగ్‌ చేసిన చోటే నిలబడాలని, సెక్యూరిటీ, వలంటీర్ల సూచనలు పాటిస్తూ వారికి సహకరించాలని ప్రయాణికులకు సూచించారు. ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని, గ్రీన్‌జోన్‌ ప్రాంతాల్లోనే రాకపోకలు సాగించాలన్నారు. రద్దీకనుగుణంగా రైళ్లను నడపనున్నామని పేర్కొన్నారు. ప్రతీ 4 గంటలకోసారి స్టేషన్లను, రాత్రివేళ రైళ్లను శానిటైజ్‌ చేస్తామని తెలిపారు.