ఉస్మాన్ సాగరం వందేళ్ల సంబురం

- ఉస్మాన్‌సాగర్ నిర్మాణానికి వందేండ్లు
- మీర్ ఉస్మాన్ అలీఖాన్ పేరుపై ఉస్మాన్సాగర్గా నామకరణం
- గండిపేట చెరువుగానూ ఖ్యాతి
- వందేండ్ల కిందట వరదలతో నగరం అతలాకుతలం
- వరద ముప్పును తప్పించేందుకు చెరువు నిర్మాణం
- రూ.55 లక్షల వ్యయం.. ఏడేండ్లలో పూర్తి
- నూరేళ్లుగా నగరవాసుల దాహార్తిని తీర్చుతున్న జలాశయం
సిటిబ్యూరో, జనవరి 20 (నమస్తేతెలంగాణ) : ఒక మహాప్రళయం మరో మహాప్రస్తానానికి నాంది పలికింది. అద్భుతమైన మానవనిర్మిత అతి సుందరమైన జలాశయాన్ని ఆవిష్కరించింది. దశాబ్దాలుగా జంటనగరవాసుల దాహార్తిని తీర్చుతూ గతానుభవాల స్మృతిని నలుదిశలా చాటుతున్నది. అదే అతిపురాతమైన ఉస్మాన్‌సాగర్ అలియాస్ గండిపేట చెరువు. ఈ అద్భుత కట్టడం ఈ ఏడాదితో శతవసంతాలను పూర్తి చేసుకుంటున్నది. అనేక ప్రత్యేకతల కలబోతలను సంతరించుకున్న ఈ చెరువు ప్రస్థానంపై ప్రత్యేక కథనం.
1908 నాటి వరదలతో కలత చెంది..
6వ నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ హయాంలో 1908లో మూసీకి భారీగా వరద పోటెత్తింది. సెప్టెంబర్ 27,28 తేదీల్లో రెండురోజులపాటు కురిసిన వర్షం హైదరాబాద్ నగర చరిత్రలోనే అతిపెద్ద వరదగా రికార్డులకెక్కింది. మూసీకి రెండువైపులా సుమారు 800 చదరపు మైళ్ల పరీవాహక ప్రాంతంలో దాదాపు 19వేల ఇండ్లు నేలమట్టమయ్యాయి. 80వేల మంది నిరాశ్రయులయ్యారు. 10 నుంచి 15వేల మంది వరదల్లో గల్లంతుకాగా, అప్పట్లోనే రూ.3 కోట్ల వరకు ఆస్తినష్టం వాటిల్లిందని అంచనా. వరద తగ్గుముఖం పట్టిన తర్వాత నగరంలో ఎటుచూసినా కూలిన ఇండ్లు, బండరాళ్లు, శవాల గుట్టలు చూసి నిజాం రాజు మీర్ మహబూబ్ అలీఖాన్ తీవ్రంగా చలించిపోయారు. భవిష్యత్‌లో మరోసారి ఇలాంటి వరదలు నగరాన్ని ముంచెత్తకుండా చర్యలు చేపట్టాలని సంకల్పించారు. వరద ముప్పు నివారణకే కాకుండా, నగర సమగ్రాభివృద్ధికి, మెరుగైన డ్రైనేజీ వ్యవస్థను పకడ్బందీగా చేపట్టాలని భావించారు.
సాగరానికి సరికొత్త అందం
- రూ.30 కోట్లతో పార్కు నిర్మాణం
- మార్చి నాటికి తొలిదశ పనులు పూర్తి
- మరింత పెరగనున్న పర్యాటకుల తాకిడి
వందేండ్లు పూర్తి చేసుకున్న గండిపేటకు మరింత పర్యాటక శోభ రానుంది. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) సుమారు రూ.30 కోట్లతో అత్యాధునిక పార్కు నిర్మాణం చేపట్టబోతోంది. కరోనా కారణంగా పనుల్లో జాప్యం జరిగినా ప్రస్తుతం ముమ్మరంగా జరుగుతున్నాయి. మార్చి నాటికి తొలిదశ పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకొని పనులు చేస్తున్నారు. సుమారు 16 ఎకరాల్లో అత్యాధునిక శైలిలో ల్యాండ్‌స్కేప్‌తో పార్కు నిర్మిస్తున్నారు. ల్యాండ్ స్కేపింగ్ డిజైన్లను ప్రముఖ ఆర్కిటెక్ట్‌లు రూపొందించారు. అమితంగా ఆకట్టుకునేలా రకరకాల ఫీచర్లతో పార్కు ప్రవేశ ద్వారం, టికెట్ గదులు, ఎంట్రెన్స్ పెవిలియన్, డ్రైవ్వే, పార్కింగ్ సౌకర్యం వంటివి ఏర్పాటు చేస్తున్నారు. ఇవేగాక ఆర్ట్ పెవిలియన్, కిడ్స్‌ప్లే ఏరియా,పబ్లిక్ ఏరినా, వాటర్ ఫ్రంట్ లైన్ డెవలప్మెంట్, హంపి థియేటర్లు, బోర్డు వాక్, వ్యూయింగ్ డెక్స్ అండ్ జెట్టీస్,ఫుడ్‌కోర్టులు, స్కేటింగ్ జోన్, వాక్‌వేస్, టెర్రస్ గార్డెన్స్ అండ్ పిక్నిక్ స్పాట్లను అభివృద్ధి చేస్తున్నారు. మొదటి దశను మార్చి నాటికి, ఆ తర్వాత దశల వారీగా మిగతా పనులు పూర్తి చేస్తామని హెచ్ఎండీఏ ఇంజనీరింగ్ విభాగం అధికారులు తెలిపారు.
ఐటీ కారిడార్‌కు అత్యంత సమీపంలో..
ఐటీ రంగం అభివృద్ధితో హైదరాబాద్ పశ్చిమం శరవేగంగా విస్తరిస్తోంది. ఐటీ కారిడార్‌లోని మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, నానక్‌రాంగూడ, కోకాపేట వంటి ప్రాంతాలకు సమీపంలోనే గండిపేట జలాశయం ఉంది. జూబ్లీహిల్స్,బంజారాహిల్స్ తరహాలో గండిపేట కింద భాగంలో పదుల సంఖ్యలో గేటెడ్ కమ్యూనిటీలు వెలిశాయి. ఐటీ రంగంతోపాటు సినీ, వ్యాపారరంగాలకు చెందిన వారికి గండిపేట చుట్టుపక్కల ప్రాంతాలు నివాస కేంద్రాలు మారాయి. హుస్సేన్‌సాగర్ తరహాలో గండిపేటను ప్రముఖ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు హెచ్ఎండీఏ పనులు చేపడుతోంది.
సర్కారీ నల్లా..చౌబీస్ ఘంటే ఖుల్లా
ఉస్మాన్సాగర్ను ప్రధానంగా హైదరాబాద్‌కు వరద ముప్పు నుంచి తప్పించేందుకు నిర్మించడంతో నగరవాసుల భవిష్యత్ తాగునీటి అవసరాలకు కూడా ఉపయోగపడేలా దీనిని తీర్చిదిద్దారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన నాటి నుంచి దశాబ్దాల కాలంపాటు 1980వ దశకం వరకు జంటనగరాల తాగునీటి అవసరాలు తీర్చడంలో హిమాయత్‌సాగర్‌తోపాటు ఉస్మాన్‌సాగర్ కూడా కీలక పాత్ర పోషించింది. ఈ రెండు జంట జలాశయాలు నగరవాసి దాహార్తిని తీరుస్తున్నాయని చెప్పొచ్చు. అప్పట్లో 24 గంటల పాటు నీళ్లు వచ్చేవని పెద్దలు ఇప్పటికీ చెబుతుంటారు. అందుకే ‘సర్కారీ నల్లా చౌబీస్ ఘంటే ఖుల్లా’ అనే సామెత కూడా ఉంది.
పర్యాటక ప్రాంతంగానూ..
వరదను తట్టుకొని నిలబడి తాగునీటిని ఇస్తున్న గండిపేట జలాశయం ప్రస్తుతం పర్యాటక ప్రాంతంగానూ విలసిల్లుతున్నది. వివిధ రకాల స్వదేశీ, విదేశీ పక్షుల కిలకిలరావాలతో సాగర్ అలరారుతున్నది. వారాంతాలు, సెలవుదినాల్లో ఇదొక పిక్నిక్‌స్పాట్‌గా మారిపోయింది.
ఇద్దరు ప్రఖ్యాత ఇంజినీర్ల మేధోమథనం
నిజాం తన ఆలోచనను ఆచరణలో పెట్టేందుకు అందుకు సమర్థులైన, ప్రఖ్యాతిగాంచిన ఇద్దరు ఇంజినీర్లను ఎంచుకున్నారు. ఒకరు భారతరత్న బిరుదాంకితుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య కాగా, మరొకరు అలీ నవాజ్ జంగ్. మొదట అప్పటి నిజాం ప్రధాని కిషన్ ప్రసాద్ సలహా మేరకు విశ్వేశ్వరయ్యను హైదరాబాద్‌కు ఆహ్వానించారు. వరద నివారణకు సంబంధించి సలహాలు ఇవ్వాలని కోరగా, సమ్మతించి 1909లో కన్సల్టింగ్ ఇంజినీరుగా బాధ్యతలు తీసుకున్నారు. వెంటనే సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డు (సీఐబీ)ను ఏర్పాటు చేశారు. విశ్వేశ్వరయ్యకు సహయకుడిగా అలీ నవాజ్జంగ్ను నియమించారు. కాగా ఇందులో అతిముఖ్యపాత్రను పోషించింది అలీ నవాజ్‌జంగ్ కావడం విశేషం. సహాయ ఇంజినీర్‌గా అలీ నవాజ్‌జంగ్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి మూసీ నది పరీవాహక ప్రాంతాలను సమగ్రంగా సర్వే చేసి సమగ్ర నివేదికలను రూపొందించారు. సాంకేతిక అంశాలన్నింటినీ పరిశీలించారు. వాటన్నింటినీ విశ్లేషించారు. ఎగువన తాండూరు, వికారాబాద్, మొయినాబాద్ తదితర ప్రాంతాల నుంచి వస్తున్న వరద ఉధృతితో హైదరాబాద్ నగరానికి ముప్పు ఏర్పడుతున్నదని గుర్తించారు. దాదాపు మూడేండ్లపాటు సుదీర్ఘ ఇద్దరు ఇంజినీర్లు మేధోమథనం సాగించి చివరకు మూసీకి ఎగువన జలాశయాన్ని నిర్మించాలని ప్రతిపాదించారు.
ఉస్మాన్ అలీఖాన్ శంకుస్థాపన..
1911 సెప్టెంబర్ మాసంలో మహబూబ్ అలీఖాన్ మృతిచెందడంతో 7వ నిజాం రాజుగా మీర్ ఉస్మాన్ అలీఖాన్ పట్టాభిషేకమయ్యారు. ప్రాజెక్టుకు సంబంధించిన సర్వే వివరాలు,ప్రతిపాదలను,విశ్లేషణలను సమగ్ర రూపొందించి మీర్ ఉస్మాన్ అలీఖాన్‌కు ఇంజినీర్లు సమర్పించగా, వాటిలో ఎలాంటి మార్పుల్లేకుండా వెంటనే ఆమోదించారు. దీంతో మూసీ నదిపై జలాశయ నిర్మాణానికి తొలి అడుగుపడింది. ఆ తర్వాత హైదరాబాద్‌కు పశ్చిమభాగంలో 9 కిలోమీటర్ల ఎగువన ప్రతిపాదిత గండిపేట ప్రాంతంలో మూసీ నదికి అడ్డంగా 3.7 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో జలాశయాన్ని నిర్మించాలని నిర్ణయించారు. అలా 1913 మార్చి 23న నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ చెరువు ఆనకట్ట నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఏడేళ్లలో పూర్తి చేసి 1920 డిసెంబర్ నాటికి అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనికి అప్పట్లోనే రూ.55 లక్షలను నిజాం ప్రభుత్వం ఖర్చు చేసింది.
విశిష్టతల సమాహారం
ఉస్మాన్‌సాగర్ ప్రాజెక్టుకు అనేక విశిష్టతలు ఉన్నాయి. సాధారణంగా ఏ ప్రాజెక్టునైనా నదికి అడ్డంగా నిర్మిస్తారు. కానీ ఉస్మాన్‌సాగర్ ప్రాజెక్టును ఇందుకు భిన్నంగా నిర్మించారు. ప్రాజెక్టు మొత్తం వైశాల్యం 49 చదరపు కిలోమీటర్లు కాగా, జలాశయం వైశాల్యం 26 చదరపు కిలోమీటర్లు. నదిలోకి వచ్చే వరదను ఒడిసిపట్టి నిల్వ చేసేందుకు వీలుగా, అదనపు జలాలు సాఫీగా ముందుకు సాగిపోయేలా దీనిని డిజైన్ చేయడం విశేషం. అదీగాక రాళ్లను ఒక ప్రత్యేకమైన ఆకృతిలో చెక్కి కట్టను నిర్మించడం మరో విశేషం. ప్రపంచంలోని మానవ నిర్మిత చెరువుల్లో ఇదొకటని ఘంటాపథంగా చెప్పొచ్చు. ఉస్మాన్ అలీఖాన్ హయాంలో నిర్మించడం వల్ల ఉస్మాన్‌సాగర్ అని, గండిపేట ప్రాంతంలో నిర్మించినందు వల్ల గండిపేట చెరువుగా విరాజిల్లుతున్నది.
వారసత్వ చిహ్నంగా సాగర్ మహల్
ఉస్మాన్‌సాగర్‌కు ఎదుట నిర్మించిన సాగర్ మహల్‌కు ప్రత్యేక ఉంది. ప్రాజెక్టు నిర్మించిన సందర్భంలోనే ఈ మహల్‌ను నిర్మించారు. నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ తన వేసవి విడిది కోసం నిర్మించడమేగాక, విదేశీ రాయబారులు, అతిథులతో ఇక్కడే సమావేశయ్యారు. ఈ సాగర్ మహల్ మీద నుంచి ప్రాజెక్టు అందాలను ఆస్వాదించవచ్చు. ఒకరకంగా వ్యూపాయింట్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ సాగర్ మహల్ వారసత్వ చిహ్నం జాబితాలో చేరగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నది.
తాజావార్తలు
- చదువులమ్మను చట్టసభకు పంపుదాం..
- మహిళా లోకం.. వాణీదేవి వైపే
- బాధ్యతాయుతంగా పనిచేయాలి
- సంక్షేమ పథకాలను వివరించాలి
- అన్నిపార్టీలు అక్కడే తిష్ట.. దూకుడుగా గులాబీ
- మీటర్లు తిరుగుతున్నయ్..
- నిత్యం పచ్చతోరణం
- జిల్లాలో గ్రోత్ మానిటరింగ్ డ్రైవ్ పూర్తి
- కాసులు కురిపిస్తున్న.. కార్గో సేవలు
- పని చేస్తున్న ఇంటికే కన్నం ..