బుధవారం 25 నవంబర్ 2020
Hyderabad - Oct 30, 2020 , 07:10:19

ఓఆర్‌ఆర్‌ లోపలి గ్రామాల్లో.. త్వరలో ఇంటింటి సర్వే

ఓఆర్‌ఆర్‌ లోపలి గ్రామాల్లో.. త్వరలో ఇంటింటి సర్వే

నీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థల బలోపేతం దిశగా జలమండలి చర్యలు 

శరవేగంగా పెరుగుతున్న పట్టణీకరణ దృష్ట్యా తాగునీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగా  ఔటర్‌ రింగు రోడ్డు లోపల ఉన్న గ్రామాల్లో జలమండలి ఇంటింటి సర్వే చేపట్టేందుకు సమాయత్తమవుతున్నది. జనాభాకు అనుగుణంగా మెరుగైన నీటి సరఫరా, ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, సీవరేజీ తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని సర్వే చేపట్టనున్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని 190 గ్రామ పంచాయతీలకు సమృద్ధిగా తాగునీరందిస్తున్నది. అర్బన్‌ మిషన్‌ భగీరథలో భాగంగా రూ.756 కోట్లు ఖర్చు పెట్టి 162 రిజర్వాయర్లు, 2 వేల కిలోమీటర్ల మేర పైపులైన్‌ విస్తరణ పనులు చేపట్టారు. సుమారు రెండు లక్షల నల్లాలకు నీటిని అందిస్తున్నది.  కుత్బుల్లాపూర్‌, శామీర్‌పేట, కీసర, ఘట్‌కేసర్‌, హయత్‌నగర్‌,  ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, సరూర్‌నగర్‌, శంషాబాద్‌, రాజేంద్రనగర్‌, పటాన్‌చెరువు, ఆర్‌సి పురం మండలాల పరిధిలోని జలమండలి ఇంటింటి సర్వే ప్రక్రియ జరగనుంది. ప్రస్తుతం సరఫరా అవుతున్న నీరు, డిమాండ్‌లు తదితర స్థితిగతులపై అధ్యయనం చేశారు. భవిష్యత్తు రోజుల్లోనూ తాగునీటికి ఢోకా లేకుండా చేయడం, జనాభాకు అనుగుణంగా నీటి సరఫరా ఎలా ఉండాలన్న అంశాలపై దృష్టి సారించనున్నారు.  సుమారు 20 ఎన్జీవో సంస్థలతో కలిసి గ్రామగ్రామాన క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టనున్నారు. గ్రామాల్లో అందుబాటులో ఉన్న గ్రౌండ్‌ లెవల్‌, ఎలివేటెడ్‌ స్టోరేజీ రిజర్వాయర్లు, ప్రస్తుతం ఉన్న తాగునీటి కనెక్షన్లు, జనాభా, నెలవారీగా ఆ పంచాయతీ చెల్లిస్తున్న నీటి బిల్లు, పంచాయతీ పరిధిలోని కాలనీలు, తాగునీటి సరఫరా వ్యవస్థ లేని ప్రాంతాలు, శరవేగంగా విస్తరిస్తున్న కాలనీలు, ప్రస్తుత నీటి సరఫరా వ్యవస్థలో భాగస్వాములైన లైన్‌మన్లు, నీటిని పంపింగ్‌ చేసేందుకు అందుబాటులో ఉన్న మోటార్లు, పవర్‌ బోర్లు, గ్రామ విస్తీర్ణం, వాల్వ్‌ల సంఖ్య, ప్రస్తుతం అందుబాటులో ఉన్న పైప్‌లైన్ల నిడివి, నూతనంగా ఏర్పాటు చేయాల్సిన నిడివి, ఆయా ప్రాంతాల వాసులకు రోజూ నీళ్లందించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, స్థానికుల అభిప్రాయాలను సేకరించనున్నారు. అదేవిధంగా ప్రతి ఇంటి ఎదుట ఇంకుడు గుంతను నిర్మించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించనున్నారు.