గురువారం 29 అక్టోబర్ 2020
Hyderabad - Oct 01, 2020 , 06:23:08

సాగర్‌లో వ్యర్థాల నియంత్రణకు హెచ్‌ఎండీఏ చర్యలు

సాగర్‌లో వ్యర్థాల నియంత్రణకు హెచ్‌ఎండీఏ చర్యలు

 రెండు చోట్ల ఫ్లోటింగ్‌ ట్రాష్‌ బారియర్స్‌ ఏర్పాటు 

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : హుస్సేన్‌సాగర్‌లోని వ్యర్థాల నియంత్రణకు హెచ్‌ఎండీఏ పకడ్బందీ చర్యలు చేపడుతున్నది. ఫతేనగర్‌, ప్రకాశ్‌నగర్‌, నెక్లెస్‌రోడ్‌, కూకట్‌పల్లి, పికెట్‌, బల్కాపూర్‌ నాలాల గుండా వచ్చే వ్యర్థాలను ఎక్కడికక్కడ కట్టడి చేయాలని నిర్ణయించింది. భారీ వర్షాలు కురిసినప్పుడు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటితో పాటు ప్లాస్టిక్‌ వ్యర్థాలు సాగర్‌లోకి వచ్చి చేరుతున్నాయి. దీంతో సాగర్‌ కలుషితమవుతున్నది. ఇందులో భాగంగానే సాగర్‌లోకి వచ్చే వ్యర్థాల నియంత్రణకు హెచ్‌ఎండీఏ ఫ్లోటింగ్‌ ట్రాష్‌ బారియర్స్‌ (జాలీలు)ను ఏర్పాటు చేసింది. నెక్లెస్‌రోడ్‌లోని బ్రిడ్జి సమీపంలో ఈ ఫ్లోటింగ్‌ ట్రాష్‌ బారియర్స్‌ను రెండు రోజుల కిందట ఏర్పాటు చేసి ప్లాస్టిక్‌, ఇతరత్రా వ్యర్థాలను కట్టడి చేస్తున్నది. చెన్నైకి చెందిన అల్పామర్స్‌ అనే సంస్థ సీఎస్‌ఆర్‌ (కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్స్‌బులిటీ) ఫండ్‌ కింద ఈ ఫ్లోటింగ్‌ ట్రాష్‌ బారియర్స్‌ ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఈ సంస్థ సహకారంతో హెచ్‌ఎండీఏ అధికారులు రెండు చోట్ల వీటిని ఏర్పాటు చేసి చెత్తాచెదారం సాగర్‌లోకి వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు. స్వచ్ఛ సాగర్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నట్లు హెచ్‌ఎండీఏ ఎస్‌ఈ పరంజ్యోతి తెలిపారు.


logo