సిటీబ్యూరో, జూన్ 29 (నమస్తేతెలంగాణ): గ్రేటర్‌వ్యాప్తంగా ఔటర్‌కు ఇరువైపులా ప్రణాళికాబద్దంగా అభివృద్ధికి బాటలు వేస్తున్న మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) కోకాపేటలో భారీ లేఅవుట్‌కు సన్నద్ధమవుతున్నది. దేశంలో మరే ఇతర మెట్రో నగరంలో లేనివిధంగా నియో పొలిస్ (ఎస్ఈజెడ్-స్పెషల్ ఎకనామిక్ జోన్) పేరుతో అభివృద్ధి చేస్తున్నది. సుమారు 529.66 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న ఈ లేఅవుట్‌ను గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టుగా చేపడుతున్నది. 150, 120 అడుగుల వెడల్పుతో విశాలమైన రోడ్లు, అండర్‌గ్రౌండ్ విద్యుత్ కేబుల్స్, తాగునీరు, డ్రైనేజీ లైన్లను అత్యాధునిక తరహాలో ఏర్పాటు చేస్తున్నారు. నిరంతర విద్యుత్ కోసం లేఅవుట్లోనే 400 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణానికి 5.3 ఎకరాలు, తాగునీటి పంప్‌హౌస్ కోసం 9.30 ఎకరాలు కేటాయించి లేఅవుట్‌ను వేగంగాఅభివృద్ధి చేస్తున్నారు. దేశంలో మరే ఇతర లేఅవుట్లో లేనటువంటి మౌలిక వసతులు కల్పిస్తుండగా, ఈ పనుల కోసం రూ.300 కోట్ల వరకు వెచ్చిస్తున్నారు. ఈ నూతన లేఅవుట్లో ఎలాంటి జోనల్ పరిమితులు లేకుండా మల్టీ యూజ్ జోన్ (బహుళ వినియోగ)గా కోకాపేట నియో పొలిస్ భారీ లేఅవుట్‌ను అభివృద్ధి చేస్తుండటంతో దేశానికి రోల్‌మోడల్‌గా నిలుస్తుందని హెచ్ఎండీఏ అధికారులు భావిస్తున్నారు.
అభివృద్ధి చేస్తున్న నియో పొలిస్ భారీ లేఅవుట్ చుట్టూ ఇప్పటికే అన్ని హైరైజ్ బిల్డింగ్లు 30 నుంచి 57 అంతస్థుల వ్యాపార, వాణిజ్య భవనాలతోపాటు గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్టులే అత్యధికంగా ఉన్నాయి. 30కి పైగా హైరైజ్ అపార్టుమెంట్ల నిర్మాణాలు ఈ భారీ లేఅవుట్ పక్కనే ఉండటంతో రియల్ వ్యాపారుల దృష్టంతా ఇప్పుడు కోకాపేట మీదే ఉంది. జూలై 15న ఆన్లైన్ వేలంలో విక్రయించనున్న భూములను సొంతం చేసుకునేందుకు హైదరాబాద్‌కు చెందిన బిల్డర్లే కాకుండా..దేశ,విదేశీ బిల్డర్లు సైతం ఆసక్తి చూపుతున్నారు. ఐటీ కారిడార్‌లో అత్యంత ప్రాధాన్యం గల ఫైనాన్షియల్ డిస్ట్రిక్ సైతం ఈ లేఅవుట్‌ను ఆనుకొని ఉండటం, అందులోనూ 30 నుంచి 60 అంతస్థుల భవనాలు 40 వరకు నిర్మాణంలో ఉన్నాయి. దీంతో అంతకు మించి అంతస్థులు నిర్మించుకునే వీలు కల్పిస్తూ హెచ్ఎండీఏ మల్టీ యూజ్ జోన్‌తోపాటు ఎఫ్ఎస్ఐ (ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్) ప్రకారం ఎన్ని అంతస్థులైనా నిర్మించే అవకాశాన్ని బిల్డర్లకు ఇవ్వడం ఇంకో విశేషం. ఈ లేఅవుట్లోని భూములకు క్లియర్ టైటిల్ ఇవ్వడంతోపాటు అన్నిరకాల అనుమతులు 15-21 రోజుల్లో పొందేలా విధివిధానాలు రూపొందిస్తున్నారు.
నగరానికి ఔటర్ రింగ్‌రోడ్డు మణిహారం లాంటిది. అలాంటి ఔటర్ రింగురోడ్డుకు నియో పొలిస్ లేఅవుట్‌ను అనుసంధానిస్తూ ట్రంపెట్‌ను హెచ్ఎండీఏ నిర్మిస్తున్నది. నగరం లోపలినుంచి ఔటర్‌కు అనుసంధానంగా ఉన్న రేడియల్ రోడ్లతోపాటు దేశంలోని మెట్రోనగరాల నుంచి వచ్చే జాతీయ రహదారులన్నింటితో ఓఆర్ఆర్ 19 చోట్ల కలిసి ఉంది. వీటికితోడు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఓఆర్ఆర్ మీదుగా 20 నిమిషాల్లో నియో పొలిస్ లేఅవుట్‌కు చేరుకునేలా ఆధునిక రీతిలో ట్రంపెట్‌ను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం దీని పనులు పురోగతిలో ఉన్నాయి.
కోకాపేటలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధితోపాటు భవిష్యత్తులో చేపట్టే ప్రాజెక్టుల నిర్మాణాల ఆధారంగా సోషల్ మీడియాలో పదుల సంఖ్యలో వీడియోలను రూపొందించారు. ముఖ్యంగా యూట్యూట్‌లో కోకాపేట రియల్ ఎస్టేట్, కోకాపేట హైరైజ్ ప్రాజెక్టుల పేరుతో వెతికితే సుమారు 100కు పైగా వీడియోలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో అనుభవం ఉన్నవారి ఇంటర్వ్యూలు, అక్కడ ప్రాజెక్టులు చేపట్టిన కంపెనీల సైట్లు, బ్రోచర్లతో వీడియోలను రూపొందించి కోకాపేట ప్రస్తుత, భవిష్యత్ రూపాలను వివరిస్తున్నారు.