బుధవారం 30 సెప్టెంబర్ 2020
Hyderabad - Aug 14, 2020 , 01:09:57

కళాత్మక కట్టడానికి చారిత్రక నగిషీలు..

కళాత్మక కట్టడానికి చారిత్రక నగిషీలు..

వారసత్వపు నిర్మాణానికి ప్రత్యేక శ్రద్ధతో సొబగులు

ప్రాణం పోసుకుంటున్న మొజాంజాహి మార్కెట్‌

పాత కట్టడం చెక్కు చెదరకుండా పునరుద్ధరణ పనులు 

నేడు సందర్శించనున్న మంత్రి కేటీఆర్‌

అబిడ్స్‌: చారిత్రక మొజాంజాహి మార్కెట్‌ నిజాం కాలం నాటి వన్నెలద్దుకొని మెరిసిపోనున్నది. నాటి దర్పం ఉట్టిపడేలా అన్ని హంగులతో తిరిగి ప్రాణం పోసుకున్నది. అలనాటి కట్టడం ఏ మాత్రం చెక్కుచెదరకుండా అధికారులు పునరుద్ధరణ పనులు చేపట్టారు. జాక్‌ ఆర్చ్‌ సీలింగ్‌కు మరమ్మతులు చేశారు. కాంప్లెక్స్‌ తలుపులు, కిటికీలు ధ్వంసం కావడంతో వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేశారు. కాంప్లెక్స్‌ పైకి ఎక్కేందుకు ఉన్న మెట్లను కూడా తీర్చిదిద్దారు. శిథిలమైన గోడలు, సజ్జా(స్లాబ్‌)లు, స్పైరల్‌ స్టెయిర్‌కేస్‌ను రిపేర్‌ చేశారు. మినార్‌ డోమ్స్‌పైన పెయింటిగ్స్‌ను తొలగించి కొత్తగా వేశారు. కాంప్లెక్స్‌ ముందు భాగాలను శుభ్రం చేశారు. రాతి కట్టడాలను అందంగా మలిచారు. రాజస్థాన్‌ నుంచి ప్రత్యేకంగా రాళ్లను తెప్పించి ఫ్లోరింగ్‌ వేశారు. కాంప్లెక్స్‌లో ఆకర్శనగా ఉండేందుకు జూమర్‌ను ఏర్పాటు చేశారు. భారీ వర్షం కురిసినా కాంప్లెక్స్‌లోకి నీరు చేరకుండా డ్రైనేజీని నిర్మించారు. లీకేజీలను సరిచేశారు. మొదటి అంతస్తులో కాంప్లెక్స్‌ చరిత్రను ఏర్పాటు చేశారు. కాంప్లెక్స్‌కు నలువైపులా ఉన్న గడియారాలకు మరమ్మతులు చేశారు. కాంప్లెక్స్‌ మొత్తాన్ని విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేశారు.  

మోగుతున్న గడియారాలు..

మొజాంజాహి మార్కెట్‌కు ఉన్న  క్లాక్‌ టవర్‌ను అధికారులు పునరుద్ధరించారు. కాంప్లెక్స్‌కు నాలుగు వైపులా ఉన్న గడియారాలు పనిచేసేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. దీంతో గంట, గంటకు గడియారం మోగుతున్నది. పరిసర ప్రాంతాల్లో ఈ గంట చప్పుడు వినిపిస్తున్నది. మొజాంజాహి మార్కెట్‌కు ఉన్న గడియారాలకు అధికారులు అనేక సార్లు మరమ్మతులు చేశారు. అయినా ఫలితం లేకపోయింది. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. హెచ్‌ఎంటీ బెంగళూరు వారిని పిలిపించారు. రిపేర్లు చేయించారు.  ప్రస్తుతం ఈ గడియారాలు పనిచేస్తుండటంతో స్థానికులు, వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

ధగధగలాడుతున్న కాంప్లెక్స్‌..  

మొజాంజాహి మార్కెట్‌ కాంప్లెక్స్‌కు విద్యుత్‌ దీపాలను అమర్చడంతో ధగధగలాడుతున్నది. అయితే కొన్ని రోజులుగా ప్రయోగాత్మకంగా అనేక రకాల విద్యుత్‌ దీపాలను ఏర్పాటు చేయించారు. అందులో కాంప్లెక్స్‌కు అందం పెంచే వాటిని ఎంపిక చేశారు. ప్రస్తుతం ప్రజలను అవి ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. అంతేగాక మున్సిపల్‌ కాంప్లెక్స్‌ మధ్యలో జాతీయ జెండాను ఏర్పాటు చేయడంతో ప్రత్యేక ఆకర్శణగా నిలిస్తున్నది. 

పర్యాటక కేంద్రంగా మారే అవకాశం.. 

అన్ని హంగులతో రూపు మార్చుకున్న మొజాంజాహి మార్కెట్‌ పర్యాటక కేంద్రంగా మారే అవకాశం ఉంది. 2018లో నుంచి కాంప్లెక్స్‌ పునరుద్ధరణ పనులు చేపట్టిన అధికారులు నిజాం కాలం నాటి నిర్మాణంగా మార్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కాంప్లెక్స్‌లో చికెన్‌, మటన్‌ మార్కెట్‌ను అధునాతన పద్ధతిలో నిర్మించారు. ఈ దుకాణాల్లో మార్బుల్‌ ఫ్లొరింగ్‌, ఫ్లాట్‌ఫాంలను నిర్మించారు. దుకాణాల మధ్య ైస్లెడింగ్‌ గ్లాస్‌లు, హెరిటేజ్‌ పద్ధతిలో లైట్లను ఏర్పాటు చేశారు. అంతేకాక ఉడెన్‌బోర్డులో ఇంగ్లిష్‌, ఉర్దూలో నంబర్లు కేటాయించారు.  

నేడు సందర్శించనున్న మంత్రి కేటీఆర్‌ ..
మొజాంజాహి మార్కెట్‌ మరమ్మతు పనులు పూర్తి కావడంతో శుక్రవారం సాయంత్రం మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ సందర్శించి పరిశీలించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇదిలా ఉంటే ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ ఈ పనుల  నిర్వహణ బాధ్యతలు తీసుకున్నారు. రూ.15కోట్లతో చేపట్టిన ఈ పనులను సమయం దొరికినప్పుడల్లా ఆయన పరిశీలించించారు. నిజాం కాలంనాటి దర్పం ఉట్టిపడేలా సూచనలు చేస్తూ పూర్తి చేయించారు. గతంలోనూ ఈ పనులను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌, చీఫ్‌ సెక్రటరీ సోమేశ్‌కుమార్‌ పరిశీలించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, శ్రీనివాస్‌ యాదవ్‌, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్‌ అలీ, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌ పాల్గొననున్నారు. 

తాజావార్తలు


logo