e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, July 27, 2021
Home హైదరాబాద్‌ గేట్లెత్తారు..

గేట్లెత్తారు..

గేట్లెత్తారు..
  • గరిష్ఠ స్థాయికి హిమాయత్‌సాగర్‌ నీటిమట్టం
  • ఒక ఫీటు మేర మూడు గేట్ల ఎత్తివేత
  • మూసీలోకి నీటి ప్రవాహం
  • 4.5 అడుగుల దూరంలో ఉస్మాన్‌సాగర్‌

నగరానికి తాగునీటినందించే జంట జలాశయాలు హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌(గండిపేట)లకు వరద పోటెత్తుతున్నది. విరామం లేకుండా కురుస్తున్న వర్షాలతో హిమాయత్‌సాగర్‌ పూర్తిగా నిండడంతో మంగళవారం సాయంత్రం మూడు గేట్లను ఒక ఫీటు మేర ఎత్తి నీటిని మూసీలోకి వదులుతున్నారు. దీంతో పాతబస్తీ ప్రాంతాలకు 10 నుంచి 12 ఎంజీడీల నీటిని అదనంగా సరఫరా చేయనున్నారు. మరోవైపు 4.5 అడుగులు చేరితే గండిపేట పూర్తిగా నిండనుంది.

సిటీబ్యూరో, జూలై 20 (నమస్తే తెలంగాణ)/బండ్లగూడ: అవి వంద ఏండ్ల కింద నిర్మించిన స్వచ్ఛమైన సరస్సులు. హైదరాబాద్‌ నగర ప్రజల దాహార్తిని తీర్చడంతో పాటు ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరదలను అదుపు చేసేందుకు చివరి నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ 1908వ సంవత్సరంలో హిమాయత్‌ సాగర్‌, ఉస్మాన్‌ సాగర్‌లను నిర్మించారు. అయితే అవి పూర్తిస్థాయిలో నిండి మత్తడి దూకింది మాత్రం ఓ పదిహేను సార్లు మాత్రమే. కానీ గత రెండు సంవత్సరాలుగా కురుస్తున్న భారీ వర్షాలతో జంటజలాశయాలు పూర్తిస్థాయిలో నిండి కనువిందు చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా తొలకరి పలకరించిన తొలినాళ్లలోనే హిమాయత్‌ సాగర్‌ నిండుకుండలా మారింది.

- Advertisement -

మంగళవారం సాయంత్రం పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు కలిసి జలాశయం మూడుగేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. హిమాయత్‌సాగర్‌ పూర్తిస్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు (2.97 టీఎంసీలు). ప్రస్తుతం 1762.90 (2.773 టీఎంసీలు) ఉందని, 1,250 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 1030 అవుట్‌ ఫ్లో కొనసాగుతున్నదని జలమండలి అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే జలాశయం గేట్లు ఎత్తడంతో సమీప ప్రాంతాల నుంచి సందర్శకుల తాకిడి పెరిగింది. ఇకపోతే ఉస్మాన్‌సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1790.00 అడుగులు(3.90 టీఎంసీలు). ప్రస్తుతం 1784.70 అడుగులు(2.782 టీఎంసీలు) ఉందని, 120 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుందని జలమండలి అధికారులు తెలిపారు. ఉస్మాన్‌ సాగర్‌ మరో ఒకటి రెండు రోజుల్లో నిండే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

సురక్షిత ప్రాంతాలకు తరలింపు

హిమాయత్‌ సాగర్‌ మూడు గేట్లను ఒక ఫీటు మేర ఎత్తడంతో ముందు జాగ్రత్త చర్యగా లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాం. హిమాయత్‌సాగర్‌, ఈసీ, మూసీ నది పరీవాహక ప్రాంతాలను జలమండలి సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. ప్రజలెవ్వరూ ప్రాజెక్టుల వద్దకు వెళ్లరాదు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాం. నగరవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న సమాచారం మేరకు హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల కలెక్టర్లతో పాటు జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించాం.- దానకిశోర్‌, జలమండలి ఎండీ

ఇక నుంచి 12 ఎంజీడీలు..

జంట జలాశయాలు నిండటంతో ఓల్డ్‌సిటీ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాను పెంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు హిమాయత్‌సాగర్‌ నుంచి 6 ఎంజీడీలు తీసుకుంటుండగా.. ఇక నుంచి ప్రతి రోజు 10 నుంచి 12 ఎంజీడీలు అదనంగా తీసుకోనున్నారు. ఇక ఉస్మాన్‌ సాగర్‌ నుంచి 12 ఎంజీడీల నీటిని నగరానికి తరలించనున్నారు. ఇదిలా ఉంటే హిమాయత్‌సాగర్‌ గేట్లు ఎత్తిన కార్యక్రమంలో మేయర్‌ మహేందర్‌ గౌడ్‌, డిప్యూటీ మేయర్‌ పూలపల్లి రాజేందర్‌రెడ్డి, రాజేంద్రనగర్‌ ఆర్డీవో చంద్రకళ, బండ్లగూడ జాగీర్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ వేణుగోపాల్‌రెడ్డి, రాజేంద్రనగర్‌ ఏసీపీ సంజయ్‌కుమార్‌, సీఐ కనకయ్య, జలమండలి అధికారులు, కార్పొరేటర్లు ముద్దం రాములు, నాయకులు బీజేఎంసీ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు సురేశ్‌గౌడ్‌, రావులకోళ్ల నాగరాజు, అమరేందర్‌, కార్పొరేషన్‌ సిబ్బంది పాల్గొన్నారు.

నిండు కుండల్లా జంటజలాశయాలు

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో చెరువులు, కుంటలు, జలాశయాలు నిండుతున్నాయి. ముఖ్యంగా ఎగువ నుంచి వచ్చిన భారీ వరదతో జంట జలాశయాలు నిండు కుండల్లా మారాయి. నాడు నగరానికి మంచినీరు అందించిన ఈ జలాశయాలు సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన మిషన్‌ భగీరథలో స్టోరేజీ రిజర్వాయర్లుగా మారడం సంతోషంగా ఉంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
గేట్లెత్తారు..
గేట్లెత్తారు..
గేట్లెత్తారు..

ట్రెండింగ్‌

Advertisement