శనివారం 27 ఫిబ్రవరి 2021
Hyderabad - Jan 28, 2021 , 06:04:18

వెలుగులు పంచుతున్న గుట్టలు

వెలుగులు పంచుతున్న గుట్టలు

  • అవుటర్‌పై మరో మూడు కిలోమీటర్ల మేర హిల్‌ లైటింగ్‌
  • ఇప్పటికే గచ్చిబౌలి-శంషాబాద్‌ మార్గంలో కనువిందు
  • పనులు ముమ్మరంగా సాగుతున్నాయని అర్వింద్‌కుమార్‌ ట్వీట్‌

ఇప్పటికే ఆకుపచ్చటి అందాలతో వెలిగిపోతున్న నగర మణిహారమైన అవుటర్‌ రింగు రోడ్డుకు హిల్‌ లైటింగ్‌ రాత్రివేళల్లో మరింత శోభను తేనున్నది. అవుటర్‌ను అనుసరించి ఉన్న గుట్టల్లో బౌల్డర్స్‌ లైటింగ్‌ ఏర్పాటుతో చూపరులను కనువిందు చేసేందుకు పురపాలక శాఖ చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే గచ్చిబౌలి-శంషాబాద్‌ మార్గంలో ఏర్పాటైన హిల్‌ లైటింగ్‌, ఎల్‌ఈడీ వెలుగులు అదనంగా మూడు కిలోమీటర్లలో ఏర్పాటవుతున్నాయి. ఈ మేరకు పనులు ముమ్మరంగా సాగుతున్నాయని పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ బుధవారం ట్వీట్‌లో వెల్లడించారు. అవుటర్‌ మీదుగా శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లేందుకు గచ్చిబౌలి-శంషాబాద్‌ మార్గంలో నిత్యం వీవీఐపీలు, వీఐపీల తాకిడి అత్యధికంగా ఉంటుంది. నిత్యం ప్రముఖులు పర్యటించే ఈ మార్గంలో 22కిలోమీటర్ల పొడవునా ఎనిమిది లేన్ల మెయిన్‌ కారిడార్‌లోని సెంట్రల్‌ మీడియన్‌లో రూ.30 కోట్లు ఖర్చు పెట్టి ఎల్‌ఈడీ లైట్లు అమర్చారు. వెలుగుల వలయంలో జిగేల్‌.. జిగేల్‌మంటూ ఆకట్టుకుంటున్నాయి. పర్యావరణహిత, సాంకేతికత, ఇతర విద్యుత్‌ లైట్లతో పోలిస్తే ఎల్‌ఈడీతో యాభై శాతం విద్యుత్‌ ఆదా అవుతుంది. దీంతో పాటు జీఎస్‌ఎం ఆటోమెటిక్‌ సిస్టం ద్వారా ఎక్కడి నుంచైనా పర్యవేక్షించే అవకాశం ఈ వ్యవస్థలో ఉంది. అవుటర్‌ రింగు రోడ్డు నిర్మాణంలో భాగంగా అనేక చోట్ల పెద్ద పెద్ద గుట్టల్ని తొలిచి రహదారిని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో అనేక చోట్ల రెండువైపులా గుట్టలు ఉండటం ఓఆర్‌ఆర్‌కు శోభనిస్తున్నది. అయితే రాత్రివేళల్లో కూడా ఇవి కనువిందు చేసేందుకు వీలుగా హిల్‌ లైట్లు ఏర్పాటు చేస్తున్నారు. 

VIDEOS

logo