గురువారం 29 అక్టోబర్ 2020
Hyderabad - Sep 20, 2020 , 01:42:38

భారీ వర్షం.. జనజీవనం అస్తవ్యస్తం

భారీ వర్షం.. జనజీవనం అస్తవ్యస్తం

లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీరు  

కూలిన చెట్లు, పాడైన రోడ్లు

బల్దియాకు 422 ఫిర్యాదులు 

మరో మూడు రోజులు వానలు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నగరంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. రోడ్లు నీట మునగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చెట్లు నేలకూలాయి. శనివారం మధ్యాహ్నం నుంచి పలు చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. గ్రేటర్‌లోని కాప్రా, కుషాయిగూడలో అత్యధికంగా 7.2సెం. మీల వర్షపాతం నమోదవగా,  మూసాపేట బాలాజీనగర్‌లో అత్యల్పంగా 1.0సెం.మీల వర్షపాతం నమోదైనట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఆదివారం మరో అల్పపీడనం ఏర్పడుతుందని దీని కారణంగా మూడు రోజులు గ్రేటర్‌లోని పలు చోట్ల భారీ నుంచి అతిభారీ, మరికొన్ని చోట్ల మోస్తారు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వివరించారు. ప్రజా సమస్యలపై జీహెచ్‌ఎంసీకి నాలుగు రోజుల్లో 422ఫిర్యాదులొచ్చాయి. మరోవైపు, మాన్సూన్‌ యాక్షన్‌ టీమ్‌లు, డిజాస్టర్‌ బృందాలు మూడు షిఫ్టుల్లో పనిచేస్తూ లోతట్టు ప్రాంతాల్లో నీటిని తొలిగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ తెలిపారు.  వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టిన తరువాత రోడ్ల మరమ్మతులు చేపడతామని ఇంజినీరింగ్‌ అధికారులు తెలిపారు. 

ప్రాంతం సె.మీ

కాప్రా, కుషాయిగూడ 7.2

ఉప్పల్‌ 5.7

అబ్దుల్లాపూర్‌మెట్‌ 4.5

కీసర, దమ్మాయిగూడ 4.1

చర్లపల్లి 4.0

మౌలాలి 3.9

సరూర్‌నగర్‌, ఎల్బీనగర్‌ 3.3 


logo