సోమవారం 18 జనవరి 2021
Hyderabad - Nov 24, 2020 , 08:23:25

నగరంలో భారీగా డ్రగ్స్‌ పట్టివేత: ముగ్గురు అరెస్టు

నగరంలో భారీగా డ్రగ్స్‌ పట్టివేత: ముగ్గురు అరెస్టు

హైదరాబాద్‌ : యెమెన్‌, బెంగళూరు, ధూల్‌పేట కేంద్రంగా నగరంలో పలు రకాల మత్తు పదార్థాలు విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను హైదరాబాద్‌  డీటీఎఫ్‌ అధికారులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద 300 గ్రాముల ఖత్‌(యెమెన్‌ డ్రగ్‌), 30 గ్రాముల ఎండీఎంఎ, 1.1 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌ ఈఎస్‌ శ్రీనివాస్‌, డీటీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ కరుణారెడ్డి కథనం ప్రకారం.. నగరంలో మత్తు పదార్థాల విక్రయాలు జరుగుతున్నట్టు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు డీటీఎఫ్‌ బృందం ఆదివారం అర్ధరాత్రి గోల్కొండ, టోలీచౌకి గెలాక్సీ థియేటర్‌ వద్ద వాహనాలను తనిఖీ చేపట్టింది. ఈ క్రమంలో యెమెన్‌ దేశానికి చెందిన అబ్దుల్‌ మహ్మద్‌ అబ్దుల్లా గియాష్‌, మహ్మద్‌ అబ్దుల్లా అహ్మద్‌ అల్వార్‌ అలీ వెళ్తున్న బైక్‌ను తనిఖీ చేశారు. 

వారి వద్ద ‘ఖత్‌' అనే 300 గ్రాముల డ్రగ్‌ లభించింది. ఇది కేవలం యెమెన్‌ దేశంలో మాత్రమే లభిస్తుందని,  2013లో మొట్టమొదటిసారిగా నగరంలో ఈ డ్రగ్‌ను విక్రయిస్తున్న నిందితులను అరెస్టు చేయగా.. తాజాగా జరిపిన తనిఖీల్లో మరోసారి పట్టుబడినట్టు కరుణారెడ్డి వివరించారు. గ్రీన్‌-టీని పోలి ఉన్న ఈ డ్రగ్‌ను సులభంగా గుర్తించలేమని చెప్పారు. టోలీచౌకిలోని అర్వింద్‌ కాలనీలోని నిందితుల నివాసంలోనూ 30 గ్రాముల ఎండీఎంఎ, 1.1 కిలోల గంజాయితోపాటు నాలుగు గంజాయి మొక్కలను గుర్తించి స్వాధీనం చేసుకుని అబ్దుల్‌ రెహ్మాన్‌ మహ్మద్‌ అబ్దుల్లా అనే మరో వ్యక్తిని అరెస్టు చేశారు. యెమెన్‌కు చెందిన అలీ ఖాఫై సలీం సూచనల మేరకు నిందితులు నగరంలో డ్రగ్స్‌ వ్యాపారం నిర్వహిస్తున్నట్టు వెల్లడైంది. యెమెన్‌ నుంచి ఖత్‌ అనే డ్రగ్‌, బెంగళూరు నుంచి ఎండీఎంఎ, ధూల్‌పేట నుంచి గంజాయిని తీసుకొచ్చి విక్రయిస్తున్నట్టు ఆబ్కారీ అధికారులు వివరించారు.